Share News

ఇళ్ల వద్దనే పింఛన్లు ఇవ్వాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:17 AM

లబ్ధిదారులను సచివాలయాలకు పిలవకుండా ఇళ్ల వద్దనే పింఛన్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ, మిత్రపక్షాలు డిమాండ్‌ చేశాయి.

ఇళ్ల వద్దనే పింఛన్లు ఇవ్వాలి
కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు

టీడీపీ, మిత్రపక్షాలు డిమాండ్‌

అధికారులకు వినతిపత్రాలు

ఒంగోలు, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): లబ్ధిదారులను సచివాలయాలకు పిలవకుండా ఇళ్ల వద్దనే పింఛన్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ, మిత్రపక్షాలు డిమాండ్‌ చేశాయి. అందుకోసం సచివాలయ సిబ్బందిని ఇళ్లకు పంపించాలని కోరాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో వలంటీర్లు పింఛన్లు అందజేస్తుండగా ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వారిని ఆ విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. 1వతేదీకి బదులు 3వతేదీ నుంచి సచివాలయాల వద్ద లబ్ధిదారులకు పింఛన్లు అందజేసేలా ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో పింఛన్ల పంపిణీని టీడీపీ అడ్డుకుంటున్నదని వైసీపీ దుష్ప్రచారం ప్రారంభించింది. ఈ వ్యవహారంపై టీడీపీ మండిపడింది. ఎన్నికల వేళ ఖజానాలో ఉన్న సొమ్మును తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లకు ఇచ్చేసిన వైసీపీ ప్రభుత్వం పింఛన్‌ చెల్లింపులకు డబ్బు లేకుండా చేసి దానిని బయటకు రాకుండా ఉండేలా టీడీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సచివాలయాల సిబ్బంది ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఒక రోజులోనే ఇచ్చే అవకాశం ఉన్నా అందుకు విరుద్ధంగా లబ్ధిదారులను సచివాలయాలకు రావాలని, వారంరోజులపాటు పంచుతామని చెప్పి టీడీపీపై విషప్రచారం చేస్తున్నదని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం ఇళ్ల వద్దకే సిబ్బంది వెళ్లి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం టీడీపీ శ్రేణులు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా వినతిపత్రాలు అందించిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నిరసన తెలిపారు. ఒంగోలులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, జనసేన అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, బీజేపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి వైసీ యోగయ్య యాదవ్‌లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆలాగే నాగులుప్పలపాడు, సంతనూతలపాడు, టంగుటూరు. జరుగుమల్లి, తాళ్ళూరు. పామూరు, గిద్దలూరు అర్థవీడు, కంభం, వెలిగండ్ల, ముండ్లమూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, తర్లుపాడులతోపాటు పలు ఇతర మండలాల్లోనూ టీడీపీ మిత్రపక్షాల నేతలు అక్కడి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు.

Updated Date - Apr 03 , 2024 | 01:17 AM