రేనాటి చోళుల శాసనాల గుర్తింపు
ABN , Publish Date - Jan 02 , 2024 | 12:05 AM
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గోళ్లవీడపి గ్రామంలో అత్యంత ప్రాచీన శాసనాలను అధికారులు గుర్తించారు.
ఎర్రగొండపాలెం, జనవరి 1 : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గోళ్లవీడపి గ్రామంలో అత్యంత ప్రాచీన శాసనాలను అధికారులు గుర్తించారు. 7వ శతాబ్దం నాటి తొలి తెలుగు లిపిగా భావిస్తున్నారు. గ్రామంలోని వణుకూరి సుబ్రహ్మణ్యం పొలంలో అవి మట్టిలో కప్పబడి ఉంది. ఇటీవల వ్యవసాయ పనులు చేస్తుండగా వెలుగుచూశాయి. ఈ విషయాన్ని చారిత్రక పరిశోధకుడు తురిమెళ్ల శ్రీనివాస ప్రసాద్‌కు తెలియజేయడంతో ఆయన దానిని పరిశీలించి మైసూరులోని ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నంరెడ్డికి పంపించారు. ఈ లిపిని విశ్లేషించిన అక్కడి అధికారులు వివరాలు తెలియజేశారు. శాసనాలు రేనాటి చోళరాజు ముంగియువరాజు(682- 706) కుమారుడైన కొక్కిలి అనే రాజు లిఖించినట్లు గుర్తించారు. కొక్కిలి రాజు కుబ్జవిష్ణువర్ధనుడి వంశంలో ఏడవ తరానికి చెందినవాడు. ఈయన ముంగియువరాజు రెండవ భార్య కుమారుడు. పల్లవ రాజుల సాయంతో వేంగి సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆరు నెలల పాటు పరిపాలించాడని శాసనంలో ఉంది. కోటిపురలో ఉన్నటు వంటి కుళాభట్టా అనువారికి చోళరాజు కొక్కిలి ఆరు పుట్ల భూమిని దానం చేసినట్లు ఈ శాసనాలలో లిఖించారు. ఈ రాజు త్రిపురాంతకం నుంచి శ్రీశైల యాత్ర చేస్తూ గోళ్లవీడపిలో దద్దనాల అనే శివాలయం వద్ద విడిది చేసినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్కీయాలజి డైరెక్టర్ మునిరత్నంరెడ్డి ధ్రువీకరించారు. ఈ శాసనాల ద్వారా రేనాటి చోళుల ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ శాసనాలపై చెక్కిన అక్షరాలు తొలి తెలుగు శాసనాన్ని పోలి ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతం అత్యఽంత చారిత్రక ప్రాభవం కలిగి ఉందని తెలుస్తోంది. ఈ పరిశీలనలో మణిమేల శివశంకర్, సర్వేయరు ఎం.శ్రీనివాసచారి, ఎన్‌పెద్దన్న, ఎం సూర్యనారాయణ, కైండిన్య పాల్గొన్నారు.