Share News

వసతిగృహాల్లో న్యాయాధికారి తనిఖీ

ABN , Publish Date - Oct 27 , 2024 | 01:29 AM

కళాశాలల వసతి గృహాలను, మానసిక దివ్యాంగుల హాస్టళ్లను శనివారం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి ఎ.ఓంకార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వసతిగృహాల్లో న్యాయాధికారి తనిఖీ

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలికల, బీసీ బాలుర పాఠశాల వసతిగృహా లను, బీసీ బాలుర కళాశాలల వసతి గృహాలను, మానసిక దివ్యాంగుల హాస్టళ్లను శనివారం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి ఎ.ఓంకార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీసీ బాలికల హాస్టల్‌లోనికి వర్షం నీరు రావడంపై ఆయన అధికారులను నిలదీశారు. బాలుర వసతిగృహంలో మురికినీరు బయటకు పోయేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బాత్‌రూమ్‌ల నిర్వహణ పట్ల, మురికినీరు నిలువ ఉండడంపై జడ్జి సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు దోమలతో ఇబ్బందులు ఏర్పడ కుండా, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు మంచి ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, వెలుతురు, గాలి వచ్చే విధంగా చూడాలన్నారు.

డిసెంబరు 14న జాతీయ లోక్‌అదాలత్‌

గిద్దలూరు టౌన్‌ : డిసెంబరు 14వ తేదీన జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.ఓంకార్‌ అన్నారు. శనివారం కోర్టు భవనాల పరిధిలో న్యాయవాదులు, పోలీసు, రెవిన్యూ, మున్సిపల్‌, బ్యాంక్‌, టెలిఫోన్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జడ్జి ఓంకార్‌ మాట్లాడుతూ డిసెంబరు 14న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Updated Date - Oct 27 , 2024 | 01:29 AM