Share News

నేనున్నానని..

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:42 PM

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందిన వారి కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తోంది. వారిలో మనోదైర్యం నింపేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటనలు ప్రారంభించారు. అందులో భాగంగా మంగళవారం కె.ఉప్పలపాడు గ్రామానికి రానున్నారు.

నేనున్నానని..
టంగుటూరులో టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న దామచర్ల సత్య

నేడు నారా భువనేశ్వరి ‘నిజంగెలవాలి’ పర్యటన

చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ఆగిన గుండెలు

కె.ఉప్పలపాడులో అంజయ్య, టంగుటూరులో అరుణ్‌కుమార్‌ మృతి

నేడు వారి కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం

కొండపి, జనవరి 30 : టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందిన వారి కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తోంది. వారిలో మనోదైర్యం నింపేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటనలు ప్రారంభించారు. అందులో భాగంగా మంగళవారం కె.ఉప్పలపాడు గ్రామానికి రానున్నారు. చంద్రబాబు అరెస్టుతో తీవ్రమనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందిన గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన జంగాల అంజయ్య (54) కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు. వారికి ఆర్థికసాయం అందించనున్నారు. ఈసందర్భంగా అంజయ్య భార్య అజంత ‘ఆంఽధ్రజ్యోతి’తో మాట్లాడారు. స్థానికంగా ఉన్న ప్రైవేటు స్కూల్‌లోనే కట్టుబడి, కూలి పనులు తన భర్త చేసేవాడని ఆమె తెలిపారు. చంద్రబాబు ఏతప్పూ చేయరని, ఆయన్ను జగన్‌ అక్రమంగా అరెస్ట్‌ చేయించి వేధిస్తున్నారని తనతో పదేపదే చెప్పేవారన్నారు. చంద్రబాబుకు బెయిల్‌ వస్తుందా? రాదా? అని రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ టీవీ చూస్తేనే ఉండేవారని చెప్పారు. గత ