మనసా స్మరామి
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:32 PM
మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు వర్ధంతి కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా గురువారం పెద్దఎత్తున జరిగాయి. ఏటా టీడీపీ శ్రేణులు భారీగా నిర్వహిస్తున్నా త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి మరింత జోరు కనిపించింది. ఆయా ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌కు ఘన నివాళి
ఊరూవాడా వర్ధంతి కార్యక్రమాలు
పలుచోట్ల భారీగా అన్నదానాలు, రక్తదాన శిబిరాలు
ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు, ముఖ్యనేతలు
ఒంగోలు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు వర్ధంతి కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా గురువారం పెద్దఎత్తున జరిగాయి. ఏటా టీడీపీ శ్రేణులు భారీగా నిర్వహిస్తున్నా త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి మరింత జోరు కనిపించింది. ఆయా ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 8నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఇతర ముఖ్యనేతలు పలు ప్రాంతాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌లు తిరుపతి జిల్లా వెంకటగిరిలో శుక్రవారం చంద్రబాబు బహిరంగ సభ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లలో ఉన్నారు. దీంతో వారు గురువారం తిరుపతిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి హారతి ఇచ్చి నివాళులర్పించారు. ఇక జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలిస్తే.. ఒంగోలులోని పార్టీ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం, సభతోపాటు దాదాపు పదికిపైగా ప్రాంతాల్లో జరిగిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ తొలుత దామచర్ల జనార్దన్‌తో కలిసి ఒంగోలులోని ఎన్టీఆర్ పార్కులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన నాగులుప్పలపాడులో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండపి నియోజకవర్గంలోని మండల కేంద్రాలైన టంగుటూరు సింగరాయకొండ, కొండపితోపాటు పలు గ్రామాల్లో టీడీపీ యువనేత దామచర్ల సత్య నేతృత్వంలో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. కనిగిరితోపాటు మండల కేంద్రాలైన వెలిగండ్ల, సీఎ్‌సపురం, ఇతర పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి నేతృత్వంలో ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. దర్శి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, గోరంట్ల రవికుమార్ పాల్గొన్నారు. వైపాలెంతోపాటు పలు ఇతరచోట్ల ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు హాజరయ్యారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గిద్దలూరు, కంభంలోనూ, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురంలోనూ పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.