Share News

భూమాయ

ABN , Publish Date - Dec 08 , 2024 | 11:44 PM

వివాదంలో ఉన్న భూమిపై ఓ నాయకుడు కన్నేశాడు. లొసుగులను ఆసరా చేసుకొని ఆక్రమించేందుకు ఉపక్రమించాడు. రెవెన్యూ అధికారుల అండతో దాన్ని సొంతం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. పామూరు మండలం తూర్పుకట్టకిందపల్లి గ్రామ పంచాయతీ పరిధి కరోళ్లపాడు రెవెన్యూలోని సర్వే నంబర్‌ 34లో 30.26 ఎకరాల పట్టా భూమి గ్రామానికి చెందిన యర్రంశెట్టి పెదకొండయ్య, యర్రంశెట్టి కొండయ్య కుటుంబాలకు ఉంది. యర్రంశెట్టి కుటుంబ వివాదాలతో 50ఏళ్లుగా ఈ భూమి సాగులో లేదు.

భూమాయ
చిల్లచెట్లతో నిండిఉన్న భూమి (ఇన్‌సెట్లో) సర్వేనెంబర్‌ 34లో సాగులో లేని భూమి

సివిల్‌ కోర్టుదే తుది నిర్ణయమని

తేల్చిచెప్పిన రెవెన్యూ ఉన్నతాధికారులు

అడంగల్‌లో పేర్లు లేకుండానే

ఆన్‌లైన్‌ చేసేందుకు ప్రయత్నం

పామూరు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : వివాదంలో ఉన్న భూమిపై ఓ నాయకుడు కన్నేశాడు. లొసుగులను ఆసరా చేసుకొని ఆక్రమించేందుకు ఉపక్రమించాడు. రెవెన్యూ అధికారుల అండతో దాన్ని సొంతం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. పామూరు మండలం తూర్పుకట్టకిందపల్లి గ్రామ పంచాయతీ పరిధి కరోళ్లపాడు రెవెన్యూలోని సర్వే నంబర్‌ 34లో 30.26 ఎకరాల పట్టా భూమి గ్రామానికి చెందిన యర్రంశెట్టి పెదకొండయ్య, యర్రంశెట్టి కొండయ్య కుటుంబాలకు ఉంది. యర్రంశెట్టి కుటుంబ వివాదాలతో 50ఏళ్లుగా ఈ భూమి సాగులో లేదు. 1950 నుంచి నెల్లూరు కోర్టులో, 1986 నుంచి కనిగిరి కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ భూమిపై పంచాయతీకి చెందిన నాయకుడి కన్నుపడింది. రెవెన్యూ అధికారులను మభ్యపెట్టి తన అనుయాయుల పేర్లను వన్‌బీ ఖాతాలో ఎక్కించుకొన్నాడు. ఇప్పుడు ఆన్‌లైన్‌ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

వన్‌బీ అంతా మార్చేచారు

పంచాయతీకి చెందిన నాయకుడు 2014లో అప్పటి రెవెన్యూ అధికారులను లోబర్చుకొని తన అనుయాయులైన యర్రంశెట్టి అంకయ్య పేరుపై ఖాతా నెంబర్‌ 278లో 7.56 ఎకరాలు, మాల్యాద్రి పేరుపై ఖాతా నెంబర్‌ 279లో 7.56 ఎకరాలు, మాలకొండయ్య పేరుపై ఖాతా నెంబర్‌ 280లో 7.56 ఎకరాల వంతున వన్‌ ఏ, అడంగల్‌లో పేర్లు లేకుండా, ఆర్‌సీ నంబర్‌ లేకుండానే ఖాతానంబర్‌ సృష్టించి వన్‌బీలో పేర్లు నమోదు చేయించుకున్నారు. సర్వే నంబర్‌ 34లో మొత్తం భూమి 30.26 ఎకరాలు ఉండగా, వన్‌ బీ ఖాతాలో 40.26 ఎకరాల విస్తీర్ణంగా చూపిస్తూ రెవెన్యూ అధికారులు పేర్లు ఎక్కించడం వివాదాస్పదమైంది.

కోర్టు తీర్పు ఇచ్చినా..

విషయం తెలుసుకొన్న యర్రంశెట్టి కొండయ్య వారసులైన వెంకటేశ్వర్లు, పూర్ణయ్య, పెద వెంగమ్మ, రమేష్‌లు కనిగిరి కోర్టును ఆశ్రయించారు. 2018లో రిట్‌ పిటిషన్‌ నంబర్‌ డబ్య్లూపీ 28872 జస్టిస్‌ పి.ప్రవీణ్‌కుమార్‌ ఇచ్చిన తీర్పులో పట్టాదారు పాసుపుస్తకం చట్టం 1971 ప్రకారం సివిల్‌ కోర్టు వివాదాల్లో ఉన్న భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకూడదని తీర్పు ఇచ్చారు. అయితే తుది నిర్ణయం సివిల్‌ కోర్టుదేనని 2019లో జేసీ ఎం.శ్రీనివాసులు, కందుకూరు ఆర్డీవో కేఎస్‌ రామారావు కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ గ్రామానికి చెందిన ఆ నాయకుడు 22.50 ఎకరాలు తన అనుయాయుల పేర్లపై ఆన్‌లైన్‌ ఎక్కించుకునేందుకు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇప్పటికైనా జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులు భూ రికార్డులను పరిశీలించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి

యర్రంశెట్టి పూర్ణయ్య, కరోళ్లపాడు

కరోళ్లపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 34లో ఉన్న 30.26 ఎకరాల భూమి మా పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చింది. అడంగల్‌లో మా పేర్లు నమోదై ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ నాయకుడి రెవెన్యూ అధికారులను మభ్యపెట్టి వన్‌ ఏలో పేర్లు లేకుండానే వన్‌బీలో ఆర్సీ నంబర్‌ లేకుండానే ముగ్గురు వ్యక్తుల పేర్లపై 22.50 ఎకరాలు నమోదు చేయించారు. తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి.

కోర్టు వివాదంలో ఉన్న భూమిని రక్షించాలి

రమేష్‌, కరోళ్లపాడు

సర్వే నెంబర్‌ 34లోని 30.26 ఎకరాల భూమికి సంబంధించి 50 ఏళ్లుగా కనిగిరి సివిల్‌ కోర్టులో వివాదం నడుస్తోంది. కోర్టు వివాదాల్లో రెవెన్యూ శాఖ జోక్యం చేసుకోకూడదని తుది నిర్ణయం సివిల్‌ న్యాయస్థానానిదేనని జేసీ, ఆర్డీవో కోర్టు గతంలో తీర్పు ఇచ్చాయి. గ్రామానికి చెందిన నాయకుడు రెవెన్యూ అధికారులపై ఒత్త్తిడి తెచ్చి ఎక్కువ విస్తీర్ణం చూపించి రికార్డులను తారుమారు చేస్తున్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న వ్యక్తిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి.

Updated Date - Dec 08 , 2024 | 11:44 PM