మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అందించాలి
ABN , Publish Date - Sep 19 , 2024 | 12:56 AM
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ప్రకాశం భవన్‌లో బుధవారం విద్యాశాఖ అధికారులు, ప్రఽధానోపాధ్యాయులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశం
ఒంగోలు (కలెక్టరేట్), సెప్టెంబరు 18 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ప్రకాశం భవన్‌లో బుధవారం విద్యాశాఖ అధికారులు, ప్రఽధానోపాధ్యాయులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మధ్యాహ్న భోజనం అమలులో ఆహారపట్టికను పక్కాగా పాటించాలన్నారు. ఆ విషయంలో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. విద్యార్థులు భోజనాన్ని ఇష్టంగానే తింటున్నారా లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు భోజనాన్ని తరుచూ పరిశీలిస్తుండాలని ఆదేశించారు. పాఠశాలల్లో రక్షిత మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా టీచర్లు, కుకింగ్ ఏజెన్సీల నిర్వాహకులు మాట్లాడుతూ వారంలో రెండు రోజులపాటు పులిహోర పెడుతున్నామని, దానిని ఒక రోజుకు కుదించాలని కోరారు. కోడిగుడ్లను ఉడికించి ఐదు రోజులు ఇస్తున్నామని.. రెండు, మూడు రోజులు కోడిగుడ్డు కర్రీ రూపంలో ఇస్తే బాగుంటుందని సూచించారు. అన్నం, సాంబరు విడిగా ఉంటే బాగుంటుందని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మెనూ చార్జీలు పెంచాలని, ప్రస్తుతం ఇస్తున్నవి సరిపోవడం లేదని ఏజెన్సీలు కలెక్టర్‌ను కోరారు. ఆయా అంశాలపై అన్సారియా మాట్లాడుతూ ఆహార పట్టికలో మార్పులు చేస్తూ ప్రభుత్వానికి నివేదికను పంపుతామన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఉపాధ్యాయులు ప్రత్యేకశ్రద్ధ తీసుకో వాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో డీఈవో సుభద్ర, డిప్యూటీ డీఈవో సుబ్బారావు, ఎంఈవోలు పాల్గొన్నారు.