Share News

అలా వదిలేస్తున్నారు!

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:56 PM

ఎన్నికల నోటిఫికేషన్‌ ముందే వైసీపీ ప్రలోభాల జాతర ప్రారంభించింది. ఓటర్లును ఆకట్టుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఒంగోలులో ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. షెడ్యూల్‌ ప్రకటనకు ముందే సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లపై నజరానాల వల విసిరిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఓటర్లకు గాలం వేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చీరలు, ఇతరత్రా తాయిలాల పంపిణీ ప్రారంభించారు. అయితే అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కొందరు సీ విజిల్‌ను అస్త్రంగా చేసుకున్నారు. నగర పరిధిలోని గుత్తికొండవారిపాలెంలోని ఓ గోదాములో భారీగా చీరలు నిల్వ ఉన్న విషయమై బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఆగమేఘాలపై స్పందించి రూ. 20లక్షల విలువైన తాయిలను అధికారులు సీజ్‌ చేశారు. అయితే కేసు నమోదు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదేరోజు అర్ధరాత్రి నగరంలో వైసీపీ రంగులతో ఉన్న తోపుడు బండ్లను వైసీపీ నేతలు పంపిణీ చేస్తుండగా సీవిజిల్‌కు సమాచారం అండంతో 14 బండ్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ చర్యలు కరువయ్యాయి.

అలా వదిలేస్తున్నారు!
బాలినేని బొమ్మతో ఉన్న చీరలు, షార్ట్‌, ఫ్యాంట్లు

ఒంగోలులో వైసీపీ నేతల బరితెగింపు

విచ్చలవిడిగా ఎన్నికల తాయిలాలు

షెడ్యూల్‌కు ముందే ప్రారంభం.. అనంతరం జోరందుకున్న వైనం

పట్టించుకోని అధికారులు

సీ విజిల్‌కు ఫిర్యాదుతో కదలిక

గుత్తికొండవారిపాలెం వద్ద భారీగా చీరలు స్వాధీనం

కేసు నమోదులో జాప్యం

ఎన్నికల నోటిఫికేషన్‌ ముందే వైసీపీ ప్రలోభాల జాతర ప్రారంభించింది. ఓటర్లును ఆకట్టుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఒంగోలులో ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. షెడ్యూల్‌ ప్రకటనకు ముందే సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లపై నజరానాల వల విసిరిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఓటర్లకు గాలం వేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చీరలు, ఇతరత్రా తాయిలాల పంపిణీ ప్రారంభించారు. అయితే అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కొందరు సీ విజిల్‌ను అస్త్రంగా చేసుకున్నారు. నగర పరిధిలోని గుత్తికొండవారిపాలెంలోని ఓ గోదాములో భారీగా చీరలు నిల్వ ఉన్న విషయమై బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఆగమేఘాలపై స్పందించి రూ. 20లక్షల విలువైన తాయిలను అధికారులు సీజ్‌ చేశారు. అయితే కేసు నమోదు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదేరోజు అర్ధరాత్రి నగరంలో వైసీపీ రంగులతో ఉన్న తోపుడు బండ్లను వైసీపీ నేతలు పంపిణీ చేస్తుండగా సీవిజిల్‌కు సమాచారం అండంతో 14 బండ్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ చర్యలు కరువయ్యాయి.

ఒంగోలు (క్రైం), మార్చి 28 : వైసీపీ ప్రభుత్వం సాగించిన ఐదేళ్ల ప్రజాకంఠక పాలనతో సీఎం జగన్‌రెడ్డి, ఆపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అందినకాడికి దోచుకొని పాలనలో మాత్రం ఉత్సవ విగ్రహాలుగా ఉంటూ కాలం వెళ్లదీశారు. ప్రజాప్రతినిధులుగా ఉండి జనానికి చేసిన మేలును వివరించి ఓట్లు అభ్యర్థించలేని పరిస్థితి వారికి దాపురించింది. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కడానికి అడ్దదారులు తొక్కుతున్నారు. సామ,దాన,భేద దండోపాయలను ప్రయోగిస్తోంది. షెడ్యూల్‌కు ముందే ప్రలోభాల పర్వానికి తెరతీసిన వారు ఇప్పుడు దాన్ని ముమ్మరం చేశారు. ఒంగోలు నగరంలో ఈ వ్యవహారం మరింత జోరుగా సాగుతోంది.

కోడ్‌ వచ్చిన రోజే సచివాలయ సెక్రటరీలకు తాయిలాలు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ఈనెల 16న విడుదల చేసింది. ఆరోజు నుంచే కోడ్‌ అమల్లోకి వచ్చింది. అయితే అదేరోజు నగర మేయర్‌ గంగాడ సుజాత నగరంలోని సచివాలయ కార్యదర్శులకు ఇంటికి పిలిపించుకొని చీరలు, ప్యాంటు, షర్ట్‌ను పంపిణీ చేశారు. ఇది వివాదాస్పదమైంది. అలాగే దానికి కొద్దిరోజుల ముందు వైసీపీకి చెందిన ముఖ్య నేత నివాసంలో ఆర్పీలు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మెప్మా సిబ్బందికి తాయిలాలు ఇచ్చారు. అలాగే వలంటీర్లకు సైతం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి దుస్తులు పంపిణీ చేశారు. ఎక్కడికక్కడ వారికి ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున నగదును అందజేశారు. ఇలాగే ఇళ్ల పట్టణాల పంపిణీ పేరుతో డివిజన్‌లలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి భరోసా పత్రంతోపాటు చీర, ప్యాంటు, షర్టు అందజేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని మరింత ముమ్మరం చేశారు.

