Share News

దున్నపోతులకు వినతిపత్రాలు

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:25 AM

అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె మంగళవారానికి 22వ రోజుకు చేరింది.

దున్నపోతులకు వినతిపత్రాలు
దర్శిలో దున్నపోతుకు వినతిపత్రం ఇస్తున్న అంగన్‌వాడీలు

22వ రోజుకు చేరిన అంగన్‌వాడీల సమ్మె

అన్ని కేంద్రాల్లో ఆందోళనలు

ఒంగోలు నగరం, జనవరి 2 : అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె మంగళవారానికి 22వ రోజుకు చేరింది. వివిధ రూపాల్లో, వినూత్న పద్ధతిలో తమ ఆందోళనను కొనసాగిస్తున్న కార్యకర్తలు, ఆయాలు మంగళవారం దున్నపోతులకు వినతిపత్రాలను ఇచ్చి నిరసనను తెలియజేశారు. జిల్లాలోని అన్ని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల కేంద్రాల్లో రిలేదీక్షలు నిర్వహిస్తూనే ఎక్కడికక్కడ దున్నపోతుకు అర్జీలు సమర్పించారు. గత 22 రోజులుగా తాము చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలియజేస్తూ ఇలా నిరసన తెలిపారు. ఇకనైనా నిద్రలేచి తమతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఒంగోలులో కలెక్టరేట్‌ వద్ద దీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని సీఐటీయూ నాయ కులు దామా శ్రీనివాసులు, జీవీకొండారెడ్డి, నారాయణరెడ్డి, మహేష్‌ సందర్శించి మద్ద తు ప్రకటించారు. అంగన్‌వాడీల యూనియన్‌ నాయకులు కేవీ సుబ్బమ్మ, ప్రశాంతి, జ్యోతి, హేమోమా పాల్గొని దున్నపోతుకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం మొద్దు నిద్రవీడాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. దర్శి, కనిగిరి, మార్కాపురం, పొదిలి తదితర ప్రాంతాల్లో కార్యకర్తలు, ఆయాలు ఆందోళన నిర్వహించి దున్నపోతు లకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్సు అండ్‌ హెల్పర్సు యూనియన్‌ నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళన విరమిం చేదిలేదన్నారు. ఇంతకాలం ప్రభుత్వం గౌరవ వేతనం పేరుతో తమను నానా ఇబ్బం దులకు గురిచేసిందన్నారు. గౌరవ వేతనం కాదు కనీస వేతనం నెలకు రూ.25వేలు చెల్లించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. వైసీపీ మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉద్యమాన్ని చులకన చేసి మాట్లాడటం శోచనీయన్నారు. తమను పట్టించుకోకపోతే సత్తా ఏమిటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామని వారు హెచ్చరించారు.

Updated Date - Jan 03 , 2024 | 12:25 AM