Share News

జగన్‌ రోడ్డుషో అట్టర్‌ ప్లాప్‌..!

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:17 PM

కనిగిరిలో జగన్‌ రోడ్డు షో అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. రోడ్ల వెంట జనం లేక వెలవెలబోయింది. జగన్‌ బస్సు యాత్ర ఆదివారం ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి, కనిగిరి మండలాల్లోకి ప్రవేశించారు. ఈ షో సక్సస్‌ కోసం వైసీపీ నేతలు, అధికారులు పడిన తాపత్రయం ఏ మాత్రం ఫలించలేదు.

జగన్‌ రోడ్డుషో అట్టర్‌ ప్లాప్‌..!
జగన్‌ వస్తున్న సమయంలో నిర్మానుషంగా ఉన్న కనిగిరి - కందుకూరు రోడ్డు

కనిగిరిలో కనిపించని జోష్‌

ఉదయం 6 నుంచి

సాయంత్రం 6 వరకు కరెంట్‌ కట్‌

ఆసుపత్రికి సరఫరా లేక అల్లాడిన రోగులు

అవస్థలు పడిన ప్రజలు, వ్యాపారులు

కనిగిరి, ఏప్రిల్‌ 7 : కనిగిరిలో జగన్‌ రోడ్డు షో అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. రోడ్ల వెంట జనం లేక వెలవెలబోయింది. జగన్‌ బస్సు యాత్ర ఆదివారం ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి, కనిగిరి మండలాల్లోకి ప్రవేశించారు. ఈ షో సక్సస్‌ కోసం వైసీపీ నేతలు, అధికారులు పడిన తాపత్రయం ఏ మాత్రం ఫలించలేదు. ఉదయం 11గంటలకే కనిగిరి పట్టణ సమీపంలోని చింతలపాలెం వద్దకు జగన్‌ చేరుకుంటారని ప్రచారం చేసినా జనం పెద్దగా రాలేదు. దీంతో వైసీపీ అభ్యర్థి తలలు పట్టుకుని డబ్బులు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా ప్రజాస్పందన కరువైందని ప్రజలే చెప్తున్నారు. జిల్లా పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ వైంఎం ప్రసాద్‌రెడ్డి అప్పటికప్పుడు జెండాలను రెడీ చేశారు. పామూరు బస్టాండ్‌ సెంటరుకు 12 గంటలకు రావాల్సిన జగన్‌ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. అప్పటికి వచ్చిన జనం ఎండలను తట్టుకోలేక వెళ్లిపోయారు. జగన్‌ బస్సు కనిగిరి బస్టాండు సెంటరుకు చేరుకున్న సమయంలో కూడా పెద్దగా జనం కనిపించలేదు.

10 నిమిషాల జగన్‌ షో

జగన్‌ రోడ్డు షో కనిగిరిలో ఫెయిల్‌ అయింది. ప్రజ లు చర్చించుకుంటున్నారు. పట్టుపని 1000 మంది కన్పించకపోవడంతో నేతల వద్ద జగన్‌ అసహనం కనపరిచారని తెలిసింది. మధ్యాహ్నం 12గంటలకు రావాల్సిన బస్సు యాత్ర 2గంటలకు చేరుకుంది. వచ్చిన కొద్డి సెకన్లకు జగన్‌ బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం, నమస్కారం చేశారు. ఆ సమయంలో చుట్టూ చూసిన జగన్‌కు జనం లేరన్న సంగతి తెలుసుకొని 10 నిమిషాలకు బస్సులోకి వెళ్లిపోయారు. బస్సు అక్క డ ఉండగానే జనం వెనుదిరిగి వెళ్లడం జగన్‌ చూ శా రు. కనీసం పూలదండలు కూడా జగన్‌ వేయించుకోకుండా వెళ్లిపోయారు. ఆయనవెంట ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలినేని, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబూరావు, బుర్రా, అభ్యర్థి దద్దాల నా రాయణయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌ ఉన్నారు.

బస్సులను ఏర్పాటు చేసినా జనం పల్చనే..!

