Share News

‘మోక్ష’గుండం

ABN , Publish Date - Nov 27 , 2024 | 11:44 PM

మోక్షగుండం గ్రామంలో ఒకప్పుడు వ్యవసాయమే ప్రధాన వృత్తి. అందరూ దానిమీద ఆధారపడి జీవించినవారే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన గ్రామం అది. దేశంలో ఎన్నో ఆనకట్టలు, నీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు ఆద్యుడు ఆయనే. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని గ్రామంలో పెద్దలు నూరిపోస్తుండడంతో ఒక్కొక్కరుగా పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరారు.

‘మోక్ష’గుండం
మోక్షగుండం గ్రామం వ్యూ

విశ్వేశ్వరయ్య స్ఫూర్తి.. నిత్య చైతన్య దీప్తి

ఉన్నత స్థాయిలో మోక్షగుండం వాసులు

ఉద్యోగ, వ్యాపారాల్లో గ్రామస్థులు ముందడుగు

ప్రతి ఇంటిలోనూ ఉద్యోగులే

చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో స్ఫూర్తివంతంగా అడుగులు

చరిత్ర పుటల్లో ఎంతో ప్రాధాన్యత గల ఊరుగా పేరు లిఖించుకుంది..

ఎందరో గొప్ప మేధావులకు జన్మనిచ్చిన గ్రామంగా ఖ్యాతిని సొంతం చేసుకుంది..

త్రేతాయుగంలో వశిష్ట మహర్షి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఉన్న ఆధ్యాత్మిక గ్రామంగా గుర్తింపు పొందింది..

నల్లమల అడవి అందాల నడుమ ఉన్న ఆ గ్రామంలో ఒకప్పుడు అందరూ రైతు బిడ్డలే.. రాన్రాను ఒకరిని చూసి ఒకరు.. వారిని చూసి మరొకరు ఇలా ఆదర్శంగా తీసుకుని ఎదిగారు.. అన్నీ రంగాల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగాలు, ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్టర్లుగా, పలువురు సాహిత్యంపై పట్టు సాధించి అనేక రకాల గ్రంధాలు రచించి కవులుగా గుర్తింపు మండలంలోని మోక్షగుండం గ్రామంపై ప్రత్యేక కథనం...

బేస్తవారపేట, నవంబరు26 (ఆంధ్రజ్యోతి): మోక్షగుండం గ్రామంలో ఒకప్పుడు వ్యవసాయమే ప్రధాన వృత్తి. అందరూ దానిమీద ఆధారపడి జీవించినవారే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన గ్రామం అది. దేశంలో ఎన్నో ఆనకట్టలు, నీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు ఆద్యుడు ఆయనే. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని గ్రామంలో పెద్దలు నూరిపోస్తుండడంతో ఒక్కొక్కరుగా పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరారు. కష్టపడి చదివి విజయశిఖరాలకు చేరుకున్నారు. వారిలో హైదరాబాద్‌లోని కిమ్స్‌ వైద్యశాలలో క్యాన్సర్‌ వైద్యులుగా పనిచేస్తున్న తమ్మినేని ప్రతా్‌పరెడ్డి, కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో ఎముకల వైద్యులు దేమ రాజయ్యలు ఆ కోవకు చెందిన వారే. వీరు గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించి రోజుకు 5కిలోమీటర్లు నడిచి హైస్కూల్‌ విద్యను అభ్యసించినవారే.

కవులుగానూ ప్రసిద్ధి

గ్రామంలో చాలామంది సాహిత్యంపై పట్టు సాధించారు. బతుకుదెరువు కోసం ఉద్యోగాలు చేసుకుంటూ అనేక గ్రంథాలు రాశారు. అలాంటి వారిలో తాళ్లూరి నారాయణ మోక్షగుండం రామాయణం అనే కావ్యాన్ని రాశారు. ఈ కావ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించారు. అక్కయ్య సూరి, చిలకల కృష్ణమూర్తి, చిలకల చిన్న వెంకటసుబ్బారెడ్డి తదితరులు కవులుగా ప్రఖ్యాతి గాంచి అనేక గ్రంథాలు రాశారు. సంస్కృతంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఆర్మీ ఇంజనీరు వెంకటేశ్వర్లు నాలుగుసార్లు రాష్ట్రపతి అవార్టులు అందుకున్నారు. కన్నడ భాషలో మోక్షగుండం గ్రామ జీవిత చరిత్ర మైసూరులో ప్రచురించబడింది.

ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే

దేశంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ, ప్రయివేట్‌ ఉద్యోగాల్లో మోక్షగుండం గ్రామస్థులే ఉన్నారు. ఇంటికొకరు చొప్పున ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా కర్నాటక రాష్ర్టాల్లో క్లాస్‌ 1కాంట్రాక్లర్లు ఉన్నారు. పశు వైద్యశాఖలో 8మంది, లెక్చరర్లుగా ఐదుగురు, ఉపాధ్యాయ వృత్తిలో 15 మంది, సైనికులుగా 70 మంది, బ్యాంక్‌లో నలుగురు, పలు ప్రభుత్వ, ప్రయివేట్‌ సంస్థల్లో సూమారు 150 మందికి పైగా, విదేశాల్లో 30 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో విదేశాల్లోనే 10 మంది డాక్టర్‌ వృత్తిలో ఉన్నారు. 1936లో ఏర్పాటైన ప్రాథమిక పాఠశాల ఇప్పుడు ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఆ స్కూలు ప్రధానోపాధ్యాయ వృత్తిలో ఉన్న దేశిరెడ్డి రఘునాథరెడ్డిది ఆ గ్రామం కావడంతో ఆ పాఠశాలను ఎంతో ఆహ్లాదకరంగా పచ్చని చెట్లతో, అపరిశుభ్రంగా తీర్చిదిద్దారు.

ఉన్నత స్థాయిల్లో ఎందరో...

గ్రామంలో అనేకమంది ఉన్నత స్థాయి ఉద్యోగాలలో ఉన్నారు. బ్రిటీష్‌ కాలంలో పల్నాటి పోలిరెడ్డి(సర్కిల్‌పోలిరెడ్డి) ఎస్సైగా పనిచేశారు. అప్పట్లో పోలీ్‌సశాఖలో కమాండెంట్‌గా పనిచేసిన బోధనపు నాగిరెడ్డి కుమారులు నేడు అనేక దేశాల్లో పలు వ్యాపారాలు చేస్తున్నారు. సెయింట్‌ సాఫ్ట్‌వేర్‌ అధినేత బొధనపు వెంకట మోహన్‌రెడ్డి, బోదనపు అశోక్‌రెడ్డి, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ తమ్మినేని కృష్ణారెడ్డి, రిటైర్డ్‌ జేడీఏ తమ్మినేని పెద్దిరెడ్డి, రిటైర్డ్‌ ఇంజనీర్‌ పల్నాటి శివశంకర్‌రెడ్డి, వైద్యులుగా తమ్మినేని ప్రతా్‌పరెడ్డి, తమ్మినేని సిద్ధార్థరెడ్డి, దేమ రాజయ్య, తదితరులు రాణిస్తున్నారు. అలాగే ఈమధ్య కాలంలో మృతి చెందిన వారి జాబితాలో సుప్రీంకోర్టు న్యాయవాది పల్నాటి రామిరెడ్డి, రిటైర్డు డీఎ్‌ఫవో ఉప్పూలూరి పోలయ్య, పశువైద్యశాలలో ఏడీగా పనిచేస్తున్న పల్నాటి మహాదేవారెడ్డి, పోలీస్‌ శాఖలో హైదరాబాద్‌లో ఎస్పీ స్థాయిలో రంగారెడ్డి, విద్యుత్‌శాఖలో రిటైర్డ్‌ ఎస్సీ తమ్మినేని శివారెడ్డి ఉన్నారు.

మోక్షగుండం ముక్తేశ్వరాలయం

త్రేతాయుగంలో వశిష్ట మహర్షి ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయాన్ని దేవదాయశాఖ ఆధీనంలోకి తీసుకుంది. ఏటా శివరాత్రి పండుగ వైభవంగా జరుగుతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తండ్రి శ్రీనివాస శాస్ర్తి ఈ దేవాలయంలో నిత్య పూజలు జరిపారని వారికి ఇలవేల్పు ముక్తేశ్వరంగా పిలువబడుతోంది.

పుట్టిన గ్రామంలోని పాఠశాల దత్తత

బోదనపు వెంకట మోహన్‌రెడ్డి, సెయింట్‌ సాఫ్ట్‌వేర్‌ అధినేత

నేను పుట్టిన గ్రామమైన మోక్షగుండాన్ని దత్తత తీసుకున్నా. ప్రతిభ కలిగిన విద్యావంతులు ఏడుగురికి నెలకు రూ.70వేలు చెల్లించి పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన చదువు చెప్పిస్తున్నా. క్రీడా స్థలం కోసం 2 ఎకరాలు కొనుగోలు చేసి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాం. గత టీడీపీ ప్రభుత్వ హచాంలో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నా. గ్రామంలో మినరల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఉచితంగా పుస్తకాలు, లైబ్రెరీ ఏర్పాటు చేశారు. ఇప్పటికి సూమారు రూ.3కోట్లు తన ట్రస్ట్‌ నుంచి ఖర్చు చేశారు.

Updated Date - Nov 27 , 2024 | 11:44 PM