Share News

భూ హక్కు.. అంతా గిమ్మిక్కు...!

ABN , Publish Date - May 29 , 2024 | 11:27 PM

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భూహక్కు-భూరక్ష పథకం భూమి యజమానులకు గుదిబండలా మారింది. వారికి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. పనులు మానుకొని తహసీల్దార్‌ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడంతో భూముల రీ సర్వే అంతా తప్పుల తడకగా మారింది. విస్తీర్ణంలో తేడాలతో అనేక మంది రైతులు నష్టపోతున్నారు. పురుషుల హక్కుపత్రంలో మహిళల ఫొటోలు, మహిళల పత్రంలో పురుషుల ఫొటోలు ముద్రించి ఇచ్చారు. ఆధార్‌, ఫోన్‌ నంబర్లు అన్నీ తప్పుగానే నమోదు చేశారు. సమస్యలున్న వారు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకొనే నాథుడు కరువయ్యాడు. దీంతో రీసర్వే.. కాంట్రాక్టర్‌ల జేబులు నింపేందుకు తప్ప ప్రజలకు ఒనగూరిన ప్రయోజనం శూన్యమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భూ హక్కు.. అంతా గిమ్మిక్కు...!
కురిచేడు మండలంలో డ్రోన్‌ సర్వేను ప్రారంభిస్తున్న అధికారులు(ఫైల్‌)

లోపాలమయంగా రీసర్వే

రైతులకు కొత్త చిక్కులు

పూర్తయిన గ్రామాల్లో 80 శాతంపైన తప్పులే!

రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

సరిదిద్దేందుకు చొరవచూపని అధికారులు

కాంట్రాక్టర్‌ల జేబులు నింపేందుకేనన్న ఆరోపణలు

ఇతని పేరు గంటా లక్ష్మీనారాయణరెడ్డి. తర్లుపాడు మండలంలోని ఓబాయపల్లి గ్రామానికి చెందిన ఇతనికి జంగంరెడ్డిపల్లి రెవెన్యూ ఇలాకాలోని సర్వే నెంబర్‌ 103/1లో 2.25 ఎకరాల భూమి ఉంది. ఆరు నెలల క్రితం ఆ గ్రామంలో ప్రభుత్వం భూముల రీ సర్వే నిర్వహించి భూహక్కు పత్రాలు అందించింది. ఆ పత్రాలు చూసిన లక్ష్మీనారాయణరెడ్డి అవాక్కయ్యాడు. 2.25 ఎకరాలకుగాను 1.87 ఎకరాలు మాత్రమే నూతన పుస్తకంలో ఉంది. 38 సెంట్ల భూమి తగ్గింది. అదేకాక 93/3 సర్వే నెంబర్‌లో 1.17 ఎకరాల భూమి ఆయనకు ఉండగా 1.10 ఎకరాలు, ఆయన భార్య లక్ష్మీదేవి 104/1లో 1.15 ఎకరాలకుగాను మూడు సెంట్లు తగ్గింది. మొత్తంగా ఆ కుటుంబానికి రీసర్వే పుణ్యమా అని 48 సెంట్ల భూమికి హక్కు కోల్పోయినట్లైంది. తనకు భూమి తగ్గిందని సవరించాలని గత ఆరు నెలలుగా తర్లుపాడులోని తహసీల్దార్‌, మార్కాపురంలోని సబ్‌ కలెక్టర్‌, ఒంగోలులోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో జరిగిన స్పందన కార్యక్రమాల్లో అర్జీలు అందజేశారు. కానీ నేటికీ ఎలాంటి పరిష్కారం అధికారులు చూపలేదు.

ఇతని పేరు పిన్నిక శ్రీనివాసులు. మార్కాపురం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ఇతనికి 9/4, 9/5, 9/6 సర్వే నెంబర్లలో 2.10 ఎకరాల భూమి ఉంది. సర్వే యంత్రాంగం గ్రామంలో ఎవరికీ చెప్పకుండా ఆయన పొలానికి రాళ్లు పాతింది. శ్రీనివాసులు వెళ్లి పొలం వద్ద చూసి హతాసుడయ్యాడు. అతనికి సంబంధించిన పొలంకాకుండా పక్క పొలంలో రాళ్లు పాతి ఇదే నీ భూమి అని సర్వే అధికారులు చెప్పారు. తనకు అన్యాయం జరిగిందని మళ్లీ సర్వే చేయాలని కోరినా పట్టించుకున్న నాథుడేలేడు.

