Share News

తక్షణమే పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:20 AM

గృహ నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆశాఖ అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సిమెంటును కూడా తక్షణమే సరఫరా చేయాలన్నారు.

తక్షణమే పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
గృహనిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడుతున్న మంత్రి స్వామి

గృహనిర్మాణ లబ్ధిదారులకు సిమెంటునూ సరఫరా చేయాలి

అధికారులకు మంత్రి స్వామి ఆదేశం

సచివాలయ వ్యవస్థపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి

తూర్పునాయుడుపాలెం (టంగుటూరు) జూలై 27 : గృహ నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆశాఖ అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సిమెంటును కూడా తక్షణమే సరఫరా చేయాలన్నారు. మండలంలోని తూర్పునాయుడుపాలెంలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో శనివారం గృహనిర్మాణ శాఖ, గ్రామ సచివాలయాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో రూ.50 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి 2014-2019 కాలంలో నిర్మించుకున్న ఇళ్లకు కూడా వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా నిలిపివేసిందన్నారు. వాటిని త్వరిగతిన చెల్లించేలా చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు.

ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు పింఛన్‌ల పంపిణీ పూర్తి చేయాలి

గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్ష సందర్భంగా మంత్రి స్వామి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈసందర్భంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ.. తమపై అజమాయిషీ చేసేది మాతృశాఖలు కాగా, జీతాలు ఇచ్చేది పంచాయతీ కార్యదర్శులని వివరించారు. తమను పూర్తిస్థాయిలో మాతృశాఖలకు అనుసంధానం చేసి జూనియర్‌ అసిస్టెంట్‌ పేస్కేలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ, వార్డు, సచివాలయ వలంటీర్ల వ్యవస్థపై త్వరలో కమిటీ వేసి అధ్యయనం చేస్తామన్నారు. ఆ కమిటీ నివేదిక అనంతరం విధివిధానాలు రూపొందిస్తామన్నారు. వచ్చే నెల పింఛన్ల పంపిణీ ఒకటో తేదీ ఉదయం 6గంటలకే ప్రారంభించి 10గంటలలోపు పూర్తి చేయాలని మంత్రి గ్రామ సచివాలయ సిబ్బందికి సూచించారు.

Updated Date - Jul 28 , 2024 | 01:20 AM