పొగాకు గోదాంలో భారీగా చీరల నిల్వ

ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఒంగోలు మండలం గుత్తికొండవారిపాలెంలో అనాథరైజ్‌డ్‌ పొగాకు గోదాంలో వైసీపీ నేతలు భారీగా చీరాలను నిల్వ చేశారు. ఈ విషయమై సీ విజిల్‌కు ఫిర్యాదు అందింది. దీంతో బుధవారం అధికారులు దాడి చేశారు. అక్కడ 18 పెట్టెలలో 2,268 చీరలు, 500 సంచులు కనిపించాయి. చీరలు ఉన్న బాక్స్‌ మీద ధర ప్రకారం ఒక్కో చీర రూ.2,268 కాగా మొత్తం 864 చీరలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ 19,59,552, ఐదు వందల సంచులతో కలిపి సుమారుగా రూ.20లక్షలు విలువ ఉంటుందని వారు అంచనా వేశారు. ఈ చీరలు గుజరాత్‌లోని సూరత్‌ నుంచి తెప్పించిట్లు తేల్చారు. ఒంగోలు నగరపరిధిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలోనే కంటైనర్లలో భారీ ఎత్తున చీరలు తెప్పించి భారీగా నిల్వ ఉంచారని తెలుస్తోంది. మొత్తం లబ్ధిదారులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆశాలు, అంగన్‌వాడీలకు పంపిణీ చేయగా మిగిలిపోయినవి అక్కడ ఉంచినట్లు గోదాం యజమాని చెప్పారు.

అర్ధరాత్రి తోపుడు బండ్ల పంపిణీ

వైసీపీ నేతలు చిరువ్యాపారులను ఆకర్షించేందుకు తోపుడు బండ్ల పంపిణీని కూడా ప్రారంభించారు. నగరంలో బుధవారం రాత్రి ఈప్రక్రియను చేపట్టారు. రాంనగర్‌లో వీటిని పంపిణీ చేస్తుండగా సీ విజిల్‌కు ఫిర్యాదు వెళ్లింది. దీంతో ఆగమేఘాలపై అధికారులు అక్కడికి చేరుకున్నారు. 14 తోపుడు బండ్లను స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ వైసీపీ రంగుతో ఉండటం గమనార్హం. కోడ్‌ అమల్లోకి వచ్చినా ఇలా వైసీపీ నేతలు విచ్చలవిడిగా ప్రలోభాలు కొనసాగించడం బారి బరితెగింపును తెలియజేస్తోంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వెనకడుగు వేయడం విమర్శలకు తావిస్తోంది.

చర్యలకు అధికారుల వెనకడుగు

పెద్దఎత్తున చీరలు సీజ్‌ చేసిన అధికారులు తదుపరి చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. దీనిపై గురువారం సాయత్రం వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. అదేసమయంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మాత్రం అది పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన సామగ్రిగా గుర్తించామని చెబుతున్నారు. అసలు బిల్లులు లేని సరుకు అక్కడ ఎందుకు నిల్వ ఉంచారు అనే అంశం జోలికి వెళ్లలేదు. చీరలు ఉన్న బేళ్ల మీద మంజునాథ గ్రానైట్‌ మినరల్స్‌, శంఖవరం అనే చిరునామా ఉంది. గ్రానైట్‌ కంపెనీలకు అంత పెద్దమొత్తంలో చీరల అవసరం ఏంటన్నది ప్రశార్థకంగా మారింది. ఇది వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అంశం. అయితే ఎన్నికలకు సంబంధించిందని ముడిపెట్టి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. అదేవిధంగా చీరలు పట్టుబడిన గోదాము వద్దకు ఒంగోలు ఆర్డీవో, తహసీల్దార్‌ వచ్చి పరిశీలించారు. కానీ అక్కడ నిల్వ ఉంచి చీరలు ఎవరికి సంబంధించినవి అన్నది మాత్రం తేల్చలేదు. గోదాం యజమాని పమ్మి జయరామిరెడ్డి కుమారుడు వినయ్‌కుమార్‌రెడ్డి మాత్రం కొత్తపట్నం మండల వైసీపీ నేత అంజిరెడ్డి చీరలు తెప్పించి నిల్వ ఉంచారని, వాటిని తీసుకెళ్లాలని ఎన్నిమార్లు ఫోన్‌చేసినా స్పందించలేదని విలేకరులకు చెప్పారు. అధికారులు గోదాం యజమానిని విచారిస్తే అక్కడ చీరలు ఎవరు నిల్వ ఉంచారన్నది తెలుస్తుంది. కానీ ఆవైపు దృష్టి సారించలేదు. అయితే చీరలు తమవి అని ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పౌరసరఫరాల గోదాంకు తరలించామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అక్కడ నిల్వ ఉంచిన చీరల పెట్టెలు, సంచులపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫొటోలు ఉండటమే అధికారులు తర్జనభర్జనకు కారణంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Mar 28 , 2024 | 11:56 PM