తర్లుపాడు మండలం కారుమానుపల్లికి చెందిన యేర్వ వెంకటసుబ్బారెడ్డికి రెండు ఎకరాల భూమి ఉంది. రీ సర్వేలో 1.85 ఎకరాలు ఉన్నట్లు భూహక్కు పత్రం ఇచ్చారు. విస్తీర్ణం తగ్గిందని అధికారులను అడిగినా పట్టించుకున్న వాళ్లులేరు. ఈక్రమంలో గత సంవత్సరం వ్యవసాయ రుణం కట్టేందుకు బ్యాంకుకు వెళ్లాడు. 1బీ అడంగల్‌ కావాలని అడిగారు. వాటికోసం మీ సేవకు వెళ్తే రీ సర్వే జరిగిన గ్రామాలకు సంబంధించి 1బీ అడంగల్‌లు రావడంలేదని తెలిపారు. వడ్డీ చెల్లించి రీ షెడ్యూల్‌ చేసుకోవాల్సిన ఆయన చేసేదేమీలేక బ్యాంకులో లోన్‌ మొత్తం కట్టేయాల్సి వచ్చింది. ఇలాంటి సమస్యలు రీ సర్వే జరిగిన గ్రామాల్లో కోకొల్లలు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భూహక్కు-భూరక్ష పథకం భూమి యజమానులకు గుదిబండలా మారింది. వారికి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. పనులు మానుకొని తహసీల్దార్‌ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడంతో భూముల రీ సర్వే అంతా తప్పుల తడకగా మారింది. విస్తీర్ణంలో తేడాలతో అనేక మంది రైతులు నష్టపోతున్నారు. పురుషుల హక్కుపత్రంలో మహిళల ఫొటోలు, మహిళల పత్రంలో పురుషుల ఫొటోలు ముద్రించి ఇచ్చారు. ఆధార్‌, ఫోన్‌ నంబర్లు అన్నీ తప్పుగానే నమోదు చేశారు. సమస్యలున్న వారు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకొనే నాథుడు కరువయ్యాడు. దీంతో రీసర్వే.. కాంట్రాక్టర్‌ల జేబులు నింపేందుకు తప్ప ప్రజలకు ఒనగూరిన ప్రయోజనం శూన్యమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మార్కాపురం మండలంలోని శివరాంపురంలో 2022లో రీ సర్వే పూర్తిచేసిన అధికారులు భూహక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు గ్రామ సభ నిర్వహించింది. అక్కడ హక్కు పత్రాలు చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా అధికారులపై తిరగబడ్డారు. వాటిల్లో అన్నీ తప్పులు ఉన్నాయి. దీంతో గ్రామస్థులంతా ఏకమై ఒక్కరు కూడా హక్కు పత్రాలు తీసుకోకుండా అధికారులను పంపించివేశారు. అసలు సమస్య ఎక్కడుంది, దాన్ని ఎలా సవరించాలి అనే ధ్యాసేలేకుండా అధికారులు ఇదే మండలంలో మళ్లీ నాలుగు గ్రామాల్లో రీ సర్వే పనులు ప్రారంభించారు. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తర్లుపాడు మండలం కారుమానుపల్లిలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ యజమానులు భూహక్కు పత్రాలు తీసుకుని అన్నీ మళ్లీ వెనక్కి ఇచ్చారు. దీన్ని పట్టించుకోకుండానే మండలంలో మరో ఐదు గ్రామాల్లో రీ సర్వే ప్రారంభించి ఇంకా కొనసాగిస్తున్నారు.

