Share News

లోగుట్టు వారిద్దరికే ఎరుక!

ABN , Publish Date - May 07 , 2024 | 01:15 AM

అధికార వైసీపీ తెర చాటు కార్యకలాపాలకు ఆ కళాశాల అడ్డాగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో వాహనాల రాకపోకలతో హడావుడిగా మారింది. బహిరంగంగా కార్యకలాపాలు జరుగుతున్న ప్పటికీ అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది.

లోగుట్టు వారిద్దరికే ఎరుక!
వైసీపీ కార్యకలాపాలు జరుగుతున్న కళాశాల ఇదే

వైసీపీ తెరచాటు కార్యకలాపాలకు అడ్డాగా కళాశాల

దానిచుట్టూ కట్టుదిట్టమైన పహారా

కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం

పొదిలిలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం

పొదిలి, మే 6 : అధికార వైసీపీ తెర చాటు కార్యకలాపాలకు ఆ కళాశాల అడ్డాగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో వాహనాల రాకపోకలతో హడావుడిగా మారింది. బహిరంగంగా కార్యకలాపాలు జరుగుతున్న ప్పటికీ అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. దీంతో పట్టణంలో ఎన్నికల ప్రక్రియ అపహాస్య మవుతోంది. వైసీపీ ఒంగోలు పార్లమెంట్‌, మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థులు గత రెండునెలల నుంచి పొదిలి కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ఒంగోలు-నంద్యాల రహదారిలోని ఒక లాడ్జిని కేంద్రంగా మార్చుకొని సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక డిగ్రీ కళాశాల వేదికగా ఎన్నికల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేసి అందులోకి అనుమతి లేకుండా చీమకూడా దూరలేని పరిస్థితులను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ కళాశాలలో అసలేం జరుగుందోనన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఒక రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి నేతృత్వంలో విశ్రాంత ఉద్యోగులను బృందంగా ఏర్పాటు చేసుకొని అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులకు తెలిసినప్పటికీ ఆవైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేక పోతున్నారు. ఇటీవల పట్టణంలో రాజీనామాలు చేసిన ఉత్సాహవంతులైన వలంటీర్లను తమ రాజకీయ కార్యకలాపాల కోసం మౌఖిక ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. వారికి మంచి ప్యాకేజ్‌ కూడా ఇస్తున్నట్లు తెలిసింది. వారి ద్వారానే ఓటర్లకు నగదు, తాయిలాలు చేరవేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పట్టణంలో మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. అయినప్పటికీ వైసీపీ నేతలు మకాం వేసిన లాడ్జి, కళాశాలలో జరిగే కార్యకలాపాలపై ఎన్నికల అధికారులు నిఘా పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - May 07 , 2024 | 01:15 AM