Share News

వనరులను దోచుకున్న నాయకులు నీతులు చెప్పడం విడ్డూరం

ABN , Publish Date - Jul 14 , 2024 | 10:17 PM

వైసీపీ నాయకులు చెబుతున్న మాటలు, నీతి వాఖ్యాలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ధ్వజమెత్తారు.

వనరులను దోచుకున్న నాయకులు నీతులు చెప్పడం విడ్డూరం

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ధ్వజం

దర్శి, జూలై 14: వైసీపీ నాయకులు చెబుతున్న మాటలు, నీతి వాఖ్యాలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ధ్వజమెత్తారు. ఈమేరకు ఆదివారం ఓప్రకటన విడుదలచేశారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రజాధనాన్ని, సహజ వనరులను దోచుకున్న నాయకులు ఇప్పుడు నీతులు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు మాత్రమే గడిచినప్పటికీ అప్పుడే హమీలు అమలు చేయలేదని దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి విమర్శించటం శోచనీయమన్నారు. తల్లికి వందనం పథకం అమలుకు విధివిదానాలు రూపొందిస్తుండగా, అప్పుడే ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేయటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టిప్పర్‌ ఇసుక ఎంతకు విక్రయించారో కనిపించలేదా అని ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కఆ్యణ్‌ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు ఇసుక ఉచితంగా ఇస్తున్నట్టు డాక్టర్‌ గొట్టిపాలి లక్ష్మి పేర్కొన్నారు. టిప్పర్‌ ఇసుకకు ఇప్పుడు రూ.7వేలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టిప్పర్‌కు రూ.30 వేలు తీసుకున్న విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చేస్తున్న విమర్శలు చూసి దర్శి నియోజకవర్గ ప్రజలు చీదరించుకుంటు న్నారని, ఆయన్ను ఎందుకు గెలిపించుకున్నామా అని ఇప్పుడు బాధపడుతున్నారని విమర్శించారు. దర్శి నియోజకవర్గంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జిల్లా చైర్‌పర్సన్‌ పదవిని అడ్డంపెట్టుకొని వైసీపీ కార్యకర్తలకు అడ్డగోలుగా నిధులు దోచిపెట్టిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా 90 శాతం మట్టి పనులు కేటాయించి వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టారని విమర్శిచారు. జిల్లా పరిషత్‌లో అడ్డగోలుగా పనుల కేటాయింపు, అనేక చోట్ల తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు చేసుకున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కరోజులో పింఛన్లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణానికి శరవేగంతో తీసుకుంటున్న నిర్ణయాలు కనపడలేదా అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం పాలన పట్ల అన్నివర్గాల ప్రజలు ఆనంధం వ్యక్తం చేస్తుండగా, వైసీపీ నాయకులకు దిక్కుతోచక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత కూడా జ్ఞానోదయం కాలేదన్నారు. ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో ప్రజలు ఉన్న సీట్లు కూడా లేకుండా చేస్తారని డాక్టర్‌ లక్ష్మి స్పష్టం చేశారు.

Updated Date - Jul 14 , 2024 | 10:17 PM