Share News

కార్పొరేటర్లకూ తాయిలాలు!

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:39 AM

వచ్చే ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ అనేక అడ్డదారులను తొక్కుతోంది. కోడ్‌ను అతిక్రమంచి తాయిలాలు పంపిణీ చేస్తోంది.

కార్పొరేటర్లకూ తాయిలాలు!

కొంతకాలంగా వైసీపీకి చెందిన కొందరు అలక

వారిని బుజ్జగించేందుకు అభ్యర్థుల ప్రయత్నం

భారీగా నగదు పంపిణీ

నగరంలో చర్చనీయాంశం

ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 18 : వచ్చే ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ అనేక అడ్డదారులను తొక్కుతోంది. కోడ్‌ను అతిక్రమంచి తాయిలాలు పంపిణీ చేస్తోంది. ఒంగోలులో ఇప్పటికే సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఆశావర్కర్లు, ఆర్పీలు, అంగన్‌వాడీలకు దుస్తులు, నగదు ఇచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడు అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ నాయకులను సంతృప్తిపరిచే చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా కార్పొరేటర్లను బహుమతుల పేరుతో బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రజల్లో వ్యతిరేకతతో ప్రలోభాలు

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన వైసీపీ నాయకులు పార్టీ శ్రేణులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపార్టీ తరఫున ఒంగోలు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తాయిలాల పంపిణీని ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్‌ అమలుకు ముందే ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పుడు పార్టీ నాయకులు, శ్రేణులపై దృష్టి సారించారు. కొద్ది నెలల క్రితం నగరంలో పేదలకు పట్టాల పంపిణీ సందర్భంగా ఎన్‌.అగ్రహారం, మల్లేశ్వరపురం, వెంగముక్కలపాలెంలో కొనుగోలు చేసిన పొలా లను బాగు చేసి, రోడ్లు, ఎర్త్‌ వర్క్‌, విద్యుత్‌ సౌకర్యం కల్పన పనుల్లో తమకు వాటా ఇస్తారని నగరపాలక సంస్థ కార్పొరేటర్లు ఆశపడ్డారు. అయితే ఆ పనులు తమకు కేటాయించకపోవడంతో వారు అసంతృప్తికి గురయ్యారు. కొందరు కార్పొరేటర్లు తమకు అధికార పార్టీలో ఉన్నా అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఈనేపథ్యంలో ఆర్థికంగా స్థితిమంతుడైన నాయకుడిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ రంగంలోకి దించడంతో మరోసారి ఆశలు పెంచుకున్నారు. ఆయన ఒంగోలులో పర్యటించే ప్రతిసారీ తమకు కబురు వస్తుందని ఆశించిన వారికి ఎంపీ అభ్యర్థి నుంచి పిలుపురాలేదు. అధిక సమయం ఆయన పశ్చిమ ప్రాంతంపై దృష్టి సారించారు. అంతేకాకుండా తన కార్యాలయాన్ని సైతం జిల్లాకు మధ్యస్థంగా ఉండే పొదిలిలో తీసుకోవడంతో కార్పొరేటర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.

కార్పొరేటర్‌కు రూ.3లక్షలు, కోఆప్షన్‌ సభ్యుడికి రూ.2లక్షలు

నెలరోజులుగా ఎంపీ అభ్యర్థి పిలుపు కోసం ఎదురు చూసిన కార్పొ రేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు, వైసీపీ డివిజన్‌ అధ్యక్షులకు ఎట్టకేలకుఅవకా శం లభించింది. రెండు రోజుల క్రితం ఒంగోలులో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాన్ని విజయవంతం చేయాలంటూ నియో జకవర్గ పార్టీ శ్రేణులకు, కార్పొరేటర్లకు తాయిలాలు ఇచ్చినట్లు సమా చారం. సమావేశం జరిగిన వేదిక వద్ద ఇస్తే మీడియా కంట పడే అవ కాశం ఉందని గ్రహించిన నేతలు గుట్టుగా డివిజన్‌లకే వెళ్లి కార్పొరేటర్‌కు రూ.3లక్షలు, కోఆప్షన్‌ సభ్యుడికి రూ.2లక్షలు, డివిజన్‌ అధ్యక్షుడికి రూ.లక్ష చొప్పున తాయిలాలు ఇచ్చినట్లు తెలిసింది. ఓటమి తప్పదని భావించిన వైసీపీ నాయకులు అటు ప్రజలను, ఇటు పార్టీ శ్రేణులను డబ్బుతో కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది.

Updated Date - Apr 19 , 2024 | 01:39 AM