Share News

ఏదీ ప్రక్షాళన!

ABN , Publish Date - May 16 , 2024 | 11:13 PM

ప్రతిష్టాత్మకమైన శాఖ అది. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యశాఖలో జరుగుతున్న తంతు చూస్తుంటే సామాన్య ప్రజానీకం కూడా అసహ్యించుకునే విధంగా ఉంది. ఒకరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరొకరి తప్పును వెలుగులోకి తీసుకురావడం, వాటిపై ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు. తమకు పైస్థాయిలో ఉండే పరపతితో విచారణలకు నియమించడం... విచారణ చేసిన తర్వాత తప్పులు వెలుగులోకి వచ్చాక... ఆ నివేదికలను పక్కనపెట్టడం సర్వసాధారణమై పోతుండటంతో వైద్యశాఖ అప్రతిష్టను మూటగట్టుకుంటోంది.

ఏదీ ప్రక్షాళన!

అసలు వైద్యశాఖలో ఏమి జరుగుతోంది

పెత్తనం కోసమే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు?

పాత నియామకాల్లో అవకతవకలపై విచారణ నివేదికలపై మౌనం

తాజాగా మరో 18 పోస్టుల భర్తీపై అవినీతి ఆరోపణలు

నోట్‌ఫైల్‌ లేకుండానే నింపారా!

ప్రతిష్టాత్మకమైన శాఖ అది. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యశాఖలో జరుగుతున్న తంతు చూస్తుంటే సామాన్య ప్రజానీకం కూడా అసహ్యించుకునే విధంగా ఉంది. ఒకరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరొకరి తప్పును వెలుగులోకి తీసుకురావడం, వాటిపై ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు. తమకు పైస్థాయిలో ఉండే పరపతితో విచారణలకు నియమించడం... విచారణ చేసిన తర్వాత తప్పులు వెలుగులోకి వచ్చాక... ఆ నివేదికలను పక్కనపెట్టడం సర్వసాధారణమై పోతుండటంతో వైద్యశాఖ అప్రతిష్టను మూటగట్టుకుంటోంది.

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 16 : ఎంతో ఉన్నత మైన వైద్య ఆరోగ్యశాఖకే అవినీతి జబ్బు చేసింది. దానిని నయం చేసే సరైన ఉన్నతాధికారి లేకపోవడమే కారణమా? అన్న చర్చ ఇప్పుడు ఆ శాఖలో నడుస్తోంది. తాము ఉన్నతాధికారిగా ఉన్నప్పుడు అంతా నిజాయితీ నడుస్తుందని చెబుతుంటారు.. వారు ఇక్కడి నుంచి బదిలీపై బయటకు వెళ్లాక ఒక్కొక్కటి తప్పులు వెలుగులోకి వస్తుండటంతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. కొవిడ్‌-19ను ఆసరా చేసుకొని ఉద్యోగ నియామకాల నుంచి హాస్పిటల్స్‌ రెన్యువల్స్‌, అనుమతులు ఇచ్చే విషయంలో అనుసరించిన విఽధానాలపై అనేక ఫిర్యాదులున్నా పట్టించుకున్నా పరిస్థితి లేకుండా పోయింది. కరోనా సమయంలో అత్యవసరంగా భర్తీ చేసిన ఉద్యోగాల విషయంలో కనీసం నోట్‌ఫైల్‌ కూడా లేకుండా అంతా చేశారంటే అది ఒక్క వైద్యశాఖకు చెల్లుతుంది. ఉన్నతాధికారులు, శాఖలో పనిచేసే కీలక ఉద్యోగులు కుమ్మక్కై పోస్టులను అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అత్యవసర సేవల కోసం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తే దానిని ఆదాయ వనరుగా మార్చుకున్న పరిస్థితి.

డిప్యుటేషన్లు రద్దు.. అయినా ఇక్కడే..

జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిగా వచ్చేవారు తమకు అనుకూలమైన ఉద్యోగులను కార్యాలయానికి డిప్యుటేషన్‌పై తెచ్చుకోవడం పరిపాటి మారింది. ఆ తర్వాత వారి ద్వారా ఇష్టారీతిన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా పలువురు ఉన్నతాధికారులపై ఆరోపణలు వచ్చాయి. అయినా అవేమి పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. గత నెలలో ఉద్యోగ విరమణ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల డిప్యుటేషన్లను రద్దుచేశారు. కానీ ఆ కార్యాలయంలో ఇంకా ఇద్దరు, ముగ్గురు పనిచేస్తున్నారంటే అందుకు అండదండలు అందిస్తున్నది ఎవ్వరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవంగా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉద్యోగులు తక్కువగా ఉన్నారు. అయితే కార్యాలయంలో పనులు సకాలంలో పూర్తిచేసుకునేందుకు సంబంధిత డీఎంహెచ్‌వో ఆ శాఖలో ఇతర ప్రాంతాల్లో పనిచేసే వారిని తెచ్చుకోవడం సాధరణమే. కానీ తాము ఉన్నప్పుడు ఒప్పు... ఇప్పుడు తప్పు అన్నట్లుగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వైద్యశాఖ కార్యాలయానికి పట్టిన అవినీతి జబ్బును నయం చేసేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కాంట్రాక్టు పేరుతో మోసం

కాంట్రాక్టు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఆరు నెలల్లో రెగ్యులర్‌ కూడా చేస్తామని హామీలు ఇచ్చి ఏజెన్సీల ద్వారా నియమించారు. అయితే ఉద్యోగాలు పొందిన వ్యక్తులు తాము ఏజెన్సీల ద్వారా ఉద్యోగాలు చేస్తున్నామనే విషయాన్ని మర్చిపోయి తమకు జీతాలు రాకపోయినా పదినెలల పాటు ఉచితంగా పనిచేశారంటే వారిని శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఎంతలా మభ్యపెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక 2020లో భర్తీ చేసిన ఉద్యోగ నియామకాల్లో కూడా అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ ఆ పోస్టుల నియామకాలపై ముగ్గురు అధికారులతో కూడిన బృందాన్ని నియమించారు. విచారణాధికారులుగా వారు అంతా పరిశీలించి, ఉద్యోగులను విచారించి భారీగా అక్రమాలు జరిగాయని నిర్ధారించి కలెక్టర్‌కు నివేదిక అందజేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగ నియామకాల వ్యవహారాన్ని పక్కనబెడితే అత్యవసరం అనే పేరుతో ఇష్టారీతిన డిప్యుటేషన్లను వేశారు. అందులోనూ పెద్దఎత్తున అవినీతి, ఆరోపణలు వచ్చినా, ఆ సమయంలో భర్తీచేసిన పోస్టుల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది.

Updated Date - May 16 , 2024 | 11:13 PM