వైసీపీ నేతల మాయ
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:21 AM
గత ప్రభుత్వంలో వైసీపీ నేతల అక్రమాల పరంపరకు అంతేలేకుండా పోయింది. హనుమంతునిపాడు మండలంలోని వీరరామాపురం, దాసరిపల్లి, హెచ్‌ఎంపాడు, వేములపాడు, లింగంగుంట్ల, వాలిచర్ల, హనుమంతాపురం, గాయంవారిపల్లి, తాటిచెట్లపల్లి గ్రామాల్లో మెటల్, సీసీ రోడ్ల నిర్మాణాల పేరుతో నరేగా, గడపగడపకు, ఎంపీ గ్రాంట్ల కింద మంజూరైన పనులకు సంబంధించిన నిధులను పనులు చేయకుండానే వైసీపీ నేతలు మింగేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోడ్లు వేయకుండానే నిధులు స్వాహా
అధికారం మారడంతో ఆగమేఘాలపై నిర్మాణానికి యత్నం
కనిగిరి, జూలై 27: గత ప్రభుత్వంలో వైసీపీ నేతల అక్రమాల పరంపరకు అంతేలేకుండా పోయింది. హనుమంతునిపాడు మండలంలోని వీరరామాపురం, దాసరిపల్లి, హెచ్‌ఎంపాడు, వేములపాడు, లింగంగుంట్ల, వాలిచర్ల, హనుమంతాపురం, గాయంవారిపల్లి, తాటిచెట్లపల్లి గ్రామాల్లో మెటల్, సీసీ రోడ్ల నిర్మాణాల పేరుతో నరేగా, గడపగడపకు, ఎంపీ గ్రాంట్ల కింద మంజూరైన పనులకు సంబంధించిన నిధులను పనులు చేయకుండానే వైసీపీ నేతలు మింగేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాయంవారిపల్లిలో రెండేళ్ల క్రితం గ్రామ ఆర్బీకే దగ్గర నుంచి పోలేరమ్మ గుడి వద్దకు నరేగా కింద రూ.5 లక్షల గ్రాంటుతో సీసీ రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయి. వాటిని సర్పంచ్ స్వాహా చేసి రోడ్డు వేయకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. పనులు సక్రమంగా జరిగాయా? లేదా? అని చూడాల్సిన పంచాయతీరాజ్, ఉపాధి హామీ అధికారులు కాగితాల్లో చేసినట్లు చూపించి నిధులు ఇచ్చేశారు. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మండలంలో జరిగిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అధికారులతో సమీక్ష సందర్భంగా నిధుల వినియోగం, పనుల వివరాలు బయటికి వచ్చాయి. ఈక్రమంలో గాయంవారిపల్లిలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం విషయం వెలుగుచూసింది. రోడ్డే వేయని విషయం తెలుసుకున్న సదరు గ్రామస్థులతోపాటు టీడీపీ నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు గాయంవారిపల్లిలో సీసీ రోడ్డును ఆగమేఘాలపై నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గాయంవారిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం విషయమై పంచాయతీరాజ్ డీఈ ఆదిశేషును వివరణ కోరగా, వేయలేదన్న విషయాన్ని ఒప్పుకున్నారు. సంబంధిత ఏఈ నిర్లక్ష్య వైఖరితో నిధులు డ్రా చేయడం జరిగిందని, కాంట్రాక్టు చేత రోడ్డు వేయిస్తామని తెలిపారు. రోడ్డు నిర్మాణం కోసం తోలిన కంకరును గ్రామస్థులు ఎత్తుకెళ్లారని చెప్పారు. పనులు చేసిన విషయాన్ని పరిశీలించకుండానే బిల్లులు మంజూరు చేశారా అని అడుగగా ఆయన సమాధానాన్ని దాటవేశారు.