డబ్బు.. డబ్బు..
ABN , Publish Date - Feb 06 , 2024 | 02:06 AM
అధికార వైసీపీలో డబ్బు రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికలో ఆపార్టీ అధిష్ఠానం ఈ తంతునే అనుసరిస్తోంది.
లెక్క చూపితేనే సీటు
అదే ప్రధాన ప్రామాణికం
వైసీపీలో జరుగుతున్న తంతు అదే
ఇప్పటి వరకూ కష్టపడి అడిగినంత డబ్బు లేదన్న వారికి చెక్
రిజర్వ్ అయినా.. బీసీ అయినా అదే లెక్క
అధికార వైసీపీలో డబ్బు రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికలో ఆపార్టీ అధిష్ఠానం ఈ తంతునే అనుసరిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ అదే కోవలో ఉన్నాయనేది వాస్తవం. కానీ వైసీపీ వ్యవహార శైలి ఆ పరిస్థితిని తారస్థాయికి తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ ఆర్థిక వనరుల లేమి అనే పేరుతో పార్టీ కోసం పదేళ్లపై నుంచి కష్టపడుతున్న వారిని పక్కనపెట్టి వేరే వారిని రంగంలోకి తేవడంలోని ఆంతర్యం అదేనని తేటతెల్లమవుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతానికి పదింటికి పార్టీ ఇన్‌చార్జిల పేరుతో అభ్యర్థులను ఖరారు చేశారు. ఆ సందర్భంగా వైసీపీ అనుసరించిన తీరును పరిశీలిస్తే ఆర్థిక స్థోమతే ప్రధాన ఆయుధంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. బలహీన వర్గాల వారికి ప్రాధాన్యతని స్తున్నామనే మాట కూడా నిజం కాదన్నట్లు ఆ వర్గాలకు చెందిన వారైనా ఆశించిన స్థాయిలో ఆర్థిక వనరులు ఉంటేనే అవకాశం ఇస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
జిల్లాలో ఇప్పటికి పది నియోజకవర్గాల వరకు అభ్యర్థుల ఎంపికను వైసీపీ పూర్తిచేసింది. ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిని కూడా దాదాపు ఖరారు చేసింది. జిల్లాలో కొంత మంది ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలను సరైన ఆర్థిక వనరులు లేవన్న నెపంతో తొలగించింది. ఆయా అసెంబ్లీల వారీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల్లో ఎంత ఖర్చుపెట్టాలో ముందుగానే ఆపార్టీ నిర్ధారించుకున్నట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలు, అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్న ఐప్యాక్ బృందం ఆ మేరకు ఒక నివేదికను కూడా రూపొందించింది. ఆ ప్రకారమే ఆయా నియోజకవర్గాల వారీ అభ్యర్థులను ముందుగా మీరింత సొంత నిధులను వెచ్చించగలరా? లేదా? అని అడుగుతుండటం గమనార్హం.
అలాగైతేనే ఇన్‌చార్జి
వైసీపీకి పట్టున్న పశ్చిమప్రాంతంలో రూ.40 కోట్ల నుంచి రూ.60కోట్ల వరకు వెచ్చిస్తేనే ఫలితం ఉంటుందన్న భావనకు అధిష్ఠానం వచ్చినట్లు తెలిసింది. మార్కాపురం డివిజన్‌లోని ఒక నియో జకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ను తొలుత మీ నియోజకవర్గంలో రూ.40 కోట్లు ఖర్చుపెట్టాలి. కనీసం మీరు రూ.30కోట్లు చూసు కుంటే రూ.10కోట్ల సహకారం అందిస్తామంటూ ఐప్యాక్ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు తెలిసింది. ‘ఇప్పటికే మూడు ఎన్నికల్లో ఉన్నదంతా పెట్టా.. అప్పు లు తీర్చేందుకు ఆస్తులు అమ్మా. రూ.10 కోట్లకన్నా మించి పెట్టలేను’ అని ఆయన తేల్చిచెప్పినట్లు తెలిసింది. అందుకు అధిష్ఠానం ససేమిరా అనడంతో ఆయన వేరే మెలిక పెట్టారు. తర్వాత ఆర్థికవనరులు ఉన్న అభ్యర్థులు దొరక్క పోవడంతో ఆయనకు ఇష్టమైన స్థానాన్ని కేటాయి స్తూ ఫిఫ్టీ ఫిఫ్టీ దామా షాలో అభ్యర్థి, పార్టీ వ్యయాన్ని భరించే రీతిలో టికెట్ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. తాను ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గంలో తిరిగి టికెట్ ఇస్తే రూ.30 కోట్లు వ్యయానికి ఇబ్బంది లేద ని చెప్పిన మరో ఎమ్మెల్యేకు నియోజకవర్గం మార్చి ఆయనకు ఇష్టం లేకపోయినా ఆ పది మేము ఇస్తాం అక్కడే ఉండండని చెప్పినట్లు సమాచారం.
