నత్తనడకన నాడు-నేడు నిర్మాణాలు
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:22 AM
గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్బాటం చేసి చేపట్టిన నాడు-నేడు పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి.
పొదిలి, జూలై 14 : గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్బాటం చేసి చేపట్టిన నాడు-నేడు పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాటశాలలకు ధీటుగా తీర్చి దిద్దుతామని చెప్పిన హామీలు అమలు కాలేదు. పాఠశాల అభివృద్ధికి నాడు-నేడు పనులకు నిధులు కేటాయించక పోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
మండలంలో నాడు-నేడు పనులు కూడా నత్తేనయం అన్నట్లుగా సాగుతున్నాయి. గతంలో ప్రారంభించిన మొదటి ఫేజ్ పనులు మాత్రం సుధీర్ఘ సాగదీతల అనంతరం పూర్తి చేసుకున్నాయి. రెండవఫేజ్‌లో నిధుల గ్రహణంతో ప్రారంభించిన నాడు-నేడు పనులు ఎక్కడి కక్కడే నిలిచిపోయాయి. దీంతో అసంపూర్తి పనులు పాఠశాలలో దర్శనం ఇస్తున్నాయి. గత ప్రభుత్వం పాఠశాలల నిర్మాణాలకు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతు న్నాయని పులువురు విమర్శిస్తున్నారు.
పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అధికసంఖ్యలో విద్యార్థులు ఉంటారు. అసలే ఇరుకుగా ఉన్న జడ్పీ పాఠశాలలో 3, 4, 5 తరగతుల విద్యార్థులను కూడా చేర్చారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్క రించడానికి పాఠశాలకు అదనపు తరగతి గదుల ఏర్పాటును రెండు సంవత్సరాల క్రితం 2022 అక్టోబరులో పనులు ప్రారంభించారు. నిర్మాణాలు అంచెలంచెలుగా నత్తనడకన పూర్తి చేస్తూ ప్రస్తుతం శ్లాబ్ లెవల్‌కు తీసుకొచ్చారు. అయితే పూర్తిగా నిధులు ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణాలపై అధికారులు వారి సొంత నిధులు వెచ్చించిన ఘటనలు ఉన్నాయి. 450 మంది విద్యార్థులు ఉన్నా ఈ పాఠశాలకు సుమారుగా 15 తరగతి గదులు అవసరమని కేవలం 8 గదులు మాత్రమే ఉండటంతో మిగిలిన తరగతులు వరండాల్లో చెప్పక తప్పడం లేదు. 2022లో రూ.38లక్షలతో మూడు అదనపు గదులు ఏర్పాటుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు గాను ఇప్పటి వరకు కేవలం 15లక్షలు మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మిగిలిన నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణం జరగడం లేదు. ప్రస్తుతం మిగిలిన భారం నూతన టీడీపీ ప్రభుత్వంపై పడింది.
అదేవిధంగా పెద్దబస్టాండ్ కూడలిలోని బాలికల ఉన్నత పాఠశాలలో మొత్తం 575 మంది విద్యార్ధులు ఉన్నారు. అక్కడ ఇరుకుగా ఉండడంతో మరో 10 అదనపు గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందుకుగాను రూ.1.15 కోట్లు నిధులు వెచ్చించారు. అందులో కొన్ని గదులు పూర్తయ్యాయి. మిగిలిన గదులు మూడు వంతుల పనులు పూర్తి చేసినా, మిగిలిన పనులు నిధుల జాప్యంలో ఆగిపోయాయి. ఇక్కడ కూడా అసంపూర్తిగానే పనులు మిగిలాయి. ఇక మండల వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో నాడు-నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయి. మిగిలిన పనులు పూర్తిచేసి విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.