పీసీపల్లి : ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన బస్సుయాత్రకు జన స్పందన అంతంతమాత్రంగానే కనిపించిం ది. ఆదివారం పొన్నలూరు మండలం జువ్వికుంట విడిది క్యాంపు నుంచి బయలుదేరిన జగన్‌ అగ్రహారం మీదుగా పీసీపల్లి మండలం పాలేటిగంగ వద్దకు ఉదయం 11.15గంటలకు చేరుకున్నారు. అక్కడ జనం పల్చగా కనిపించారు. పోలీసులు, రోప్‌ పార్టీ సిబ్బంది ఆయన భద్రతా సిబ్బంది, వారి వాహనాలు, ఇతర సిబ్బందే ఎక్కువగా కనిపించారు. జగన్‌ వచ్చే సమయానికి జనం లేకపోవడంతో పీసీపల్లి మండలం నుంచి సిద్ధం సభకు బయలుదేరిన బస్సులను రూట్‌ మళ్లించి గంగ వద్దకు తీసుకువచ్చారు. బస్సులో వచ్చిన జనం కూడా సగం మంది బస్సులోనే ఉండగా, సగం మంది రోడ్డుపైకి వచ్చారు. అక్కడ నుంచి బయలుదేరిన జగన్‌ బస్సు పెదఅలవలపాడు, రామాపురం, బండపాలెం మీదుగా కనిగిరి మండలం ఆజీ్‌సపురంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి కనిగిరి వెళ్లింది. పెదఅలవలపాడు, రామాపురంలో మహిళలు నిల్చొని ఉన్న చోట బస్సు దిగిన జగన్‌ వారి తలలపై చేయి ఉంచి నవ్వుతూ తిరిగి బస్సులోకి వెళ్లిపోయారు. రా మాపురం గ్రామానికి చెందిన కుడుముల జాన్‌ అనే వృద్ధుడు తనకు పక్షవాతం వచ్చిందని మందులకు నెలకు రూ.10వేలు ఖర్చు అవుతుందని, ఆసుపత్రిలో మందులు ఇప్పించాలని జగన్‌ను కోరారు. అదే గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య అనే వృద్ధుడు ఇంటిస్థలం కోసం రెండుసార్లు దరఖాస్తు చేసినా స్థానిక నాయకుల మాటలు విని అధికారులు ఇంటిస్థలం కేటాయించకుండా తన దరఖాస్తును తిరస్కరించారని జగన్‌కు ఫిర్యాదు చేశారు. బస్సుయాత్రలో కనిగిరి మాజీ ఎమ్మెల్యేలు బుర్రా, కదిరి, అభ్యర్థి దద్దాల, ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి చెవిరెడ్డి, మాజీ మంత్రి బాలినేని ఉన్నారు.

జగన్‌ వస్తున్నారని విద్యుత్‌ కట్‌

ఎండలు.. కరెంట్‌ కోతతో అల్లాడిన జనం

ముఖ్యమంత్రి జగన్‌ బస్సుయాత్ర ఆదివారం మండలంలోని పెదఅలవలపాడు నుంచి రామాపురం మీదుగా కనిగిరి వెళ్లింది. అయితే సీఎం బస్సుయాత్ర సందర్భంగా విద్యుత్‌ శాఖ సిబ్బంది వ్యవహరించిన తీరు ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. పెదఅలవలపాడు పెట్రోలు బంక్‌ నుంచి ఊరి చివర పాఠశాల వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్‌ స్తంభాలపై ఉన్న సర్వీస్‌ వైర్లను సిబ్బంది తొలగించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామంలో రోడ్డు కిరువైపులా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అసలే ఎండలతో అల్లాడుతున్న ప్రజలు కరెంట్‌ లేకపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మరోవైపు పెట్రోలు బంకుకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెట్రోల్‌, డీజిల్‌ కోసం వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ఇంతలో బంకు యజమాని అప్పటికప్పుడు జనరేటర్‌ను ఏర్పాటుచేసి వాహనాలకు ఆయిల్‌ నింపారు. జగన్‌ బస్సు అలవలపాడు దాటి వెళ్లిపోయిన తరువాత విద్యుత్‌ సిబ్బంది విద్యుత్‌ను పునరుద్ధరించారు.

Updated Date - Apr 07 , 2024 | 11:17 PM