Share News

మూడొంతులకు పైగా సమస్యాత్మకమే!

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:34 AM

జిల్లాలో ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేనా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అటు రాష్ట్రంలో అరాచక పాలన, ఇటు జిల్లాలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు, తాజా ఘటనలతో ప్రజానీకం మరింత ఆందోళన చెందుతోంది.

మూడొంతులకు పైగా సమస్యాత్మకమే!

2,183 కేంద్రాలలో 1,661 అవే

ప్రశాంత పోలింగ్‌పై ప్రజల్లో అనుమానాలు

వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆందోళన

యంత్రాంగానికి సవాల్‌గా మారనున్న ఎన్నికలు

అప్రమత్తతతోనే సాఫీగా ప్రక్రియ

జిల్లాలో ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేనా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అటు రాష్ట్రంలో అరాచక పాలన, ఇటు జిల్లాలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు, తాజా ఘటనలతో ప్రజానీకం మరింత ఆందోళన చెందుతోంది. జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాలలో మూడొంతులకుపైగా సమస్యాత్మకమైనవిగా ఇప్పటికే ఎన్నికల నిర్వహణ యంత్రాంగం గుర్తించింది. ఈ నేపథ్యంలో మే 13న జరగనున్న సాధారణ ఎన్నికల పోలింగ్‌ శాంతియుత వాతావరణంలో నిర్వహించడం జిల్లా యంత్రాంగానికి కత్తిమీద సాములాగే కనిపిస్తోంది. అటు పోలీసులు, ఇటు అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తేనే ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంది.

ఒంగోలు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈసారి మూడొంతులకుపైగా పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. దీంతో యంత్రాంగానికి ఎన్నికల నిర్వహణ సవాల్‌గా మారనుంది. ఈనేపథ్యంలో ఎన్నికలు ఏమేరకు సాఫీగా సాగుతాయన్న అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలోనూ ఎన్నికలకు ముందు, ఆతర్వాత పోలింగ్‌ రోజున వివిధ ఘటనలు జరిగేవి. కొన్నేళ్ల క్రితం వాటి తీవ్రత అధికంగా ఉన్నా.. గత పది, పదిహేనేళ్లలో తగ్గాయి. చెదురుమదురు ఘటనలు తప్ప పెద్ద ఇబ్బందికరంగా ఏమీ లేవు. 2019 ఎన్నికల సమయంలో వైపాలెం నియోజకవర్గంలోని ఒక్క కేంద్రంలో తప్ప ఎక్కడా రీపోలింగ్‌ జరగలేదు. అప్పట్లో జిల్లాపరిధిలో 670 సమస్యాత్మక కేంద్రాలే ఉన్నాయి. కాగా రానున్న ఎన్నికలలో సమస్యాత్మక కేంద్రాలే అధికంగా ఉన్నట్లు అధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

76శాతం కేంద్రాలు సమస్యాత్మకం

జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిఽధిలో 18.11 లక్షల మంది ఓటర్లు ఉండగా 2,183 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా వాటిలో 1,661 (76 శాతంపైగా) క్రిటికల్‌ (సమస్యాత్మక) కేంద్రాలుగా యంత్రాంగం గుర్తించింది. వాటిలో తీవ్ర సమస్యాత్మకమైనవి నాలుగో వంతు ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా గతంలో జరిగిన ఎన్నికల్లో కొట్లాటలు, హత్యలు జరిగిన ఘటనలు, ఒకే పార్టీ లేదా ఒకే అభ్యర్థికి 75శాతంపైగా ఓట్లు వచ్చినవి, ఒకవర్గం వారిని పోలింగ్‌కు రాకుండా అడ్డుకున్న పరిస్థితులు, ప్రత్యేకించి దళిత ఓటర్లకు ఆటంకం కలిగించే ఘటనలు చోటుచేసుకుంటే ఆ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తిస్తారు. అలాంటి వాటిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. పటిష్ట బందోబస్తు, ఇతర చర్యలతో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేలా యంత్రాంగం చేయాలి. ఇందులో పోలీసు పాత్ర అత్యంత కీలకం. అయితే ప్రస్తుత పరిస్థితులు.. యంత్రాంగం, అధికారపార్టీ తీరుపై టీడీపీ అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ నేతలకు జీ హుజూర్‌

