Share News

కుటీర పరిశ్రమగా కల్తీపాల తయారీ

ABN , Publish Date - Feb 13 , 2024 | 10:15 PM

కల్తీ పాల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలో పలు గ్రామాలలో కల్తీ పాల తయారీ జరుగుతుంది. పాడి రైతులతో పాటు పాలసేకరణ ఏజెంట్లు కూడా కల్తీపాల తయారీ చేస్తున్నారు. దీంతో రాజుగారి పాల చందంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ మండలాలు, ప్రకాశం జిల్లా పరిధిలోని తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి మండలాలు, పల్నాడు జిల్లాలోని వినుకొండ, నూజెండ్ల, శావల్యాపురం మండలాలలోని పలు గ్రామాలలో కల్తీ పాల తయారీ జరుగుతుంది. పాల ఉత్పత్తిదారులు తమ పాలకు తోడు అదనంగా మరికొంతమేర పాలు అధికం చేసేందుకు కల్తీ పాల తయారీ చేస్తున్నారు.

కుటీర పరిశ్రమగా కల్తీపాల తయారీ
ఏల్చూరు లో పట్టుబడ్డ కల్తీ పాలతో ఉన్న క్యాన్‌ లు

విచ్చలవిడిగా మారిన వైనం

పర్యవేక్షణ కరువు....

అద్దంకి, ఫిబ్రవరి 13: కల్తీ పాల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలో పలు గ్రామాలలో కల్తీ పాల తయారీ జరుగుతుంది. పాడి రైతులతో పాటు పాలసేకరణ ఏజెంట్లు కూడా కల్తీపాల తయారీ చేస్తున్నారు. దీంతో రాజుగారి పాల చందంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ మండలాలు, ప్రకాశం జిల్లా పరిధిలోని తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి మండలాలు, పల్నాడు జిల్లాలోని వినుకొండ, నూజెండ్ల, శావల్యాపురం మండలాలలోని పలు గ్రామాలలో కల్తీ పాల తయారీ జరుగుతుంది. పాల ఉత్పత్తిదారులు తమ పాలకు తోడు అదనంగా మరికొంతమేర పాలు అధికం చేసేందుకు కల్తీ పాల తయారీ చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు పాల సేకరణ ఏజెంట్లు కూడా తాము సేకరించిన పాలకు తోడు అదనంగా పాల కోసం కల్తీ పాలు తయారీ చేస్తున్నారు. అదే సమయంలో ఫాట్‌ అధికంగా వస్తే పాల ధర ఎక్కువ ఉంటున్నందున , అందుకనుగుణంగా పామాయిల్‌, సన్‌ప్లవర్‌ ఆయిల్‌, పౌడర్‌ కలిపి పాల ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా ఎవరికి వారే కల్తీ పాలు తయారీ చేస్తుండటంతో అసలు కంటే కల్తీ శాతమే అధికంగా ఉంటుంది. కల్తీ పాల గురించి పాల డెయిరీల నిర్వహకులకు పూర్తి అవగాహన ఉన్నప్పటికి పాలకొరత నేపథ్య్యంలో కల్తీ పాలను సైతం తీసుకుంటున్నారు. కొన్ని కార్పొరేట్‌ పాల డెయిరీలు మాత్రం కల్తీ పాలను నిరాకరిస్తుండగా, చిన్న, మధ్య తరహా డెయిరీల నిర్వహులు పోటీని తట్టుకోలేక కల్తీ పాలను సైతం ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తుంది. గత ఏడాది అద్దంకిలో పెద్ద ఎత్తున కల్తీ పాలు పట్టుబడగా, ఇటీవల దర్శి లో కూడా పట్టుబడ్డాయి. మంగళవారం సంతమాగులూరు మండలం ఏల్చూరులో పాలసేకరణ కేంద్రంలో అధికారులు తనిఖీలు చేయటంతో కల్తీ పాలబండారం మరో సారి వెలుగుచూసింది. అయితే, కల్తీ పాలు అని నిర్దారణ అయినప్పటికి చర్యలు నామమా త్రంగా ఉండటంతో యథావిధిగా కల్తీపాల తయారీ జరుగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. కల్తీ పాలను తాగటం ద్వారా చిన్న పిల్లలు, వృద్ధులలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కల్తీ పాల తయారీ అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కల్తీపాల తయారీ కేంద్రంపై విజిలెన్స్‌ దాడులు

సంత మాగులూరు, ఫిబ్రవరి 13: మండలంలోని ఏల్చూరు గ్రామంలో కల్తీ పాలతయారీ కేంద్రంపై విజిలెన్స్‌ అదికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఏల్చూరుకు చెందిన మందా కిరణ్‌ గత కొంతకాలంగా పాలవ్యాపారం చేస్తున్నాడు. రైతుల నుంచి సేకరించే పాలతో పాటుగా కల్తీ పాలు తయారుచేసి డెయిరీలకు పంపి సొమ్ముచేసుకుంటున్నారు. పాల పౌడర్‌, పామాయిల్‌, సన్‌ఫ్లవర్‌ అయిల్‌, ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఫౌడర్‌తో కలసి కల్తీ పాలను తయారుచేసి డైరీలకు పంపిస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అధికారులు మంగళవారం కిరణ్‌ ఇంటిపై దాడిచేసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న 9 కల్తీ పాల క్యాన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్యాన్లలో ఉన్న సుమారు 320 లీటర్ల పాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 65 పామాయిల్‌ ప్యాకెట్‌లు, 35 సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ శాంపిల్స్‌ను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.

Updated Date - Feb 13 , 2024 | 10:15 PM