Share News

పోటెత్తిన అభిమానం

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:25 AM

ల్లాలో సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది. కాగా బుధవారం పలు స్థానాలకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. అదేసమయంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి.

పోటెత్తిన అభిమానం
ఒంగోలులో ర్యాలీకి హాజరైన అశేష జనం (ఇన్‌సెట్‌లో) అభివాదం చేస్తున్న దామచర్ల, మాగుంట తదితరులు

అట్టహాసంగా దామచర్ల, ఉగ్ర, అశోక్‌రెడ్డి నామినేషన్లు

వెల్లువలా తరలివచ్చిన కూటమి శ్రేణులు

స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన ప్రజలు

ఒంగోలు, కనిగిరి, గిద్దలూరుల్లో భారీ ర్యాలీలు

కార్యకర్తల్లో వెల్లివిరిసిన ఉత్సాహం

నే డు దాఖలు చేయనున్న బీఎన్‌, కందుల

నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ

ఊరూవాడా కదిలొచ్చారు. ఎటుచూసినా పసుపుమయం. కూటమి శ్రేణులతోపాటు, ప్రజలు పెద్దసంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. భారీగా పార్టీ జెండాలు చేతపట్టి పసుపు చొక్కాలు ధరించి సందడి చేశారు. జిల్లాలోని ఒంగోలు, కనిగిరి, గిద్దలూరుల్లో బుధవారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు అట్టహాసంగా సాగింది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు జెండాలతో తరలిరాగా రాజకీయ ప్రత్యర్థులను సైతం అబ్బురపరిచేలా ర్యాలీలు సాగాయి. అన్నిచోట్లా జనం బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూలవర్షం కురిపించారు. రోడ్లన్నీ పసుపుమయంగా మారిపోయాయి. దారులన్నీ జన సంద్రమయ్యాయి. మేళతాళాలు, తప్పెట్ల మోతల మధ్య తెలుగుతమ్ముళ్లు కదం తొక్కారు.

ఒంగోలు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది. కాగా బుధవారం పలు స్థానాలకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. అదేసమయంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. జిల్లాలో ఒంగోలు పార్లమెంట్‌, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం విదితమే. టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డితోపాటు మూడు స్థానాల అసెంబ్లీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. బుధవారం ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్‌, కనిగిరి అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరు అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి దాఖలు చేశారు. ఈసందర్భంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించగా టీడీపీ శ్రేణులు, కూటమిలో మిగతా పార్టీలైన జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సా హంగా పాల్గొన్నారు. నియోజకవర్గాల్లోని నలుమూలల నుంచి వేలాదిగా టీడీపీ శ్రేణులు తరలివచ్చి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనడంతో బుధవారం ఉదయం ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు పట్టణాలు పసుపుమయమయ్యాయి.

స్వచ్ఛందం.. ఉరిమే ఉత్సాహం

ఒంగోలులో ఉదయం పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించిన టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ పది గంటల సమయానికి మినీ స్టేడియం వద్దకు చేరుకోగా వేలాదిమంది కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శివారెడ్డి ఇతర నియోజకవర్గ నాయకులతో కలిసి ప్రత్యేక వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. అయితే ఫర్లాంగు దూరంలోని డీ మార్ట్‌ సెంటర్‌కు చేరేందుకు దాదాపు గంట పట్టగా నామినేషన్లు దాఖలు ముహూర్తం దగ్గరపడటంతో వాహనం దిగి బైక్‌పై ఆర్డీవో కార్యాలయానికి జనార్దన్‌, ఆయన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు చేరుకున్నారు. అందరూ కలిసి నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే జనార్దన్‌ సోదరుడు టీడీపీ యువనేత దామచర్ల సత్య తన తండ్రి పూర్ణచంద్రరావుతో కలిసి వచ్చి పార్టీ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. కాగా జనార్దన్‌ ర్యాలీ కోలాహలంగా, ఆకర్షణీయంగా సాగింది. కేరళ వాయిద్యాలు, పసుపు చీరలు, తలపాగాలతో మహిళలు, కేరింతలు కొడుతూ యువకులు పాల్గొనడం ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా కొత్తపట్నం మండలం పల్లెపాలెం టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి 16 కి.మీ. దూరం పాదయాత్ర చేస్తూ ఒంగోలు వచ్చి ర్యాలీలో పాల్గొనడం విశేషం.

ఉగ్ర దండుతో ఉరకలెత్తిన కనిగిరి

కనిగిరిలో టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి నామినేషన్‌ దాఖలు సందర్భంగా కనిగిరి పట్టణం పసుపుదళంతో నిండిపోయింది. ఉగ్ర కార్యాలయం ఉన్న అమరావతి గ్రౌండ్‌కు ఉదయానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది పార్టీశ్రేణులు తరలివచ్చారు. అశేషంగా తరలివచ్చిన కార్యకర్తలతో ఉదయం పదిన్నరకు ర్యాలీని ఉగ్ర ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధులు, పామూరు బస్టాండు మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకూ అది సాగింది. కేవలం ఒక కిలోమీటర్‌ దూరం మాత్రమే ఉన్న ఆ మార్గంలో ర్యాలీ సాగడానికి దాదాపు మూడు గంటలు సమయం పట్టింది. మార్గమధ్యంలో స్థానికులు స్వచ్ఛందంగా ఉగ్రపై పూలవర్షం కురిపించారు. వ్యాపారులు దుకాణాల నుంచి బయటకు వచ్చి తిలకించారు. జనసేన ఎమ్మార్పీఎస్‌, బీజేపీ కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

జనసంద్రమైన గిద్దలూరు

గిద్దలూరులో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ఆకర్షణీయంగా సాగింది. ఆర్టీసీ డిపో నుంచి అశోక్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి కలిసి ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రదర్శనను చేపట్టారు. సుమారు రెండున్నర గంటలపాటు అది సాగింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి పెద్దసంఖ్యలో జనం తరలి వచ్చారు. జనసేన కార్యకర్తలు కూడా అధికంగా పాల్గొన్నారు. బీజేపీ శ్రేణులు భారీగా హాజరయ్యా రు. పట్టణంలోని ప్రధానరోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. రాచర్ల గేటు సెంటర్‌ జనసంద్రంగా మారింది.

నేడు బీఎన్‌, కందుల

నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగియనుంది. చివరిరోజు కూడా భారీగానే అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నారు. ఎస్‌ఎన్‌పాడు అభ్యర్థి వియ్‌కుమార్‌, మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిలు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆసందర్భంగా బీఎన్‌ నేతృత్వంలో చీమకుర్తిలో, కందుల ఆధ్వర్యంలో మార్కాపురంలో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 01:25 AM