బీసీ అయినా సరే
దక్షిణప్రాంతంలో ఉండి వేరే లోక్‌సభలో కలిసిన ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యేకు ఇదే సమస్య ఎదురైనట్లు తెలిసింది. ఆర్థికంగా తాను ఏమాత్రం తూగలేనని ఆయన చెప్పడంతో బీసీ సామాజికవర్గం పేరుతో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించే ప్రయత్నం చేశారు. అక్కడ వారు తొలుత సీఎం సూచించిన నేత నుంచి ఆర్థిక వనరులు సమకూరకపోవడంతో అదే సామాజికవర్గం నుంచి ఆర్థికంగా ఢోకాలేని మరొకరిని తెరపైకి తెచ్చారు. ఆయన వెనకడుగు వేయడం, లోక్‌సభ అభ్యర్థి విషయంలో అధిష్ఠానం అంచనా తారుమారవడంతో అక్కడి అభ్యర్థి ఎంపికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇక లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలోనూ అదేతంతు సాగుతోంది. ఒంగోలు లోక్‌సభ నుంచి ప్రస్తుత ఎంపీ మాగుంట విషయంలో వ్యతిరేకంగా ఉన్న జగన్ తొలుత జిల్లాకు చెందిన నాయకుల పేర్లను పరిశీలించారు. అయితే ఆర్థికాంశాల విషయంలో సంతృప్తి రానందున వారి పేర్లను పక్కనపెట్టి దూరంలో ఉన్న జిల్లాకు చెందిన నాయకుడిని రంగంలోకి తెచ్చారు. ఈ విషయాలు క్రమేపీ వెల్లడవడంతో వైసీపీ అనుసరిస్తున్న డబ్బే ప్రాతిపదిక వ్యవహారం ప్రజల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. డబ్బులుంటే ఎక్కడ ఎవరిని రంగంలోకి దించినా సరిపోతుందా? అని ప్రజానీకం ఆశ్చర్యచకితులవుతున్నారు.
రిజర్వు నియోజకవర్గంలో రూ.20కోట్లు చూపించాకే ఇన్‌చార్జి
మరో రిజర్వ్ నియోజకవర్గంలో ఇదే పంథాను అనుస రించగా పక్కనే గుంటూరు జిల్లాకు చెందిన నాయకురాలు ఆర్థికంగా భరించేందుకు ముందుకు రావడంతో ఆమెకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జిల్లాకు చెందిన వారికే అవకాశం ఇవ్వాలని ఒత్తిడి పెరగడంతో కనీసం రూ.20 కోట్లు భరించగలిగితే ఓకే అని చెప్పారు. ఆయన రూ.20 కోట్లు చూపించిన తర్వాతే ఇన్‌చార్జిగా ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక నాయకుల ఒత్తిడితో కీలక పదవిలో ఉన్న ఎమ్మెల్యేను తప్పించిన ఆ నియోజకవర్గంలో మీరు అడిగిన వారికి అవకాశం ఇస్తాం. రూ. 20 కోట్లు చూపించమని ఆదేశించినట్లు తెలిసింది. అవి చూపించేందుకు ఆయన రూ.10 కోట్ల విలువైన భూములను రూ.5 కోట్లకే అమ్ముకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తూర్పు ప్రాంతంలోని బాపట్ల జిల్లాలో ఉన్న ఒక నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. గత ఎన్నికల్లోనే పెద్దమొత్తం సొంత డబ్బులు పెట్టుకున్న ఆయన రూ.30కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకూ ఖర్చు చేయగలమని చెప్పినట్లు తెలిసింది. అయితే రూ.70 కోట్లు పెట్టుకునే వారున్నారు, మీరెంత అని వారిని ఎత్తేసి వేరే జిల్లా వారిని రంగంలోకి తెచ్చారు. పక్కనున్న మరో నియోజకవర్గంలో ఇదే తంతు సాగుతోంది. మరో రెండు రిజర్వ్‌డ్ నియోజకవర్గాలలో కూడా ఆర్థిక వనరులున్న వారినే రంగంలోకి దింపడంలో కూడా అదే ప్రథమ లక్ష్యంగా భావిస్తున్నారు.