Share News

జగన్‌ సరికొత్త నాటకం

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:26 PM

ప్రజలు, పార్టీ శ్రేణుల్లో నాయకుల పలుకుబడిని పలుచన చేయడం.. ఆపై ఏఇద్దరు నాయకులు సఖ్యతతో ముందుకు సాగకుండా విడదీయడం.. ఇదీ వైసీపీ అధిష్ఠానం తాజాగా ఆడుతున్న నాటకం. దీనికి సూత్రధారి, తెరవెనుక పాత్రధారి కూడా ఆపార్టీ అధినేత సీఎం జగన్‌ అంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి జిల్లా వైసీపీలో నెలకొన్న తాజా పరిణామాలు, అంతర్లీనంగా జరుగుతున్న వ్యవహారాలే అందుకు నిదర్శనం. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలకు క్రమేపీ పార్టీ, పాలనా వ్యవహారాల్లో ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చిన సీఎం జగన్‌ తాజాగా వారిద్దరినీ విభజించి పాలించే సూత్రానికి శ్రీకారం పలికారు. కొన్ని నియోజకవర్గాలలో ఇటు సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు చెక్‌పెట్టేవిధంగా చర్యలు చేపడుతూనే మరోవైపు వారిని సముదాయించే వ్యవహారాలను సాగిస్తున్నారు. అందుకు కందుకూరు, గిద్దలూరు, మార్కాపురం, అద్దంకి, దర్శి నియోజకవర్గాలలో చోటుచేసుకున్న పరిణామాలను నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నాటకాల పరిణామాలను అర్థం చేసుకుంటున్న ఆపార్టీలోని సీనియర్‌ నేతలు ప్రతివ్యూహాలకు శ్రీకారం పలికారు. దీంతో ఈనెల 20వ తేదీ తర్వాత క్రమేపీ వైసీపీలో అనేక సరికొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది

జగన్‌ సరికొత్త నాటకం

నాయకులకు ప్రాధాన్యం తగ్గించటం, విడదీయటమే లక్ష్యం

ముందు బాలినేని, మాగుంటలను దూరంగా ఉంచారు

ఇప్పుడు ఇద్దరి మధ్య సఖ్యత బ్రేక్‌కు యత్నం

కందుకూరు విషయంలోనూ అదేడ్రామా

మార్కాపురంలోనూ కొనసాగుతున్న తంతు

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

ప్రజలు, పార్టీ శ్రేణుల్లో నాయకుల పలుకుబడిని పలుచన చేయడం.. ఆపై ఏఇద్దరు నాయకులు సఖ్యతతో ముందుకు సాగకుండా విడదీయడం.. ఇదీ వైసీపీ అధిష్ఠానం తాజాగా ఆడుతున్న నాటకం. దీనికి సూత్రధారి, తెరవెనుక పాత్రధారి కూడా ఆపార్టీ అధినేత సీఎం జగన్‌ అంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి జిల్లా వైసీపీలో నెలకొన్న తాజా పరిణామాలు, అంతర్లీనంగా జరుగుతున్న వ్యవహారాలే అందుకు నిదర్శనం. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలకు క్రమేపీ పార్టీ, పాలనా వ్యవహారాల్లో ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చిన సీఎం జగన్‌ తాజాగా వారిద్దరినీ విభజించి పాలించే సూత్రానికి శ్రీకారం పలికారు. కొన్ని నియోజకవర్గాలలో ఇటు సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు చెక్‌పెట్టేవిధంగా చర్యలు చేపడుతూనే మరోవైపు వారిని సముదాయించే వ్యవహారాలను సాగిస్తున్నారు. అందుకు కందుకూరు, గిద్దలూరు, మార్కాపురం, అద్దంకి, దర్శి నియోజకవర్గాలలో చోటుచేసుకున్న పరిణామాలను నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నాటకాల పరిణామాలను అర్థం చేసుకుంటున్న ఆపార్టీలోని సీనియర్‌ నేతలు ప్రతివ్యూహాలకు శ్రీకారం పలికారు. దీంతో ఈనెల 20వ తేదీ తర్వాత క్రమేపీ వైసీపీలో అనేక సరికొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

