Share News

అందని వైద్యం

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:22 PM

ప్రజల ముంగిటే వైద్య సేవలందించాలనే ఆశయంతో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు చేరువలో ఆరోగ్యం అందించడం కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల సేవలు అందని ద్రాక్షలా మారాయి.

అందని వైద్యం
తాళాలు వేసిన కంకణంపాడు వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌

వెలిగండ్ల మండలంలో ఆరోగ్య కేంద్రాలకు తాళాలు

అందుబాటులో లేని వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ సిబ్బంది

వెలిగండ్ల, ఫిబ్రవరి 27 : ప్రజల ముంగిటే వైద్య సేవలందించాలనే ఆశయంతో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు చేరువలో ఆరోగ్యం అందించడం కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల సేవలు అందని ద్రాక్షలా మారాయి. మండలంలో 7 వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 12 రకాల వైద్య సేవలతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించాల్సి ఉంది. ఇవన్నీ ఉచితంగా అందించాల్సిన సేవలను గాలికి వదిలేశారు. 12 రకాల వైద్య సేవల్లో గర్భిణులు, బాలింతల ఆరోగ్యం ముఖ్యమైనది. వారికి పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు.

మండలంలోని పి. నాగులవరం, కంకణంపాడు, ఇమ్మడిచెరువు, రాళ్లపల్లి వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలాను మంగళవారం ఆంధ్రజోతి తనిఖీ చేసింది. ఉదయం 12 గంటల సమయంలో కూడా కనీసం కేంద్రాల తలుపులు తీయలేదు. దీంతో కేంద్రాలకు వచ్చిన రోగులు తలుపులు తీయకపోవడంతో చూసి వెనక్కి వెళుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ క్యాంపులు ఉన్నప్పుడు మాత్రమే ఎంఎల్‌హెచ్‌పీలు వస్తారని, మిగతా రోజుల్లో కనిపించరని చెప్పారు. ఒక వేళ వచ్చినరోజు మందుల కోసం కేంద్రానికి వెళ్తే రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సరిపడా మందులు కూడా లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజలకు వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:23 PM