Share News

వైసీపీ నిర్లక్ష్యం.. ప్రయాణం నరకం..!

ABN , Publish Date - May 12 , 2024 | 11:18 PM

ఇంకొల్లు టు పర్చూరు ఆర్‌అండ్‌బీ రహదారి రెండులైన్లగా విస్తరణ చేసేందుకు ప్రభుత్వం రూ.22కోట్లు మంజూరు చేసింది. ఏడాదిగా ప్రారంభించిన పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేశారు. గత ఏడాది మార్చిలో రోడ్డ విస్తరణ పనులు ప్రారంభించి ఇంకొల్లులో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు పర్చూరు వరకు సాగర్‌ కాల్వలపై కల్వర్టర్లను నిర్మించారు.

వైసీపీ నిర్లక్ష్యం.. ప్రయాణం నరకం..!
డైవర్షన్‌ రోడ్డుపై గుంతలు.. అడ్డరోడ్డు వద్ద శిథిలమైన వంతెన

అభివృద్ధికి నోచుకోని ఇంకొల్లు - పర్చూరు రోడ్డు

రూ.22కోట్ల నిధులు మంజూరు

చేసిన కొంత పనులకు కాంట్రాక్టర్‌కు చెల్లించని బిల్లులు

నాలుగేళ్లుగా అవస్థలు

డైవర్షన్‌ రోడ్డుపైనా గుంతలు

ఇంకొల్లు, మే 12 : ఇంకొల్లు టు పర్చూరు ఆర్‌అండ్‌బీ రహదారి రెండులైన్లగా విస్తరణ చేసేందుకు ప్రభుత్వం రూ.22కోట్లు మంజూరు చేసింది. ఏడాదిగా ప్రారంభించిన పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేశారు. గత ఏడాది మార్చిలో రోడ్డ విస్తరణ పనులు ప్రారంభించి ఇంకొల్లులో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు పర్చూరు వరకు సాగర్‌ కాల్వలపై కల్వర్టర్లను నిర్మించారు. దగ్గుబాడు వద్ద వాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం చేశారు. వంకాయలపాడు వద్ద చెరువుకట్టకు సైడు వాల్స్‌ కొంతమేరకు పూర్తి చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పెద్దపెద్ద చింతమానులను తొలగించారు. యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి కదా ఇంకేముంది ఈ ప్రాంతవాసులు ఇంకొల్లు నుంచి పర్చూరు రహదారిలో ప్రయాణ కష్టాలు తప్పి సుఖంగా సాగుతోందని ఊహించారు. కానీ అది కలగానే మిగిలింది. ఇంకొల్లు నుంచి పర్చూరు వరకు రెండు లైన్‌లుగా అభివృద్ధి చేసేందుకు రూ.22కోట్ల నిధులు మంజూరు కాగా, కాంట్రాక్టరు చేసిన పనులకు సుమారు రూ.5కోట్ల మేర బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదే. రోడ్డు అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. గత నాలుగైదు నెలలుగా కాంట్రాక్టరు పనులు చేసేందుకు నిరాకరించి ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే పనులు చేపడతామన్నట్లు సమాచారం. నాలుగేళ్లులుగా ప్రయాణికులు ఈ రహదారిలో ప్రయాణించాలంటే నరకయాతనలు పడుతున్నారు. ముఖ్యంగా ఇంకొల్లు నుంచి వంకాయలపాడు మార్కెట్‌ యార్డ్‌ వరకు రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడి ద్విచక్ర వాహనదారులు సైతం ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ 13 కిలో మీటర్ల మేర 20నిమిషాలు సాగాల్సిన ప్రయాణం 45 నిమిషాలపైనే పడుతోందని ప్రయాణికులు చెప్తున్నారు. పూసపాడు అడ్డరోడ్డు వద్ద ఉన్న నక్కవాగుపై వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఇక్కడ డైవర్షన్‌రోడ్డు వేసారు. అది కూడా గుంతలమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బంది జరుగుతోంది. వైసీపీ నిర్లక్ష్యం వల్లే ఇబ్బందిపడుతున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - May 12 , 2024 | 11:18 PM