Share News

కొనసాగుతున్న వసూళ్ల పంచాయితీ

ABN , Publish Date - Oct 06 , 2024 | 11:29 PM

గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న గ్రేడ్‌-5, గ్రేడ్‌-6 (సచివాలయ కార్యదర్శులు) ఉద్యోగుల బదిలీల్లో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పైసలు తీసుకొని పోస్టింగ్‌లు ఇస్తున్నారన్న ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

కొనసాగుతున్న వసూళ్ల పంచాయితీ

పైసలిస్తేనే గ్రేడ్‌-5,6 ఉద్యోగులకు పోస్టింగ్‌

ఒక్కొక్కరి వద్ద రూ.30వేల నుంచి రూ.50వేలు వసూలు

అక్రమాలపై కలెక్టర్‌ అన్సారియా ఆరా

అయినా మారని అధికారి తీరు

కలకలం రేపిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

ఒంగోలు (కలెక్టరేట్‌), అక్టోబరు 6 : గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న గ్రేడ్‌-5, గ్రేడ్‌-6 (సచివాలయ కార్యదర్శులు) ఉద్యోగుల బదిలీల్లో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పైసలు తీసుకొని పోస్టింగ్‌లు ఇస్తున్నారన్న ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈ విషయమై కలెక్టర్‌ అన్సారియా ఆరా తీసినప్పటికీ ఆశాఖ అధికారులు, ఉద్యోగులు తీరు మాత్రం మా రడం లేదు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘వసూళ్ల పంచాయితీ’ శీర్షికన ప్రచురితమైన కథనం కలకలం రేకెత్తించింది. అయినప్పటికీ ఆ శాఖ అధికారి మాత్రం ఒక్కో పోస్టుకు రేటు నిర్ణయించి ఇద్దరు ఉద్యోగుల ద్వారా వసూళ్ల పర్వం కొనసాగించడాన్ని బట్టి చూస్తే ఎంతకు బరి తెగించారో అర్థమవుతుంది.

మండల అధికారికి అందని సమాచారం

సాధారణ బదిలీలు అయితే వెంటనే ఆ ఆర్డర్లను సంబంధిత ఉద్యోగికి ఇవ్వడంతో పాటు మండల స్థాయి అధికారికి మెయిల్‌ ద్వారా సమాచారం పంపించాల్సి ఉంది. కానీ ఆవిధంగా చేస్తే ఉద్యోగులు ఆఫీసుకురారని, తమకు అమ్యామ్యాలు అందవన్న కారణంతో వాటిని సదరులు వసూల్‌ రాజాలు తమ వద్దనే పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అదేసమయంలో ఆర్డర్లు బయట పెడితే ప్రజాప్రతినిధులు చేసిన సిఫార్సుల ప్రకారం బదిలీలు చేయని విషయం బహిర్గతమై ఇబ్బందులు ఎదురవుతాయన్న మరో కారణంతో కూడా వారు జాగ్రత్త పడుతున్నారు. మొత్తం మీద అటు ప్రజాప్రతినిధుల నుంచి ఇబ్బందులు లేకుండా, ఇటు తమ జేబులు నిండేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఒక కీలక ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలోని గ్రేడ్‌-5 ఉద్యోగిని నియమించాలని సిఫార్సు చేశారు. కానీ ఆయన చెప్పిన పేరు కాకుండా మరొకరిని ఆ పోస్టులో నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేడ్‌-5, గ్రేడ్‌-6 ఉద్యోగుల బదిలీల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేస్తే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.


ఇద్దరు ఉద్యోగుల కీలక పాత్ర

వసూళ్ల విషయంలో ఇద్దరు ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల వరకూ జిల్లా పంచాయతీ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేసి రిలీవ్‌ అయిన ఒక ఉద్యోగి తోపాటు, కార్యాలయంలో సదరు సెక్షన్‌లో పనిచేసే మరో ఉద్యోగి వసూల్‌ రాజాల అవతారం ఎత్తినట్లు సమాచారం. అడిగినంత ఇస్తేనే బదిలీ అర్డర్‌ చేతిలో పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నెల క్రితం గ్రేడ్‌-5, గ్రేడ్‌-6 ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఇంత వరకూ పోస్టింగ్‌లు ఇవ్వలేకపోయారు. ఒక్కో ఉద్యోగి రూ.30 వేల నుంచి రూ.50 వేలు చెల్లిస్తేనే బదిలీ ఉత్తర్వులు ఇస్తున్నట్లు సమాచారం. ఆరెండు విభాగాల్లో సుమారు 500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. దీంతో వారి వద్ద నుంచి భారీ మొత్తంలో రాబట్టుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Oct 06 , 2024 | 11:29 PM