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రత్యర్థి పార్టీలు, ప్రశ్నించే వ్యక్తులపై తీవ్ర నిర్బంఽధాన్ని కొనసాగించింది. ఈ విష యంలో పోలీసు శాఖ తీవ్ర విమర్శల పాలవుతున్నా ఉన్నతాధికారులు పట్టిం చుకోకుండా అధికార వైసీపీ నేతలకు జీహుజూర్‌ అంటూ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో అనేక సంఘటనలు అందుకు దర్పణం పట్టగా జిల్లాలోనూ అలాంటి పరిస్థితే ఉంది. వైపాలెంలో స్థిరాస్తి వ్యాపారి ఆదినారాయణ హత్య, ఒంగోలులో సుబ్బారావుగుప్తాపై వైసీపీ నేతల దాడి, దోర్నాల మండలంలోని సర్పంచ్‌ భర్త హత్య, తర్లుపాడు మండలంలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలపై ప్రశ్నించిన యువ కుడిపై దాడి, ఎస్‌.ఎన్‌పాడు మండల కార్యాలయంలోనే తహసీల్దార్‌పై వైసీపీ నేత వీరంగం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటితోపాటు సీఎస్‌పురం మండలంలో ఉపాధి పథకంలో అక్రమాలపై నిలదీసిన పాస్టర్‌ను అంతమొం దించారు. బేస్తవారపేట మండలంలో పారిశుధ్య సమస్యపై నిలదీసిన జనసేన కార్యకర్త బలవన్మరణంతోపాటు అనేకచోట్ల అక్రమ కేసులు నమోదయ్యాయి. ఇక కొండపి నియోజకవర్గంలో వైసీపీ నేతలు బరితెగించి టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామిపై దాడులకు సైతం ప్రయత్నించారు. ఈ కేసులన్నింటిలోనూ పోలీసు శాఖ వైసీపీ వారికి కొమ్ము కాసిందన్న విమర్శలు వినిపించాయి.

ఇద్దరు సీఐలపై ఏకంగా కోర్టులో కేసు

ఇటీవల గిద్దలూరు మండలంలో మునయ్య అనే టీడీపీ కార్యకర్త హత్య ఉదంతం సంచలనం కలిగించింది. మునయ్యపై దాడి విషయంలో పోలీసుల తీరుపై గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి అశోక్‌రెడ్డి మండిపడ్డారు. ఆ కేసు విషయంలో ఎన్నికల కమిషన్‌ కూడా సీరియస్‌ అయ్యింది. ఎస్పీ పరమేశ్వరరెడ్డి స్వయంగా ఎస్‌ఈసీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మరోవైపు ఒంగోలులో ఇద్దరు సీఐలపై టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ ఏకంగా కోర్టులో కేసు వేశారు. కొండపి నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీచేస్తున్న మంత్రి సురేష్‌ తనకు అనుకూలురుగా ఉండే పోలీస్‌ అధికారులకు పోస్టింగ్‌ వేయించుకున్నారని గతంలోనే ఎమ్మెల్యే స్వామి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇతరచోట్ల కూడా ఇలాంటి అరాచకాలు ఉండగా గత ఏడాది కాలంలో ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా రాజకీయాలకు సంబంధం ఉన్న, అలాగే సంబంధం లేకుండా కూడా ఇతరత్రా 25కుపైగా మేజర్‌ ఘటనలు జరిగినట్లు సమాచారం. అందులో కొండపి, వైపాలెం సెగ్మెంట్లలో అధికంగా ఉన్నాయి.

జిల్లా యంత్రాంగానికి సవాలే

జిల్లాలో మూడొంతు లకుపైగా పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవి. దీంతో ఈసారి ఎన్నికలు శాంతియుతంగా జరగడం ఏమేరకు అన్న అనుమానం అటు ప్రజల్లో, ఇటు టీడీపీ వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఎన్నికల నిర్వహణ యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపి స్తోంది. సాధారణ బందోబస్తు కాకుండా అదనపు బలగాల నియామకం, ముందస్తుగా నిఘా పెంపు, సమస్యాత్మకంగా లేదా వివాదాలు పెంచే వారిగా గుర్తింపు ఉండే వ్యక్తుల కదలికల నియంత్రణ, పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల నియామకం, వీడియోగ్రఫీ, వెబ్‌కా స్టింగ్‌ వంటి చర్యలు తీసుకోవాలి. వాటికి విస్తృత ప్రచారం కల్పించి ఓటర్లకు భరోసా కలిగిం చాల్సిన అవసరం ఉంది.

Updated Date - Apr 06 , 2024 | 12:34 AM