Share News

జిల్లాపై అల్పపీడన ప్రభావం

ABN , Publish Date - Aug 31 , 2024 | 01:03 AM

జిల్లాపై అల్పపీడన ప్రభావం కనిపించింది. పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. అంతేకాక శుక్రవారం పగటిపూట అంతా అత్యధిక ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి.

జిల్లాపై అల్పపీడన ప్రభావం
ఒంగోలులో కురుస్తున్న వర్షం

పలుప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం

చల్లబడిన వాతావరణం

పైర్లకు జీవం, మరికొంత కురిస్తే సాగుకు ఉపయోగం

ఒంగోలు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాపై అల్పపీడన ప్రభావం కనిపించింది. పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. అంతేకాక శుక్రవారం పగటిపూట అంతా అత్యధిక ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడటంతో ప్రజానీకం సేదతీరింది. అదేసమయంలో నెలరోజులకుపైగా సరైన వర్షం లేక వాడుముఖం పట్టిన పైర్లకు తాజా జల్లులు కాస్తంత జీవం పోశాయి. ఈ ఏడాది వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో వర్షాలు సరిపడా లేకపోవడమేకాక ఎండల తీవ్రత కూడా పెరిగింది. గతానికి భిన్నంగా ఆగస్టు రెండో పక్షంలో కూడా వేసవిని తలపించే రీతిలో ఎండలు మండిపోయాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు పెరిగి అధిక ప్రాంతాల్లో గరిష్ఠంగా 38 డిగ్రీల మేర నమోదయ్యాయి. అంతేకాక తీవ్ర ఉక్కపోత వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మరోవైపు వర్షాలు సరిలేక సాగు ముందుకు సాగలేదు. వేసిన పైర్లు సైతం వాడుముఖం పట్టాయి.


ఎడతెరిపి లేకుండా జల్లులు

ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం జిల్లాపై చూపింది. గురువారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో జల్లులు ప్రారంభమై శుక్ర వారం సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా కురు స్తున్నాయి. జిల్లాలో శుక్రవారం ఉదయానికి సగటున 6.4మి.మీ వర్షపాతం నమోదైంది. హనుమంతునిపా డులో గరిష్ఠంగా 26.4 మి.మీ నమోదైంది. పొన్నలూ రులో 20.2, ఒంగోలులో 18.4, పుల్లలచెరువులో 14.0, కేకేమిట్లలో 11.2, టంగుటూరులో 10.2 మి.మీ కురిసింది. ఇతర పలు మండలాల్లో కూడా జల్లులు పడ్డాయి. అలాగే శుక్రవారం పగటిపూట కూడా జిల్లా అంతటా వాతావరణం చల్లబడటంతోపాటు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. తాజా వానలతో పొలంలో వాడుముఖం పట్టిన పైర్లు జీవం పోసుకున్నాయి. మరో రెండు, మూడు రోజులు మంచి వర్షాలు కురిస్తే తదుపరి సాగుకు ఉపయుక్తంగా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Aug 31 , 2024 | 01:03 AM