Share News

జిల్లా అభివృద్ధి బాధ్యత నాదే!

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:02 AM

‘రాష్ట్రంలో వైసీపీ ఓటమి చెందడం.. టీడీపీ, జనసేనల ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. రానున్న వంద రోజుల్లో జరగబోయేది ఇదే. ఆ తర్వాత జిల్లా అభివృద్ధి బాధ్యతను టీడీపీ తీసుకుంటుంది’ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. తొలి ఏడాదిలోనే వెలిగొండతోపాటు ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

జిల్లా అభివృద్ధి బాధ్యత నాదే!
చంద్రబాబు

అధికారంలోకి వచ్చేది మేమే..

తొలి ఏడాదిలోనే వెలిగొండ పూర్తి

మార్కాపురం కేంద్రంగా జిల్లా

కందుకూరును ఒంగోలులో చేరుస్తా

ఉగ్ర చెప్పిన ఐదు గ్యారెంటీలను నెరవేరుస్తా

కనిగిరి సభలో చంద్రబాబు

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

‘రాష్ట్రంలో వైసీపీ ఓటమి చెందడం.. టీడీపీ, జనసేనల ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. రానున్న వంద రోజుల్లో జరగబోయేది ఇదే. ఆ తర్వాత జిల్లా అభివృద్ధి బాధ్యతను టీడీపీ తీసుకుంటుంది’ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. తొలి ఏడాదిలోనే వెలిగొండతోపాటు ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి తన దృష్టికి తెచ్చిన ఐదు సమస్యలను పరిష్కరించి కనిగిరికి బంగారు భవిష్యత్‌ను అందిస్తానని ప్రకటించారు. రా.. కదలిరా అంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కనిగిరి సభలో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం వేదికపై జిల్లా నాయకులతో కలిసి భేరీని మోగించి ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి తానే శ్రీకారం పలికానని, పదిశాతం మినహా మిగిలిన పనులు పూర్తిచేశానని చెప్పారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ పనులు పూర్తయి ఇప్పటికే పశ్చిమప్రాంతం సస్యశ్యామలమయ్యేదన్నారు. ఇప్పుడు చెప్తున్నా తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే దాన్ని పూర్తిచేసి సాగు, తాగునీరు అందిస్తానని స్పష్టం చేశారు. ‘జిల్లాలో గుండ్లకమ్మ్ట, కొరిశపాడు ఎత్తిపోతల పథకం, గుంటూరు చానల్‌ పొడిగించి పర్చూరు వరకు గోదావరి నీరు ఇవ్వడం, సాగర్‌ కుడి కాలువకు గోదావరి నీరు మళ్లించడం వంటి వాటిని పూర్తి చేస్తా. జిల్లా వాసులకు తాగు, నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తా’ అని హామీ ఇచ్చారు. వెలిగొండ కుడికాలువతో ముసి, పాలేరు నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. ఒంగోలు జిల్లా కూడా ఉంటుంది అందులో కందుకూరును చేరుస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తానని చెప్పారు. కందుకూరులో తాను చేపట్టిన హార్టీకల్చర్‌ కళాశాలను కూడా ఈ ప్రభుత్వం ఆపేసింది. దాన్నికూడా మన ప్రభుత్వం రాగానే పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు.

కనిగిరికి ప్రత్యేక వరాలు

తొలుత ఇన్‌చార్జి డాక్టరు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి తాను చేపట్టిన ఐదు గ్యారెంటీలను ప్రస్తావిస్తూ వాటి సాధన ద్వారా దుర్భిక్షాన్ని తరిమికొట్టేందుకు సహకరించాలని కోరారు. వాటిని చంద్రబాబు తన ప్రసంగంలోకి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘కనిగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఆర్థికంగా వెనుకబడిపోతుంటే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్లినవారు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. దానికి కారణం ఇక్కడ అవసరమైన వసతులు లేకపోవటమే. మా ప్రభుత్వం రాగానే ఆ పరిస్థితిని నివారిస్తా. మీ ప్రాంత ప్రజల కోసం నిత్యం పరితపించే డాక్టర్‌ ఉగ్ర సూచించిన విధంగా వెలిగొండను పూర్తిచేసి మీ నియోజకవర్గానికి ఉపయోగపడేటట్లు చేస్తా. గతంలో నేను శంకుస్థాపన చేసి ఈ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిన ట్రిఫుల్‌ ఐటీని కనిగిరిలోనే ఏర్పాటు చేస్తా. అప్పట్లో కేంద్రంతో మాట్లాడి తాము ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన నిమ్జ్‌కు తిరిగి కేంద్రం ద్వారా డబ్బులు తెచ్చి పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తా. నడికుడి-శ్రీకాళహస్తి రైలుమార్గాన్ని వారు పూర్తిచేయలేకపోవడం బాధాకరం. మా ప్రభుత్వం రాగానే ఆ పనులు వేగంగా జరిగి మీప్రాంతం మీదుగా రైళ్లు నడిచేలా చర్యలు తీసుకుంటా. ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా రక్షిత తాగునీటిని అందించి ఫ్లోరోసిస్‌ పీడ నుంచి వముక్తి కల్పిస్తా అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Updated Date - Jan 06 , 2024 | 01:02 AM