మెప్మాలో మల్లగుల్లాలు
ABN , Publish Date - Feb 10 , 2024 | 12:48 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో బోగస్ పొదుపు గ్రూపుల కుంభకోణంపై కలవరం మొదలైంది. ఈ వ్యవహారం నుంచి ఏ విధంగా బయటపడాలో అర్థం కాక అందరూ మల్లగుల్లాలు పడుతున్నారు.
రుణ దోపిడీపై కొనసాగుతున్న విచారణ
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అక్రమాలు
ఓ సీవోకు స్కూటీని బహుమతిగా ఇచ్చిన ఆర్పీ
తప్పించుకునే మార్గంలో వైసీపీ నాయకులు, ఆర్పీలు
ఒంగోలు (కార్పొరేషన్), ఫిబ్రవరి9 : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో బోగస్ పొదుపు గ్రూపుల కుంభకోణంపై కలవరం మొదలైంది. ఈ వ్యవహారం నుంచి ఏ విధంగా బయటపడాలో అర్థం కాక అందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. రుణాల రూపంలో కోట్లు దండుకుని దర్జాగా సొంతానికి వాడుకున్న వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆర్పీల వారీగా వారి పరిధిలోని పొదుపు గ్రూపులు ఎన్ని? ఎన్ని లక్షల రుణాలు మంజూరుచేశారు? నెలవారీ చెల్లింపులు ఎలా ఉన్నాయి? వాస్తవ పొదుపు సంఘాలు ఎన్ని? అని ఆరా తీస్తున్నారు. గ్రూపుల వారీగా జాబితా సిద్ధం చేసి, పీడీతోపాటు సీఎంఎం, సీవోలు విచారణ చేపట్టారు. అయితే ఇప్పటికే మేయర్ గంగాడ సుజాత వెల్లడించినట్లు ప్రాథమికంగా రూ.12కోట్లు ఉన్నట్లు తెలుస్తుండగా, పూర్తిస్థాయివిచారణ జరిగితే మొత్తం రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు దోపిడీ లెక్కలు తేలే అవకాశం కనిపిస్తోంది.
గ్రూపులతో ఆర్పీల సమావేశాలు
రుణ కుంభకోణంలో భాగస్వాములైన కొందరు ద్వితీయశ్రేణి వైసీపీ నాయకులు, అలాగే అధికార పార్టీకి చెందిన ఆర్పీలు ఈ అవినీతి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అడ్డదారులు వెతుకుతున్నట్లు సమాచారం. కొందరు ఆర్పీలు అయితే హడావుడిగా పొదుపు గ్రూపులతో సమావేశాలు ఏర్పాటు చేసి బతిమాలుకుంటున్నారు. ఎవరైనా అధికారులు విచారణకు వచ్చి అడిగితే సభ్యులమే తీసుకున్నామని చెప్పాలని వేడుకొంటున్నారు. మొత్తంగా ఆంధ్రజ్యోతి కథనంతో నాలుగు రోజులుగా మెప్మాలో అలజడి కనిపిస్తుండగా, అధికారులు, ఉద్యోగులు తమ పేర్లు బయటకు వస్తాయేమోనని వణికిపోతున్నారు. దీంతో రెండు రోజులుగా కార్యాలయం వైపు కన్నెత్తి చూడటం మానేసిన సీవోలు, ఇతర ఉద్యోగులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అవినీతిపై విచారణ చేస్తున్నారు.
రుణ దోపిడీలో పలువురి పాత్ర
ఇప్పటికే ఓ కార్పొరేటర్ భర్త రుణదోపిడీ స్కాంలో భాగస్వాముడిగా ఉన్నట్లు తెలుస్తోంది. నగర వైసీపీలో హడావుడిగా కనిపించే ఓ ద్వితీయశ్రేణి నాయకుడు, మహిళా కార్పొరేటర్ భర్త కూడా చేతివాటం చూపినట్లు వెలుగుచూసింది. అలాగే వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూసే ఓ వ్యక్తి తన సిఫారసుతో ఒకరిని ఆర్పీగా నియమించగా, ఆమె పరిధిలో ఒక్క పొదుపు గ్రూపు కూడా లేదని సమాచారం. అయితే ఆమె నేటికీ ఆర్పీగా కొనసాగుతూ జీతం పొందడడమే కాకుండా బోగస్ రుణాల వ్యవహారంలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసలు గ్రూపుల్లో నుంచి ఇద్దరిద్దరి పేర్లు సేకరించి వేరుగా మరో నకిలీ గ్రూపు సృష్టించి లక్షలు దండుకున్న ఆర్పీలు, తమ పలుకుబడిని ఉపయోగించి తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాగే ఒకే పొదుపు గ్రూపు పేరుతో నాలుగైదు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఆర్పీలు ఆ మొత్తాలను పంచుకున్నట్లు తెలిసింది.