కోరిన చోటుకే పింఛన్
ABN , Publish Date - Sep 10 , 2024 | 01:06 AM
రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిపొందుతున్న వారు ఇక నుంచి కోరిన చోటనే పింఛన్ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. జిల్లాలోని ఇతర మండలాలకు కానీ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కానీ మార్చుకుని తీసుకునే అవకాశం ఇచ్చింది.
ఆన్‌లైన్ ద్వారా బదిలీకి అవకాశం కల్పించిన ప్రభుత్వం
తొలగనున్న లబ్ధిదారుల ఇబ్బందులు
నూరుశాతం పంపిణీకి చర్యలు
ఒంగోలు నగరం, సెప్టెంబరు 9 : రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిపొందుతున్న వారు ఇక నుంచి కోరిన చోటనే పింఛన్ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. జిల్లాలోని ఇతర మండలాలకు కానీ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కానీ మార్చుకుని తీసుకునే అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలోని చాలామంది పింఛన్‌దారులు సొంతూర్లకు దూరంగా ఉంటున్నారు. ప్రధానంగా వృద్ధులు తమ పిల్లల వద్ద ఉంటున్నారు. వీరు ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్ సొమ్ము కోసం వ్యయప్రయాసలకోర్చి సొంత గ్రామాలకు వచ్చి తీసుకోవాల్సి వస్తోంది. ఇలా ప్రతినెలా రావాల్సి ఉండటంతో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది దూరం నుంచి రాలేక ఒక్కో నెలలో పింఛన్ సొమ్మును పొందలేకపోతున్నారు. ప్రభుత్వం మాత్రం నూటికి నూరుశాతం పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ ఈ కారణాల వలన 99శాతం వరకే పింఛన్‌ల పంపిణీ జరుగుతోంది. అది నూటికి నూరుశాతం కావాలంటే లబ్ధిదారులు ఎక్కడ నివాసం ఉంటుంటే అక్కడే పింఛన్ ఇవ్వాల్సి ఉందని గుర్తించింది. అందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. దీంతో వచ్చేనెల నుంచి నూరుశాతం పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది.
సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి
లబ్ధిదారులు ముందుగా తాము పింఛన్ పొందుతున్న సచివాలయాన్ని సంప్రదించి అక్కడి నుంచి ఎక్కడికి పింఛన్‌ను మార్చుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలను తెలియజేయాల్సి ఉంది. బదిలీ కోరుకునే గ్రామం, సచివాలయం పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ నకలు, పింఛన్ పొందుతున్న ఐడీని చూపించాలి. పింఛన్ బదిలీ మండల పరిధిలో అయితే వెంటనే జరిగిపోతుంది. అదే ఇతర జిల్లాకు అయితే వెలుగు, డీఆర్‌డీఏ పీడీ లాగిన్ నుంచి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
జిల్లాలో 2,89,096 మంది పింఛన్‌దారులు
జిల్లాలో ప్రస్తుతం 2,89,096 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 1,57,116, వితంతువులు 67,913, దివ్యాంగులు 33,590, ఒంటరి మహిళలు 7,808, చర్మకారులు 5,339, డప్పు కళాకారులు 4,682, మత్స్యకారుల 2,530, చేనేత కార్మికులు 1,811, కల్లు గీత కార్మికులు 246, హిజ్రాలు 90, కళాకారులు 60, అభయహస్తం 4872, అమరావతి ల్యాండ్స్ పూర్ 5, సీకేడీయూ 186, సీకేడీయూ ప్రయివేట్ 336, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు 2,490, మాజీ సైనికులు 22మంది నెలవారీ ప్రభుత్వం నుంచి పింఛన్లు పొందుతున్నారు. వీరికి పింఛన్లు అందజేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రతినెలా రూ.123కోట్లకుపైగా నిధులను విడుదల చేస్తోంది. వీరిలో అనేకమంది లబ్ధిదారులు ఇతరచోట్ల నివాసం ఉంటూ పింఛన్ సొమ్ము కోసమే సొంతూరికి వస్తున్నారు. ఇకపై లబ్ధిదారులు ఇలాంటి ఇబ్బందులు పడకుండా వారు ఉండే ప్రాంతానికే పింఛన్‌ను మార్చుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
-------------------------------