రెండేళ్లుగా బాలినేనికి తగ్గిన ప్రాధాన్యం

వైసీపీ అధిష్ఠానం జిల్లాలో బాలినేని, మాగుంటల మధ్య సఖ్యతను దెబ్బతీసి చివరికి ఇద్దరికీ మొండిచేయి చూపించే దిశగా అడుగులు వేస్తోంది. మరీ అననుకూల పరిస్థితుల్లో బాలినేనిని దగ్గర చేర్చుకుని మాగుంటకు చెక్‌పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. రెండేళ్ల నుంచి బాలినేనికి పార్టీ, పాలనా వ్యవహారాల్లో ప్రాధాన్యత తగ్గిస్తూ జగన్‌ అనేక చర్యలు తీసుకున్న విషయం విదితమే. తొలుత ఆయన సమీపబంధువు వ్యాపారానికి చెక్‌పెట్టారు. చివరికి మంత్రి పదవి నుంచి తప్పించడమేగాక పార్టీ పదవుల్లో నుంచి తప్పుకునేలా చేశారు. బాలినేని విజయవాడ వచ్చి మూడురోజుల పాటు జగన్‌ ఇంటర్వ్యూ కోసం వేచి ఉండి వెనక్కు వెళ్లడం తెలిసిందే.

ఎన్నికైన కొద్దికాలం నుంచే మాగుంటను దూరం

మరోవైపు ఎంపీ మాగుంటను ఎన్నికైన కొద్దికాలం నుంచే జగన్‌ దూరం పెట్టారు. విధిలేని పరిస్థితుల్లో సింగరాయకొండ వద్ద ఉన్న ఆయన ఫ్యాక్టరీని చాలాకాలం మాగుంట మూసివేయడం కూడా జరిగింది. లిక్కర్‌ వ్యాపారంలో ఆయన కంపెనీ ఉత్పత్తులు రాష్ట్రంలో కనిపించలేదు. ఇవన్నీ అటుంచితే కేంద్రప్రభుత్వం నుంచి ఆయన ఒంగోలు లోక్‌సభ పరిధిలో ఏదైనా అభివృద్ధి పనులకు నిధులు తీసుకొస్తే రాష్ట్రప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాన్ని ఇవ్వలేదు. వాటా నిధులు చెల్లించకుండా మోకాలడ్డారు. ఆయన సీఎంను కలిసింది కూడా చాలా తక్కువసార్లు. ఇక ప్రస్తుతం మాగుంటకు కొన్ని షరతులు పెట్టడం, ఆయన తిరస్కరించడం చివరికి ఆయన్ను తన గడప తొక్కనివ్వొద్దంటూ కూడా విజయసాయిరెడ్డికి సూచించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలినేని, మాగుంటలు ఒకటిగా అధిష్ఠానానికి సంకేతమిచ్చారు. బాలినేని అయితే ఎంపీ అభ్యర్థిగా మాగుంట, అసెంబ్లీ అభ్యర్థిగా తాను ఉండాలని కోరుకుంటున్నామని అదే జరగబోతుందని ప్రకటించారు.

మాగుంటకు వేమిరెడ్డి ఫోన్‌లు

మాగుంట, ఆయన కుమారుడుకి ఒంగోలు, నెల్లూరు రెండు పార్లమెంటు స్థానాల నుంచి పోటీచేసే అవకాశం ఇస్తామని టీడీపీ ప్రతిపాదన చేసినట్లు ప్రచారంలో ఉంది. ఈ విషయం జగన్‌ దృష్టిలోనూ ఉంది. అంతకుముందే జగన్‌ మాగుంటను పక్కనపెట్టారు. అలాంటిది రెండురోజుల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాగుంటకు ఫోన్లుచేసి మీరు ప్రెస్‌మీట్‌ పెట్టాల్సిన పనిలేదు. డిపాజిట్‌ కట్టాల్సిన అవసరం లేదు. నేను జగన్‌తో మాట్లాడతానని ప్రతిపాదించడం విశేషం. ఇక వేమిరెడ్డి నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న సమయంలో ఇంతకాలం పూర్తిగా జగన్‌ పక్కనపెట్టిన మాగుంటతో నేనున్నాను రా అంటూ మాట్లాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకేమాటగా కలిసి ఉన్న బాలినేని మాగుంటను విడదీసి చివరికి వారిని ఎటూ కాకుండా చేయడం లేదా బాలినేనిని వినియోగించుకుని మాగుంటకు చెక్‌పెట్టడం లక్ష్యంగానే పనిచేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోనని ప్రకటించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎంపీ మాగుంటకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. నిజానికి గిద్దలూరు నియోజకవర్గంలో రాంబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన రెడ్డి సామాజికవర్గం నాయకుల్లో ఎక్కువమంది బాలినేని అనుచరులు. ఆయన బాలినేనిని ఒక్కమాట కూడా అనకుండా మాగుంటపై విరుచుకుపడటం అధిష్టానం కుట్రలో భాగమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రాంబాబును పిలిపించుకుని జగన్‌ మాట్లాడటం ఆ తర్వాత ఆయన నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంభించటం గమనార్హం.

