Share News

కుంట భూమిపై కన్ను

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:41 PM

వైసీపీ నేతలు భూబకాసురులుగా మారారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూములతోపాటు వాగులు, వంకలు ఆక్రమించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా దర్శి-పొదిలి రోడ్డులోని కోట్లాది రూపాయల విలువచేసే కుంట పోరంబోకు భూమిపై ఓ నాయకుడు కన్నేశాడు. దాన్ని కబ్జా చేసేందుకు కుంట కట్టను సైతం తొలగించాడు. అడ్డుకున్న ఎస్టీలపై అనుచరులతో కలిసి దాడికి తెగబడ్డాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మిన్నకుండటం విమర్శలకు తావిస్తోంది.

కుంట భూమిపై కన్ను
కుంట పోరంబోకు భూమిలో కుంట కట్టను తెగకొట్టిన దృశ్యం

కట్ట తొలగించి ఆక్రమణకు వైసీపీ నేత యత్నం

అడ్డుకున్న ఎస్టీలపై అనుచరులతో కలిసి దాడి

చోద్యంచేస్తున్న రెవెన్యూ అధికారులు

దర్శి, జూన్‌ 2 : వైసీపీ నేతలు భూబకాసురులుగా మారారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూములతోపాటు వాగులు, వంకలు ఆక్రమించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా దర్శి-పొదిలి రోడ్డులోని కోట్లాది రూపాయల విలువచేసే కుంట పోరంబోకు భూమిపై ఓ నాయకుడు కన్నేశాడు. దాన్ని కబ్జా చేసేందుకు కుంట కట్టను సైతం తొలగించాడు. అడ్డుకున్న ఎస్టీలపై అనుచరులతో కలిసి దాడికి తెగబడ్డాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మిన్నకుండటం విమర్శలకు తావిస్తోంది.

రూ.కోట్ల విలువైన భూమి ఆక్రమణకు యత్నం

దర్శి రెవెన్యూలోని 1071 సర్వేనెంబర్‌లో 6.50 ఎకరాలు కుంట పోరంబోకు భూమి ఉంది. బ్రిటీష్‌ కాలం నుంచి అక్కడ కుంట ఉంది. ఆ ప్రాంత పొలాల రైతులు సాగునీటి అవసపరాల కోసం దాన్ని ఏర్పాటు చేశారు. పొలాల దున్నకాల సమయాల్లో రైతులు అక్కడ సేద తీర్చుకునేవారు. సాగర్‌ కాలువ వచ్చిన తర్వాత కుంట అవసరాలు తగ్గిపోయాయి. ఆప్రాంతమంతా మాగాణి అయింది. ఆ భూములకు విలువ పెరగడంతో కొంతమంది రైతులు కొంతమేర కుంట భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. మరో రెండు ఎకరాలు మిగిలి ఉండగా అందులో కొంత భూమిని రాజంపల్లికి చెందిన ఎస్టీలు సాగుచేసుకుంటున్నారు. మిగిలిన దానిలో కుంట ఉంది. ఆ కుంట భూమి దర్శి-పొదిలి ప్రధాన రహదారి ఆనుకొని ఉండటంతో ప్రస్తుతం ఎకరం రూ.కోటి పలుకుతోంది. దీంతో వైసీపీ నాయకుడి కన్ను ఆ కుంటపై పడింది. ఏడాదిగా ఆ కుంట భూమిని ఆక్రమించుకునేందుకు పలుసార్లు ప్రయత్నించారు. రాజంపల్లి గ్రామస్థులు అడ్డుపడటంతో ఆక్రమణలకు బ్రేకులు పడుతూ వచ్చింది. గతంలో రెవెన్యూ అధికారులు ఆ భూమిలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

రెచ్చిపోతున్న వైసీపీ నాయకుడు

అధికారులు హెచ్చరిక బోర్డులను కూడా లెక్కచేయకుండా వైసీపీ నాయకుడు రెచ్చిపోతున్నాడు. దర్శి ఎంపీపీ భర్త జి.అచ్చయ్య ఆ భూమిపై తమకు హక్కు ఉందని కొంతకాలంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ భూమిని సాగు చేసుకుంటున్న రాజంపల్లి గ్రామానికి చెందిన ఎస్టీలు పలుదఫాలు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారుల వద్ద కూడా ఈవిషయమై చర్చ జరిగింది. ప్రభుత్వభూమి ఆక్రమణకు గురికాకుండా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారు. దీంతో దర్శి ఎంపీపీ భర్త అచ్చయ్య తన అనుచరులతో గురువారం రాత్రి కుంట పోరంబోకు భూమి ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు. అందులోభాగంగా కుంట కట్టను కొంతమేర తొలగించారు. ఆ భూమిని సాగు చేసుకుంటున్న ఎస్టీలు ఆక్రమణను అడ్డుకున్నారు. దీంతో అచ్చయ్య తన వర్గీయులతో ఎస్టీలపై దాడిచేశారు. వైసీపీ నాయకుల దాడిలో ఎస్టీ వర్గానికి చెందిన వీరాంజనేయులు, రవికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇంతజరిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇక్కడ జరుగుతున్న అక్రమాలను గుర్తించి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 11:41 PM