Share News

పూర్తికాకుండానే ప్రారంభోత్సవమా..?

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:31 AM

వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తికాకుండా ప్రారంభోత్సవం చేయడం ఏంటని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మార్కాపురం నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పూర్తికాకుండానే ప్రారంభోత్సవమా..?

మార్కాపురం రూరల్‌, మార్చి 5: వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తికాకుండా ప్రారంభోత్సవం చేయడం ఏంటని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మార్కాపురం నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టణంలోని జవహర్‌నగర్‌ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావే శం నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలను మభ్య పెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రాజెక్టు ప్రారంభోత్సవం అంటూ హడావుడి మొదలుపెట్టార న్నారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవ్వాలంటే రానున్న ఎన్నికలలో టీడీపీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలన్నారు. ప్రాజెక్టు కోసం భూములను, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. వారి నోట్లో మట్టి కొట్టి వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నా మంటూ సీఎం జగన్‌ వారిని మోసం చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులలో 85 నుంచి 90శాతం వరకు పనులు టీడీపీ హయాంలోనే పూర్తి చేశారన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజలను మభ్యపెట్టాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని అన్నారు. ప్రజలను భయ భ్రాంతులకు గురిచేసి విధ్వంసాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలురానున్న ఎన్నికలలో తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలనుకుని చేస్తున్న వెలుగొండ ప్రాజెక్టు పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిలిపి వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మౌలాలి, క్లస్టర్‌ ఇన్‌చార్జులు వక్కలగడ్డ మల్లికార్జున, కొప్పుల శ్రీనివాసులు, నాయకులు పటాన్‌ ఖాన్‌, జంకె రమణారెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

చిత్తశుద్ధి ఏదీ: వ్యవసాయ కార్మికసంఘం

పొదిలి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మాట ఇచ్చిన ప్రకారం వెలుగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పించి ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి కంకణాల రమేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక పెద్దబస్టాండ్‌ కూడలిలో వెలిగొండ నిర్వాసితులకు న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. వెలుగొండ ప్రాజెక్ట్‌ వెనుకబడిన పశ్చిమ ప్రాంతవాసులకు ఒక వరమన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్‌ను 17 ఏళ్లగా ప్రభుత్వాలు ప్రజలకు ఆశలు పెడుతున్నా యని, పూర్తి చేసి ఈ ప్రాంత వాసులకు న్యాయం చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వారి రాజకీయ స్వలాభం కోసం తూతూమంత్రంగా వెలిగొండ పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌ పాదయాత్రలో నిర్వాసితులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వాసితులకు న్యాయం చేయకుండా ప్రాజెక్ట్‌ ప్రారంభిస్తామని మరోసారి మాయమాటలు చెబుతున్నా రని ఎద్దేవ చేశారు. సుమారుగా 11 గ్రామాల్లో 8 వేల మందికిపైగా ఉన్న నిర్వసితులకు పునరావాసం కల్పించక పోవడం దారుణమన్నారు. 2019 నుండి బడ్జెట్‌లో అరకొరగా నిధులు కేటాయిస్తూ, ఎన్నోవాయిదాలు వేసు కుంటూ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు కాలయాపన చేసిందన్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలంటే సుమారుగా మూడువేల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. కేవలం కంటితుడుపుగా వంద, రెండొందల కోట్లు విడుదల చేసి ప్రజలను దగా చేస్తోం దని విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన కేవలం రూ.60 కోట్లు కేటాయించి రూ.32 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయడం తోపాటు అవసరమైన మేరకు నిధులు మంజూరు చేసి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కేజీ మస్తాన్‌, బడుగు వెంకటేశ్వర్లు, అంగలకుర్తి బ్రహ్మయ్య, కంకణాల వెంకటేశ్వర్లు, పారాబత్తిన శ్రీను, ఉబ్బా వెంకటేశ్వర్లు, బి.జనార్ధన్‌, ఈదర సుబ్బారావు, ఎస్‌ ఆదినారాయణ, జి.రాములు తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టు ప్రారంభోత్సవం హాస్యాస్పదం: ఆప్‌

మార్కాపురం వన్‌టౌన్‌ : పూర్తికాని వెలిగొండ ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభించడం హాస్యాస్పదం అని ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు బి.సుదర్శన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్‌ బుధవారం వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభో త్సవానికి రావడం అంటే నిర్వాసితుల గొంతు కోసి శవాలమీద నడవడమేనన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండా నే, పరిహారం ఇవ్వకుండానే, ఇటువంటి బూటకపు కార్యక్రమాలు ఎవరూ హర్షించరన్నారు. జిల్లాలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల చేతకానితనమే ఈ దుస్థితికి కారణమన్నారు. ప్రభుత్వ అసమర్థ పనుల వలన భవిష్య త్తులో ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు అమాయకులు కాదని, తగిన బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మార్కాపురం జిల్లా కూడా ఏర్పాటు చేయకపోవడం పాలకుల, ప్రజా ప్రతినిధుల అసమర్థతే కారణమన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:31 AM