మార్కాపురం, మే 29: ‘వందేళ్ల తర్వాత దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భూముల రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. అందుకోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. డ్రోన్‌లతో భూముల రీసర్వే వలన సమస్యలు తొలగిపోతాయి’ అని ప్రభుత్వం ఊదరగొట్టింది. భూహక్కు-భూరక్ష కింద రైతుల ఇచ్చే పత్రాలలో కచ్ఛితమైన కొలతలు ఉంటాయని పేర్కొంది. కానీ క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కేవలం భూహక్కు పత్రాలపై సీఎం ఫొటో వేసుకోవడం కోసమే తప్ప ఒక్కశాతం కూడా ప్రజలకు మేలు చేకూర్చినట్లు కనిపించడం లేదు. సర్వే అధికారులు డ్రోన్‌ సాంకేతికతను ఉపయోగించారు. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. పేరుకు అత్యాధునిక టెక్నాలజీయే అయినా ఒక్క నంబర్‌ను కూడా సక్రమంగా సర్వే చేసింది లేదు. ప్రతి సర్వే నంబర్‌లో ప్రతి రైతుకు భూమి ఎక్కువగానో, లేదంటే తక్కువగానో చూపింది. సర్వే జరిగే సమయంలో రైతులకు అధికారులు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో తప్పులు చోటుచేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. అంతేకాక రైతులకు చెప్పకుండానే కొన్ని గ్రామాల్లో రాళ్లు కూడా పాతేశారు. అధికారులు ఇచ్చిన భూహక్కు పత్రాల్లో విస్తీర్ణంలో తేడాలతోపాటు ఫొటోలు కూడా మారిపోయాయి. ఆధార్‌ నెంబర్‌లు, ఫోన్‌ నెంబర్లు.. అన్నీ తప్పుగానే నమోదు చేశారు. ఇలా అనేక లోపాలతో సర్వే చేసి మమ అనిపించేశారు. సమస్యలున్న వారు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకొనే నాథుడు కరువయ్యాడు. రికార్డులను సవరించేందుకు తమకు సాఫ్ట్‌వేర్‌ ఇంకా అప్‌డేట్‌ చేయలేదని చెప్పి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.

కాంట్రాక్టర్‌ల జేబులు నింపేందుకే..

2020 డిసెంబర్‌లో ప్రారంభించిన రీసర్వే పనులు 2023 డిసెంబర్‌ కల్లా పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఇప్పటివరకూ 35 శాతం గ్రామాల్లో మాత్రమే రీసర్వే పూర్తయ్యింది. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. అత్యాధునిక టెక్నాలజీ అంటూ డ్రోన్‌లు, హద్దురాళ్లు ఏర్పాటు చేసే కాంట్రాక్టర్‌ల జేబులు నింపేందుకే తప్ప ప్రజలకు ఒనగూరిన ప్రయోజనం శూన్యమే. పైపెచ్చు భూ యజమానులకు నూతన చిక్కులు తెచ్చిపెట్టింది.

హడావుడి పనులతో చిక్కులు

భూముల రీ సర్వే కార్యక్రమం మంచిదే అయినా.. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఒత్తిళ్ల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అన్నీ తప్పులే చోటుచేసుకున్నాయి. ప్రధానంగా డ్రోన్‌లతో సర్వే చేసినా తేడాలున్న చోట మాన్యువల్‌గా కొలతలు వేసిఉంటే కొంతమేర ఇబ్బందులు తప్పేవి. మరీ ముఖ్యంగా భూయజమాలకు సంబంధం లేకుండా సర్వే అధికారులే పొలాలకు వెళ్లి ఇష్టారీతిన కొలతలు తీసుకున్నారు. కొందరు సర్వేయర్‌లు కార్యాలయాలకే పరిమితమై డ్రోన్‌ సిబ్బందితో పనిచేయించి మమ అనిపించారు. పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్న గ్రామాల్లో నేటికీ గ్రామకంఠం భూములు, స్థలాలను సర్వే చేయలేదు. కేవలం వ్యవసాయ పొలాలను మాత్రమే తప్పుల తడకగా సర్వే చేశారు.

సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండానే..

రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని తొలుత ప్రతి మండలంలో ఒక చిన్న గ్రామాన్ని ఎంచుకుని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించారు. వాస్తవానికి పైలట్‌ ప్రాజెక్టులో తీసుకున్న గ్రామాల్లో జరిగిన తప్పులను సవరించుకుని ముందుకు వెళ్లి ఉంటే మిగిలిన చోట్ల పొరపాట్లు చోటుచేసుకుని ఉండేవి కావు. కానీ సర్వే యంత్రాంగం ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో రిపోర్ట్‌లు పంపేందుకే ప్రాధాన్యం ఇచ్చి క్షేత్రస్థాయి పరిశీలనను గాలికొదిలేసింది.

జిల్లా వ్యాప్తంగా రీ సర్వే ఇలా..

రెవెన్యూ డివిజన్‌ రెవెన్యూ గ్రామాలు రీ సర్వే పూర్తయినవి

ఒంగోలు 220 114

కనిగిరి 383 126

మార్కాపురం 219 58

మొత్తం 822 298

Updated Date - May 29 , 2024 | 11:27 PM