Share News

చివరి రోజు అదుర్స్‌

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:00 AM

సాధారణ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. చివరిరోజు కూడా ఒంగోలు పార్లమెంట్‌తోపాటు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు భారీగానే దాఖలయ్యాయి.

చివరి రోజు అదుర్స్‌
చీమకుర్తిలో జనకెరటంలా సాగుతున్న ర్యాలీ (ఇన్‌సెట్‌లో) అభివాదం చేస్తున్న బీఎన్‌, టీడీపీ నాయకులు

బీఎన్‌, కందుల నామినేషన్లకు పోటెత్తిన జనం

చీమకుర్తి, మార్కాపురం పసుపుమయం

రెండుచోట్లా భారీ ర్యాలీలు

మండుటెండలోనూ ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు

ముగిసిన నామినేషన్‌ల దాఖలు

నేడు పరిశీలన

జిల్లాలోని చీమకుర్తి, మార్కాపురం పసుపుమయమయ్యాయి. టీడీపీ అభ్యర్థులు బీఎన్‌ విజయ్‌కుమార్‌, కందుల నారాయణరెడ్డి నామినేషన్‌ల సందర్భంగా రెండు పట్టణాలూ గురువారం జన జాతరలా మారాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలు అదుర్స్‌ అనిపించాయి. తెలుగు తమ్ముళ్లతోపాటు పార్టీ అభిమానులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. చీమకుర్తిలో బీఎన్‌కు, మార్కాపురంలో కందులకు అడుగడుగునా హారతులు ఇచ్చారు. వారిపై పూలవర్షం కురిపించారు. ఎండ, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ వేలాది మంది ర్యాలీల్లో ఉత్సాహంగా పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఒంగోలు, ఏప్రిల్‌ 24 (ఆంరఽధజ్యోతి) : సాధారణ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. చివరిరోజు కూడా ఒంగోలు పార్లమెంట్‌తోపాటు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు భారీగానే దాఖలయ్యాయి. ఇప్పటికే నామినేషన్లు వేసిన పలువురు మరికొన్ని సెట్లను చివరి రోజున తిరిగి సమర్పించారు. స్వతంత్రులు, చిన్నచిన్న పార్టీల అభ్యర్థులు పెద్దసంఖ్యలో వేశారు. శుక్రవారం అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్‌లను పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా నామినేషన్‌ల దాఖలు కార్యక్రమంలో ప్రత్యర్థి వైసీపీ కంటే పూర్తి అధిపత్యం ప్రదర్శించిన టీడీపీ అభ్యర్థులు చివరి రోజైన గురువారం కూడా అదే జోరు కొనసాగించారు. టీడీపీ సంతనూతలపాడు అభ్యర్థి బీఎన్‌విజయ్‌కుమార్‌, మార్కాపురం అభ్యర్థి కందుల నారాయణరెడ్డిల నామినేషన్‌ల సందర్భంగా చీమకుర్తి, మార్కాపురంలలో ఆపార్టీ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించాయి. రెండు పట్టణాలు పసుపుమయమయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లతోపాటు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ ర్యాలీల్లో పాల్గొని మద్దతు తెలిపారు.

సంతనూతలపాడులో జనకెరటం

సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీఎన్‌ విజయ్‌కుమార్‌ ఉదయం పలు దేవాలయాల్లో పూజలు చేశారు. అనంతరం ఒంగోలు మర్రిచెట్టు కాలనీలోని తన నివాసం నుంచి 10 గంటల సమయంలో చీమకుర్తికి బయల్దేరారు. అప్పటికే పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు అక్కడికి చేరుకొని ఆయన్ను అనుసరించారు. సంతనూతలపాడు నియోజకవర్గం ప్రారంభమయ్యే నగర పరిధిలోని సమతానగర్‌ వద్ద టీడీపీ, జనసేన యువకులు పెద్దఎత్తున స్వాగతం పలికి అక్కడి నుంచి వారు ముందు భాగాన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సంతనూతలపాడు సమీపంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీ క్రేన్‌లతో బీఎన్‌ విజయ్‌కుమార్‌, బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థి టి.కృష్ణప్రసాద్‌, జనసేన నేత కందుకూరి బాబులకు గజమాలలు వేశారు. సంతనూతలపాడు దాటాక మైనంపాడు కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఎన్‌ బృందం చీమకుర్తి హరిహరిక్షేత్రం వద్దకు చేరుకోగా వేలాది మంది పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించారు. ఉదయం 10 గంటలకే నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు అక్కడికి తరలివచ్చారు. పట్టణంలో దాదాపు రెండు గంటల పాటు ర్యాలీ సాగింది. మేళతాళాలు, కార్యకర్తల కేరింతలు, మహిళల నినాదాలతో చీమకుర్తి హోరెత్తిపోయింది. సుదూర ప్రాంత గ్రామాల నుంచి వచ్చిన వారు సైతం ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చీమకుర్తిలోని పలుచోట్ల గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.

మార్కాపురంలో మిన్నంటిన అభిమానం

మార్కాపురంలోనూ పెద్దఎత్తున టీడీపీ ర్యాలీ కొనసాగింది. అక్కడి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డి, ఇతర నేతలు ప్రత్యేక వాహనంపై కందుల ఇంటి నుంచి ర్యాలీగా బయల్దేరారు. సప్తగిరి లాడ్జి, పాత బస్టాండు, చెన్నకేశవస్వామి ఆలయం, కంభం బజారుల మీదుగా కంభం బస్టాండు వరకూ ప్రదర్శన నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతోపాటు మార్కాపురం పట్టణంలోని వివిధ వార్డుల నుంచి వేలాదిగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. కిలో మీటరు దూరం ర్యాలీ రావడానికి సుమారు రెండు గంటలు పట్టింది. ఆ రెండు పట్టణాల్లోనూ ఊహించిన దాని కన్నా అధికంగా శ్రేణులు తరలిరావడమే కాక, ఎండలో సైతం ఉత్సాహంగా పాల్గొనడంతో అభ్యర్థులు, పార్టీ నేతల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికే జిల్లాలో మిగిలిన ఐదు నియోజకవర్గాల్లోనూ ఇలాగే టీడీపీ అభ్యర్థులు చేపట్టిన ర్యాలీలు విజయవంతమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో జనసేన, బీజేపీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంపై టీడీపీ నేతల్లో మరింత జోష్‌ కనిపిస్తోంది.

భారీగా నామినేషన్లు

ఒంగోలు (కలెక్టరేట్‌) : సార్వత్రిక ఎన్నిక లకు సంబంధించి జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్‌తోపాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్త యింది. ఈనెల 18వతేదీ నుంచి 25వతేదీ వరకు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 212 మంది అభ్యర్థులు 354 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి 31 మంది అభ్యర్థులు 44 నామినేషన్లు సమర్పించారు. దర్శి నియోజకవర్గానికి 22 మంది అభ్యర్థులు 43, సంతనూతలపాడుకు 17 మంది అభ్యర్థులు 35, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి 27 మంది 39 నామినేషన్లు దాఖలు చేశారు. యర్రగొండపాలెంకు 23 మంది 43 నామినేషన్లు, గిద్దలూ రుకు 31 మంది 42, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి 36 మంది అభ్యర్థులు 61 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కొండపి నియోజకవర్గానికి 25 మంది అభ్యర్థుల 47 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

Updated Date - Apr 26 , 2024 | 12:02 AM