నిర్మల ‘ప్రకాశం’
ABN , Publish Date - Jul 24 , 2024 | 01:19 AM
జిల్లా ప్రజలకు కాస్తంత ఊరట. రాష్ట్ర విభజన నాటి నుంచి ఎదురుచూస్తున్న వెనుకబడిన జిల్లా కల ఎట్టకేలకు నెరవేరింది. ఆ జాబితాలో ప్రకాశం చేరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
వెనుకబడిన జాబితాలో జిల్లాకు చోటు
బడ్జెట్‌లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి
మౌలిక రంగాలకు ప్రాధాన్యం
ఆమేర జిల్లాకు నిధులు వచ్చే అవకాశం
ఆశించిన ఊరట దక్కలేదని వేతన జీవుల నిరాశ
సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేల కృతజ్ఞతలు
జిల్లా ప్రజలకు కాస్తంత ఊరట. రాష్ట్ర విభజన నాటి నుంచి ఎదురుచూస్తున్న వెనుకబడిన జిల్లా కల ఎట్టకేలకు నెరవేరింది. ఆ జాబితాలో ప్రకాశం చేరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్‌లో మంగళవారం కేంద్రప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏపీలోని ఏడు జిల్లాలతోపాటు ప్రకాశంను కూడా వెనుకబడిన జిల్లాగా ఆమె వెల్లడించారు. దానివల్ల ప్రత్యేకంగా నిధులు రానున్నాయి. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషే కారణమైంది. దీంతో జిల్లాకు చెందిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతిలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన జిల్లా ప్రకటనపై జిల్లాలోని రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లా ప్రజలకు కాస్తంత ఊరట లభించింది. రాష్ట్రంలో కేంద్రం గుర్తించిన వెనుకబడిన ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాకు స్థానం దక్కింది. ఆమేరకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గతంలో కేంద్రం ప్రకటించింది. అందులో రాలసీమలో నాలుగు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు ఉన్నాయి. వాటి తరహాలోనే ఒకరకంగా పలు ఇతర జిల్లాల కన్నా ఇంకా ఎక్కువ వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మన జిల్లాను మాత్రం అందులో చేర్చలేదు. ఈ విషయాన్ని జిల్లాకు చెందిన నాటి టీడీపీ ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తదనుగుణంగా కేంద్రానికి సిపార్సు చేసినా అప్పట్లో అనుమతి రాకపోగా అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం అసలు ఆ ఊసే పట్టించుకోలేదు.
జిల్లాకు ప్రత్యేకంగా నిధులు
ఈ ఏడాది ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందాయి. అలాగే కేంద్రప్రభుత్వం ఏర్పాటులో టీడీపీ కీలకమైంది. ఇదేసమయంలో రాష్ట్రానికి చెందిన అందులో భాగంగా జిల్లాకు సంబంధించిన అభివృద్ధి అంశాలు కేంద్రం దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా తీసుకెళ్లారు. ఆ ప్రభావం మంగళవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కనిపించింది. రూ.38లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా మౌలిక రంగాలు, వ్యవసాయం, ఉపాధి కల్పన, పరిశ్రమలు తదితర రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రైల్వేలు, హైవేలు, పోర్టులు, తాగునీరు, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకం వంటి వాటికి భారీ నిధులు కేటాయించారు. అందులోభాగంగా రాష్ట్రానికి తదనుగుణంగా జిల్లాలో ఆయారంగాలకు నిధులు రానున్నాయి. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా అమరావతికి రూ.15వేల కోట్ల ఆర్థిక సాయం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి కీలక అంశాలకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లాకు సంబంధించి ఆయా రంగాల వారీ వచ్చే నిధులతోపాటు వెనుకబడిన ప్రాంతాల జాబితాలో జిల్లాను చేర్చడం ద్వారా ప్రత్యేకంగా నిధులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులు, నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు, ఇతర భాగస్వామ్య పథకాలకు వచ్చే నిఽధులతోపాటు ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు కూడా రానున్నాయి. ఇదిలాఉండగా పలు కీలకరంగాలకు ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ ఆదాయ పన్ను శ్లాబ్‌ల సవరణ, పన్ను మినహాయింపులలో ఆశించిన విధంగా కేంద్రం స్పందించలేదన్న నిరాశను వేతనజీవులు వ్యక్తం చేస్తున్నారు. కాగా కేంద్ర బడ్జెట్‌పై కూటమి పక్షాలు హర్షం వ్యక్తం చేస్తుండగా... ఇతర పార్టీలు అంకెల గారడీగా అభివర్ణిస్తున్నాయి.
సీఎంను కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు
ఉమ్మడి జిల్లా ప్రజల దశాబ్దకాల డిమాండ్ అయిన వెనుకబడిన ప్రాంతాల జాబితాలో జిల్లా చేర్పు, ప్రత్యేక నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపి కేంద్రం ప్రకటించేలా చేయడంపై ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, బీఎన్.విజయ్‌కుమార్, ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎం.ఎం.కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావులు బాబును కలిసి జిల్లాప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు. అలాగే కేంద్రప్రభుత్వానికి కూడా వారు ధన్యవాదాలు తెలిపారు.
చెప్పాను.. చేస్తాను..
మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు
‘మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి స్పష్టమైన హామీ ఇచ్చా. దాన్ని నెరవేరుస్తా’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు చెందిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో అన్నారు. జిల్లాను వెనుకబడిన జాబితాలో చేరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన్ను నేతలు కలిశారు. మీ కృషితో కూటమి ప్రభుత్వం అందించిన గొప్ప విజయం అని అభివర్ణించారు. పశ్చిమప్రాంతానికి చెందిన గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా విషయాన్ని ప్రస్తావించారు. వెంటనే చంద్రబాబు ‘అది మనం చెప్పిందే కాదా. కచ్చితంగా చేద్దాం’ అని మరోసారి స్పష్టం చేశారు. అధికారికంగా ఆవైపు కదలిక కూడా ఉందని వ్యాఖ్యానించారు.