Share News

మంచోళ్లయితే సీటెందుకు మార్చారు..!

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:14 PM

సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మంచోడు, పెద్ద మనిషి.. ప్రస్తుత కందుకూరు వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ మంచోడు సౌమ్యుడు అని సీఎం జగన్‌ కొనియాడటంపై వైసీపీ శ్రేణులే విస్మయానికి గురయ్యారు. వారు మంచోళ్లు, సౌమ్యులైతే ఎమ్మెల్యేగా ఉన్న మహీధర్‌రెడ్డిని పోటీ నుంచి ఎందుకు తప్పించారు.. కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రాను కందుకూరుకు ఎందుకు బదిలీ చేశారన్న ప్రశ్న ఉత్పన్నమైంది.

మంచోళ్లయితే సీటెందుకు మార్చారు..!

కందుకూరు సభలో జగన్‌ మాటలపై వైసీపీ శ్రేణుల విస్మయం

మహీధర్‌, బుర్రాల మంచోళ్లే అంటూ మైక్‌ ఇవ్వని జగన్‌

ఏడాదిక్రితం ఇచ్చిన హామీల ఊసేలేదు

కందుకూరులో ఆకట్టుకోని జగన్‌ ప్రసంగం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మంచోడు, పెద్ద మనిషి.. ప్రస్తుత కందుకూరు వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ మంచోడు సౌమ్యుడు అని సీఎం జగన్‌ కొనియాడటంపై వైసీపీ శ్రేణులే విస్మయానికి గురయ్యారు. వారు మంచోళ్లు, సౌమ్యులైతే ఎమ్మెల్యేగా ఉన్న మహీధర్‌రెడ్డిని పోటీ నుంచి ఎందుకు తప్పించారు.. కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రాను కందుకూరుకు ఎందుకు బదిలీ చేశారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ప్రసంగం చివర్లో ఆయన ఒకరిని గురించి చెప్పాలి అంటూ వెనుకున్న మహీధర్‌ రెడ్డని ముందుకు పిలిచి చాలా మంచివారు.. పెద్ద మనిషి అని కొనియాడుతూ ఈసారి సీటు ఇవ్వలేకపోతున్నా అని చెప్పగానే ఒప్పేసుకున్న సౌమ్యుడు అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పోటీలో ఉన్న బుర్రా మధుసూదన్‌యాదవ్‌ను ఉద్దేశించి చాలా మంచోడు.. సౌమ్యుడు.. మంచిపేరున్న నాయకుడు అని వ్యాఖ్యానించారు. నిజానికి కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రాపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో చిన్నచిన్న పనులు కూడా ఆయనే చేసుకుంటూ అక్రమ సంపాదన కొనసాగించారన్న ఫిర్యాదులు ఆ పార్టీ నేతలే జగన్‌కు పలుమార్లు చేశారు. కార్యకర్తలను గౌరవించడూ.. గుర్తించడూ.. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం వారిన అణగదొక్కారని జగన్‌ ముందు పలుమార్లు మొరపెట్టుకున్నారు. ఆయనకు కనిగిరి టికెట్‌ ఇస్తే సహకరించబోమని తేల్చిచెప్పారు. దీంతో పక్కనే ఉన్న కందుకూరుకు ఆయన్ను మార్చి రంగంలోకి దింపారు. ఈ విషయాలన్నీ దాచిపెట్టి మంచోడు, సౌమ్యుడు అని పొగడం ఆ పార్టీశ్రేణుల్లో చర్చీనీయాంశమైంది. ప్రస్తుత ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఇప్పటికి నాలుగుసార్లు గెలుపొందగా, అంతకుముందు రెండుసార్లు గెలుపొందారు. బలమైనవర్గం వారికి అండగా ఉంది. అయినా ఎక్కడా సీటు ఇవ్వకుండా తప్పించేసి ఇప్పుడు అవసరం కొద్ది ఎన్నికల సభలో ఆయన్ను పొగడటం గమనార్హం. అంతకుముందు మహీధర్‌రెడ్డి హెలిప్యాడ్‌ వద్ద సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి వెంటనే పక్కకు వెళ్లిపోయారు. సీఎం అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మహీఽధర్‌రెడ్డి ఎక్కడున్నారో తీసుకురండి అని చెప్పడంతో అప్పటికే పక్కకు వెళ్లిన మహీధర్‌రెడ్డిని తీసుకొచ్చి కారు ఎక్కించారు. ఇవన్నీ అటుంచితే గంటకుపైగా జరిగిన సభలోవారిద్దరూ మాట్లాడేందుకు ఒక్కో నిమిషం కూడా అవకాశం ఇవ్వలేదు. పైగా ఏడాది క్రితం నియోజకవర్గానికి వచ్చినప్పుడు సీఎం జగన్‌ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన హామీలలో ఒక్కటీ అమలు కాలేదు. బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి నిధులు, రాళ్లపాడు రిజర్వాయర్‌ ఎడమ కాలువ అభివృద్ధికి నిధులు వెంటనే ఇస్తామని ప్రకటించారు. వాటితోపాటు ఆయన ఇచ్చిన హామీలు మరకొన్ని అమలు కాకపోగా, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం వైసీపీ శ్రేణులు నీరసపడ్డారు.

Updated Date - Apr 28 , 2024 | 11:15 PM