Share News

ఇక సమరమే..!

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:41 AM

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ను ఒంగోలులో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ గురువారం విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫాం-1 నోటిఫికేషన్‌ను జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆర్వోలు జారీ చేశారన్నారు.

ఇక సమరమే..!
కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట, పక్కన రాఘవరెడ్డి, రియాజ్‌ తదితరులు (ఇన్‌సెట్‌లో), నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌

ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ

ఒంగోలులో విడుదల చేసిన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం ముమ్మరం

మరింత పెరగనున్న వేడి

సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలక ఘట్టానికి తెరలేసింది. వచ్చేనెల 13న జరగనున్న పోలింగ్‌కు గురువారం నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఆ వెంటనే నామినేషన్‌ల దాఖలు ప్రక్రియ మొదలైంది. ఈనెల 25 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ 29తో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇప్పుడు నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమవడంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది.

ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 18 : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ను ఒంగోలులో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ గురువారం విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫాం-1 నోటిఫికేషన్‌ను జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆర్వోలు జారీ చేశారన్నారు. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. నిర్దేశించిన కార్యాలయాల్లో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. అభ్యర్థులు నామినేషన్‌ తోపాటు అఫిడవిట్‌ను సమగ్రంగా సమర్పించా లన్నారు. ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు వీడియో గ్రఫీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామి నేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలను విధిగా అందజేయాల న్నారు. తాజా అఫిడవిట్‌ ఫాం-16, తాజా నామినేషన్‌ పత్రాలను మాత్రమే వినియోగించాలన్నారు.

తొలిరోజు 13 నామినేషన్లు

ఒంగోలు (కలెక్టరేట్‌) : సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎక్కడికక్కడ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు. ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ విడుదల చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్లు స్వీకరించారు. ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి నాలుగు సెట్‌లు, జిల్లాలో ఉన్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు స్థానాలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. మార్కాపురం, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కటి కూడా దాఖలు కాలేదు. ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒక సెట్‌ నామినేషన్‌ వేయగా, మాగుంట గీతాలత మరో సెట్‌ దాఖలు చేశారు. బూచి ఏడుకొండలు, బొడ్డు క్రాంతికుమార్‌లు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, నందిని బూచేపల్లి మరో రెండు సెట్ల నామినేషన్లు సమర్పించారు. మందా మీనా స్వతంత్ర, పి.కొండారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్‌ ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా కైలా వెంకటరావు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆసోది శంకర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. కొండపి నియోజకవర్గం నుంచి శ్రీపతి సతీష్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయగా, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక తరఫున ఈవీ సురేష్‌బాబు ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Apr 19 , 2024 | 01:41 AM