Share News

ఆ రెంటిపైనే..

ABN , Publish Date - May 23 , 2024 | 01:18 AM

ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి, చీరాల నియోజకవర్గాల్లో జరుగుతున్న బెట్టింగ్‌ల తీరు ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఆ రెండు చోట్లా ఆరంభంలో వైసీపీకి విజయావకాశాలు ఎక్కువ అన్న భావన వ్యక్తమైంది.

ఆ రెంటిపైనే..

దర్శి, చీరాలపై బెట్టింగ్‌ రాయుళ్ల దృష్టి

రోజురోజుకూ పెరుగుతున్న పందేలు

ఆ ఫలితాల వైపే అందరి చూపు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి, చీరాల నియోజకవర్గాల్లో జరుగుతున్న బెట్టింగ్‌ల తీరు ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఆ రెండు చోట్లా ఆరంభంలో వైసీపీకి విజయావకాశాలు ఎక్కువ అన్న భావన వ్యక్తమైంది. దీంతో పరిశీలకులు, బెట్టింగ్‌ రాయుళ్లు పెద్దగా పట్టించుకోలేదు. పోలింగ్‌ అనంత రం అక్కడ కూటమి విజయావకాశాలపై కూడా నమ్మకం పెరిగింది. దీంతో ఆ రెండు చోట్లా ఏం జరిగింది? బెట్టింగ్‌లు అధికంగా ఎందుకు జరుగుతు న్నాయి? అన్న చర్చ అందరిలో ప్రారంభమైంది.

దర్శిలో మారిన పరిణామాలు

దర్శి అభ్యర్థిని వైసీపీ ముందుగానే ప్రకటించింది. ఆ నియోజకవర్గంతో సంబంధం ఉన్న శివప్రసా ద్‌రెడ్డికి అవకాశం ఇచ్చింది. అంతకన్నా ముందుగానే ఆయన అధిష్ఠానం సూచనతో క్షేత్రస్థాయిలో పర్యట నలు ప్రారంభించారు. అప్పటికి టీడీపీ పక్షాన ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జి కూడా లేరు. ఆ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తూ అధికారికంగానే సమాచారం ఇచ్చారు. జనసేన తరఫున ఎక్కడో అమెరికాలో ఉండే పక్క జిల్లా వ్యక్తిని ఇన్‌చార్జిగా నియోజకవర్గానికి పంపారు. దీంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య అక్కడ టీడీపీ రంగంలోకి రావడం, అందులో మహిళా అభ్యర్థిని పోటీకి దించడం కూటమికి కలిసొచ్చింది. పైగా డాక్టర్‌ లక్ష్మి వాక్చాతుర్యంతో, చొరవగా దూసుకెళ్లడం ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. దీనికితోడు టీడీపీ జనసేన పార్టీలు సమష్టిగా పనిచేశాయి. కూటమి నుంచి పోటీ తీవ్రత పెరగ్గానే వైసీపీ వైపు నుంచి ప్యాకేజీలు, ప్రలోభాలు పెరిగిపోయాయి. ఆ విషయంలో టీడీపీ అభ్యర్థి ఎక్కడా తగ్గలేదు. ప్రధాన సామాజికవర్గాలు రెండూ కూటమివైపు నిలవగా వైసీపీలో ఉన్న సామాజికవర్గంలో చీలిక కనిపించింది. పోలింగ్‌ రోజు టీడీపీ కూటమి సేనలు ఎక్కడా తగ్గలేదు. బొట్లపాలెంలో వైసీపీ అరాచకాలను అడ్డుకుని కూటమి అభ్యర్థి సానుభూతిని కూడా సంపాదించారు. వైసీపీకి పూర్తిగా బలమైన ఎర్రఓబినేనిపల్లిలో కూటమి ఏజెంట్లను బయటకు నెట్టినా కొద్దిసమయంలోనే తిరిగి లోపలికి వెళ్లి పోలింగ్‌ జరిగే విధంగా చేశారు. పరిస్థితులన్నీ సమీక్షించుకుని కాబోలు నియోజకవర్గంలో గెలుపోటములపై భారీగా బెట్టింగ్‌ నడుస్తోంది. ఇక్కడ గెలుపోటములపై జిల్లాలోనే కాక రాష్ట్రస్థాయిలో కూడా జోరుగా పందేలు జరుగుతుండటం విశేషం. తొలుత వైసీపీ గెలుపునకు అనుకూలంగా పందేలు కాసిన వారు రూపాయికి రూపాయిన్నర పందెం కట్టారు. ఇప్పుడు రూపాయికి రూపాయి అంటూ గెలుపుపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. వైసీపీకి పది వేలు ఆధిక్యత వస్తుందంటూ ప్రారంభంలో సాగిన పందెం ప్రస్తుతం కనిపించడం లేదు. టీడీపీ వైపున గెలుపునకు అనుగుణంగా భారీగా పందేలు జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో మండలాల వారీ ఆధిక్యతలపై కూడా జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.

చీరాల ఫలితంపై ఆసక్తి

చీరాల అసెంబ్లీ స్థానంలో గెలుపోటములపై కూడా పోలింగ్‌ అనంతరం బెట్టింగ్‌లు పెరిగాయి. ఎన్నికల సమరం ప్రారంభానికి ముందు వైసీపీకి అనుకూ లమైన ఫలితం వస్తుందన్న ప్రచారం సాగింది. సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్యే బలరాం కుమా రుడు వెంకటేష్‌ ఆ పార్టీ అభ్యర్థి కావడం, నియో జకవర్గంలో బడుగు, బలహీనవర్గాల ఓటర్లు అధికంగా ఉండటం కూడా ఆ రకమైన అంచనాకు కారణమయ్యాయి. అయితే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కాంగ్రెస్‌ వైపున రంగంలోకి రావడంతో ఫలితంపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ కూటమిల్లో గెలుపు ఎవరిదనే దానిపై బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన ఆమంచి వైసీపీ ఓట్లకు గండికొడతార నేది ఒక అంచనా. దానికితోడు టీడీపీ కూటమి అభ్యర్థి బీసీ వర్గానికి చెందిన వారు కావడం, పోల్‌ మెనేజ్‌మెంట్‌లో తగ్గకపోవడం ఒక కారణమైంది. మొత్తం పరిస్థితిని సమీకించుకున్న బెట్టింగ్‌రాయుళ్లు టీడీపీ విజయావకాశాలు మెరుగుపడి, వైసీపీకి సన్నగిల్లాయన్న భావనతో పందేల్లో మార్పులు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నా వైసీపీకి టీడీపీ కూటమి నుంచి తీవ్ర పోటీ ఏర్పడి విజయావకాశాలు ఒకవైపు లేవన్న సంకేతమే బెట్టింగ్‌లు పెరగడానికి కారణమైంది.

Updated Date - May 23 , 2024 | 01:19 AM