మారరంతే!
ABN , Publish Date - Sep 10 , 2024 | 01:14 AM
ఫిర్యాదు అందిన వెంటనే ప్రాథమికంగా కేసు నమోదు చేయాలనేది పోలీసు ఉన్నతాధికారుల ఆదేశం. ఆతర్వాత విచారణలో కేసు తీవ్రతను బట్టి సెక్షన్లు మార్చుకునే వెసులుబాటు ఉంది. మార్కాపురం పోలీసులకు మాత్రం ఇవేం పట్టడం లేదు.
ఉన్నతాధికారుల ఆదేశాలు తూచ్
చీకటి పడితేనే కేసు నమోదు
పగలు ఫిర్యాదులు అందినా రాత్రి వరకూ ఆగాల్సిందే
సెటిల్‌మెంట్లకే మొగ్గు
చర్చనీయాంశమైన మార్కాపురం పోలీసుల తీరు
అనుకున్న మేరకు జేబులు నిండితే సరే. లెక్క ఏమాత్రం తగ్గిందా అప్పుడు చట్టం గుర్తుకు వచ్చి కేసులు నమోదవుతాయి. పంచాయితీల తతంగమంతా పగలు జరుగుతోంది. రాత్రుళ్లు మాత్రమే కేసులు నమోదు చేయడం ఆనవాయితీగా పెట్టుకుని దాన్ని కొనసాగిస్తున్నారు మార్కాపురం పోలీసులు. కిందిస్థాయి అధికారులు ఈవిధంగా వ్యవహరిస్తూ వివాదాలకు చోటిస్తున్నా పర్యవేక్షణ అధికారులు మిన్నకుండడం విమర్శలకు తావిస్తోంది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా అన్ని స్థాయిల వారికి చేతులు తడుస్తుండటం వల్లే ఇలాంటి వ్యవహారాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మార్కాపురం, సెప్టెంబరు 9 : ఫిర్యాదు అందిన వెంటనే ప్రాథమికంగా కేసు నమోదు చేయాలనేది పోలీసు ఉన్నతాధికారుల ఆదేశం. ఆతర్వాత విచారణలో కేసు తీవ్రతను బట్టి సెక్షన్లు మార్చుకునే వెసులుబాటు ఉంది. మార్కాపురం పోలీసులకు మాత్రం ఇవేం పట్టడం లేదు. ఫిర్యాదు ఎప్పుడు అందినా వారికి నచ్చినప్పుడు మాత్రమే కేసు నమోదు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కనబెట్టి రాజకీయ నాయకుల సిఫార్సులు, మధ్యవర్తుల బేరసారాలను బేరీజు వేసుకుని మాత్రమే పనిచేస్తున్నారు.
ఫిర్యాదు ఎప్పుడు అందినా రాత్రుళ్లే కేసు నమోదు
మార్కాపురం సర్కిల్ పరిధిలోని టౌన్, రూరల్ పోలీసు స్టేషన్‌లలో అఽధికారులు ఎవరు మారినా కొన్నేళ్ల నుంచి కేసులు నమోదు కావాలంటే చీకటి పడాల్సిందే. ఫిర్యాదు ప్రాధాన్యతను పక్కన బెడితే రాత్రి 8 గంటలు దాటిన తర్వాతనే కేసు నమోదవుతుంది. పగలు ఎలాంటి ఫిర్యాదు అందినా దాన్ని సాయంత్రం వరకు నాన్చడం అలవాటుగా చేసుకున్నారు. ఫిర్యాదు స్టేషన్‌కు వచ్చిన వెంటనే కొందరు మధ్యవర్తులు గద్దల్లా వాలుతున్నారు. వారు ఇరు పక్షాలను స్టేషన్ పరిసరాల్లోనే కూర్చోబెట్టి లెక్క సరిచేసి అధికారి వద్దకు పంపుతారు. ఇరుపక్షాలు సమ్మతించని పక్షంలోనే కేసు నమోదుకు మొగ్గుచూపుతున్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులకు మధ్యవర్తిత్వం వహించేందుకు కొందరు అదేపనిగా స్టేషన్ చుట్టూ తిరుగుతుండటం గమనార్హం. వారిలో కుల సంఘాలకు చెందిన వాళ్లు కొందరైతే, సమాజంలో గౌరవప్రదమైన వృత్తుల్లో కొనసాగే వాళ్లు మరికొందరు ఉన్నారు. గతంలో పలువురు డివిజన్ స్థాయి పోలీసు అధికారులు ఈ తంతును వారించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
అడ్డుకట్ట వేసేదెవరు?
జిల్లా స్థాయిలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి ఫిర్యాదుదారుడికి చట్టప్రకారం న్యాయం చేయాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. స్టేషన్‌కు కొత్త అధికారి వచ్చినా కిందిస్థాయి సిబ్బంది సూచనలు, సలహాల మేరకే నడుచుకుంటున్నారు. వారు చెప్పిందే వేదంగా పనిచేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా భూ లావాదేవీలు, నగదు లావాదేవీలకు సంబంధించిన కేసుల్లో కిందిస్థాయి సిబ్బంది కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎవరికి ముట్టాల్సినవి వారికి అందుతుండటంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. సాధారణ కేసుల్లో అయితే ఇరుపక్షాలు చేతులు తడిపితేనే కిందిస్థాయి సిబ్బంది అధికారి వద్దకు తీసుకెళ్తున్నారు. పోలీసు స్టేషన్‌లలో జరుగుతున్న ఈ తంతును ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేర్చాల్సిన నిఘా విభాగం కూడా పట్టించుకుంటున్న దాఖలాలు ఉండటం లేదు. నిఘా విభాగం సిబ్బంది ఏళ్లుగా పాతుకుపోయిన వాళ్లు కావడం కూడా వాస్తవాలు పైస్థాయి అధికారులకు తెలియకుండా మరుగున పడిపోవడానికి కారణమవుతోంది. జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విచారించి చర్యలు తీసుకుంటా
బి.లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి డీఎస్పీ, మార్కాపురం
మార్కాపురం సర్కిల్ పరిధిలోని పోలీసు స్టేషన్‌లలో కేసుల నమోదు విషయంలో తాత్సారం, పంచాయితీలు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. మార్కాపురం టౌన్, రూరల్ స్టేషన్‌ల పరిధిలో విచారించి తప్పక చర్యలు తీసుకుంటాం. అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే అరికడతాం. ప్రజలకు తక్షణ న్యాయం అందించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యం.