Share News

‘పాల’కూట విషం

ABN , Publish Date - Oct 27 , 2024 | 11:45 PM

దర్శి ప్రాంతంలో కల్తీ పాల తయారీ విచ్చలవిడిగా జరుగుతోంది. కుటీర పరిశ్రమలా సాగుతోంది. అడ్డగోలుగా సంపాదించాలన్న అత్యాశతో కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన యూరియా, సల్ఫర్‌, ఇతరత్రా పలు రసాయనాలతో కల్తీపాలు తయారు చేస్తున్నారు. వాటిని సాధారణ పాలలో కలుపుతున్నారు.

‘పాల’కూట విషం
దర్శిలో కల్తీ పాలను పారబోస్తున్న అధికారులు (ఫైల్‌)

దర్శిప్రాంతంలో విచ్చలవిడిగా కల్తీపాల తయారీ

యూరియా, సల్ఫర్‌, ప్రమాదకరమైన

రసాయనాల వినియోగం

లీటరు పాల నుంచి 10 లీటర్లు

ఇటు డెయిరీలు, అటు ప్రజలకు విక్రయం

ప్రాణాలతో అక్రమార్కుల చెలగాటం

అరకొరదాడులకే అధికారుల పరిమితం

దర్శి ప్రాంతంలో కల్తీ పాల తయారీ విచ్చలవిడిగా జరుగుతోంది. కుటీర పరిశ్రమలా సాగుతోంది. అడ్డగోలుగా సంపాదించాలన్న అత్యాశతో కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన యూరియా, సల్ఫర్‌, ఇతరత్రా పలు రసాయనాలతో కల్తీపాలు తయారు చేస్తున్నారు. వాటిని సాధారణ పాలలో కలుపుతున్నారు. అసలుకు, కల్తీకి తేడా తెలుసుకోలేని విధంగా కనికట్టు చేస్తున్నారు. కొందరు ప్రైవేటు డెయిరీలకు పోస్తుండగా, మరికొందరు నేరుగా ప్రజలకు విక్రయించి వారిని అనారోగ్యం‘పాలు’ చేస్తున్నారు. ఆహార భద్రత అధికారులు ఫిర్యాదులు అందినప్పుడు నామమాత్రపు దాడులు చేస్తున్నారే తప్ప నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు.

దర్శి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : స్వచ్ఛతకు నిదర్శనంగా చెప్పుకునే పాలు విషపూరితమవుతున్నాయి. కొందరు రకరకాల పద్ధతుల్లో కల్తీ పాలను తయారు చేస్తున్నారు. వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని అనేక చోట్ల ఈ వ్యవహారం సాగుతున్నప్పటికీ దర్శి నియోజకవర్గంలో అత్యధిక గ్రామాల్లో ఎక్కువ మంది దీన్ని వ్యాపారంగా మార్చుకొని విషం చిమ్ముతున్నారు. దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లో కల్తీ పాల తయారీ ముమ్మరంగా జరుగుతోంది. దర్శి పట్టణంలో అనేక పాల విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ప్రజలు నిత్యం వందలాది లీటర్ల పాలు కొనుగోలు చేస్తున్నారు. ఇదేఅదనుగా అక్రమార్కులు కల్తీ పాలను తయారుచేసి పాల విక్రయ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. పాల విక్రయ కేంద్రాల నిర్వాహకులు సేకరించిన పాలు నాణ్యమైనవా, కాదా అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. నాణ్యతను తెలుసుకునేందుకు వారి వద్ద అవసరమైన పరికరాలు లేవు. దీంతో వచ్చిన పాలు వచ్చినట్లు వినియోగదారులకు విక్రయిస్తున్నారు. నకిలీ పాల తయారీపై నిఘా లేకపోవడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది.

నిత్యం వందల లీటర్ల కల్తీపాలు తయారీ

దర్శిలో కొంతకాలం క్రితం 600 లీటర్ల కల్తీ పాలను ఆహార భద్రతశాఖ అధికారులు పట్టుకున్నారు. అంతకుముందు లంకోజనపల్లిలో పాల విక్రయ కేంద్రం నిర్వాహకుడి వద్ద నకిలీ పాలు గుర్తించారు. అధికారులు దాడులు చేసిన ప్రతిసారీ కల్తీ పాలు పట్టుబడుతున్నాయంటే ఇక్కడ ఏస్థాయిలో అవి తయారవుతున్నాయో అర్థమవుతుంది. కొంతమంది అక్రమార్కులు నిత్యం వందలాది లీటర్ల కల్తీ పాలను తయారు చేసి కొన్ని పాల శీతల కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. లాభాపేక్షే ధ్యేయంగా పనిచేస్తున్న ఆ పాలశీతల కేంద్రాల నిర్వాహకులు వచ్చిన పాలను తనిఖీ చేయకుండా కొనుగోలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి పాల శీతల కేంద్రంలో లాక్టోమీటరు ద్వారా పాలను తనిఖీ చేసి స్వచ్ఛమైనవిగా నిర్ధారించుకున్న తరువాతే కొనుగోలు చేయాలి. అలాచేస్తే పాల రాబడి తగ్గి ఆదాయం పడిపోతుందని ఉద్దేశపూర్వకంగానే కల్తీ పాలను కొనుగోలు చేస్తున్నారు.


రెండేళ్లలో 20 కేసుల నమోదు

ఒక్క దర్శి నియోజకవర్గంలోనే రెండేళ్లలో 20 కేసులు నకిలీ పాల తయారీకి సంబంధించి నమోదయ్యాయి. దర్శి-కురిచేడు రోడ్డులోని ఓ పాల శీతల కేంద్రం నకిలీ పాలు కొనుగోలు చేసిన కేసులో అధికారులు రూ.50 వేల జరిమానా విధించారు. కల్తీ పాలను పరీక్షించే ప్రభుత్వ కార్యాలయం ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంది. ఇక్కడి అధికారులు తనిఖీలు చేసి పంపిన శాంపిల్స్‌ను పరీక్షించి నివేదికలు పంపడానికి నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో కల్తీ పాల తయారీదారులకు భయం లేకుండా పోయింది. ఒకవేళ పట్టుకుని నేరం రుజువయినప్పటికీ జరిమానాలు మాత్రమే వేస్తున్నారు. ఫలితంగా, నకిలీ పాల తయారీదారులు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న కల్తీ పాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

కల్తీపాల తయారీ ఇలా..

గతంలో పాలలో నీళ్లు కలిపి కల్తీ చేసేవారు. ఆతర్వాత అధికపాల ఉత్పత్తి కోసం పశువులకు ఇంజక్షన్‌లు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా ప్రాణాలను హరించే పదార్థాలతో కల్తీ చేస్తున్నారు. కల్తీ పాలు తెల్లగా ఉండేందుకు పాలపొడి, లేదా పచ్చికొబ్బరిని ఉపయోగిస్తున్నారు. జిగురు వచ్చేందుకు సన్‌ప్లవర్‌, పామాయిల్‌ను మిక్స్‌ చేస్తున్నారు. నురుగు కోసం యూరియా, సల్ఫర్‌, ఇతరత్రా పలు రసాయనాలను కలుపుతున్నారు. ఇలా రూ. 100 ఖర్చుతో పది లీటర్ల కల్తీ పాలు తయారు చేస్తున్నారు.

Updated Date - Oct 27 , 2024 | 11:45 PM