కందుకూరు విషయంలోనూ అంతే

కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి కూడా సీఎం షరతులు విధించారు. ఆయన కూడా కుదరదన్నారు. దీంతో బొట్ల రామారావు అనే బీసీ నాయకుడిని పిలిపించుకుని.. వెళ్లి కందుకూరులో పనిచేయాలని జగన్‌ ప్రోత్సహించి పంపారు. అదేరోజు రాత్రి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరులో మహీధరరెడ్డితో భేటీ అయ్యారు. మరుదినమే మహీధర్‌రెడ్డికి కూడా తెలియకుండా ఐప్యాక్‌ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన్ను మాట్లాడమన్నారు. తన గౌరవం తగ్గకుండా మహీధరరెడ్డి మాట్లాడినప్పటికీ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించే వ్యవహారాన్ని జగన్‌ మానుగుంటని దారిలోకి తెచ్చుకునేందుకేనని, అందుకే వేమిరెడ్డిని రంగంలోకి దింపారని భావిస్తున్నారు.

మార్కాపురం, కనిగిరిల్లో..

మార్కాపురం నియోజకవర్గంలోనూ ఇటు ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అటు మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిలను ఒకేరోజు సీఎంవోకు పిలిపించారు. జంకెను మధ్యలోనే వెనక్కు పంపించి నాగార్జునరెడ్డితోనే సీఎం మాట్లాడారు. అక్కడ అభ్యర్థి ఎంపికలో ఊహాగానాలు మారిపోయాయి. కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రాకే టికెట్‌ అని సంకేతం ఇచ్చినప్పటికీ ఆయనను వ్యతిరేకించే రెడ్డి సామాజికవర్గం నాయకులను కట్టడిచేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఇదే తరహాలో అద్దంకి, పర్చూరుతోపాటు మరికొన్ని నియోజకవర్గాలలో సాగుతున్న వ్యవహారాలను పరిశీలిస్తే వైసీపీలో రానున్నరోజుల్లో అనేక సరికొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

తెరపైకి చెవిరెడ్డిని తెచ్చి సరికొత్త డ్రామా

ఇటీవల సరికొత్త డ్రామాకు వైసీపీ అధినేతలు శ్రీకారం పలికారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని బాలినేని వద్దకు పంపి తాను ఎంపీగా పోటీచేస్తాను సహకరించమని అడిగించారు. బాలినేని కోరుకున్నట్లు వైవీ కుటుంబసభ్యులకు టికెట్‌ ఇవ్వడం లేదని ఆ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి చెవిరెడ్డి అనారోగ్య కారణాలతో ఉన్నానని చంద్రగిరి అసెంబ్లీ టికెట్‌ తన కుమారుడికి ఇవ్వాలని పట్టుబట్టి జగన్‌ వద్ద సాధించుకున్నారు. ఇప్పుడేమో బాలినేని వద్దకొచ్చారు. బాలినేని కాదు పొమ్మన్నారు. ఆ నాటకం రక్తికట్టకపోవటంతో బాలినేనికి విజయసాయిరెడ్డికి తోడు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులు, ఇతర కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారుల ఫోన్లు చేయడం ప్రారంభించారు. మాగుంట విషయం మీకెందుకు? సీఎంకు ఏరకంగానైనా మీరే కావాలి అంటూ ఆయన్ను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - Jan 14 , 2024 | 11:26 PM