Share News

శోకసంద్రంలో కొత్తపల్లి

ABN , Publish Date - Sep 02 , 2024 | 01:32 AM

మండలంలోని కొత్తపల్లి గ్రామం ముగ్గురు చిన్నారుల మృతితో శోకసంద్రంలో మునిగిపోయింది.

శోకసంద్రంలో కొత్తపల్లి

పెద్దారవీడు, సెప్టెంబరు 1 : మండలంలోని కొత్తపల్లి గ్రామం ముగ్గురు చిన్నారుల మృతితో శోకసంద్రంలో మునిగిపోయింది. ఈత కోసం కుంటలో దిగి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. దీంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి కులవృత్తి అయిన వడ్రింగి పని చేసుకుంటున్న కొత్తపల్లి విశ్వ రూపాచారి, భానుచారీల కుమారులు మను, శివ, ఆరవీటి శ్రీను కుమారుడు ఏడుకొండలు ఈత కోసం కుంటలో దిగి మృతిచెందారు. రోజూ చలాకీగా బడికి పోతూ, వస్తూ అందరి మధ్యలో తిరిగే చిన్నారుల మృతితో కొత్తపల్లి గ్రామంలో కన్నీరు పెట్టని వారు లేరు. ఇటువంటి విషాద ఘటన మునుపెన్నడూ తమ ఊరిలో జరగలేదం టూ నాటితరం వారి నుంచి నేటితరం వారు పేర్కొంటున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు, ఇన్‌చార్జ్‌ సబ్‌కలెక్టర్‌ వెంకట సునీల్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి భాగ్యవతి, డిప్యూటీ తహసీల్దార్‌ రాజేష్‌, ఎంపీడీవో రాజ్‌కుమార్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ముగ్గురు చిన్నారుల మృతదేహాల వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ మృతుల కుటుంబా లకు అండా ఉంటానన్నారు. పరిస్థితిని సీఎం చంద్రబాబునాయుడికి వివరించి ఆయా కుటుంబాలను ఆదుకుంటానని తెలిపారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి, మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసులరెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 01:32 AM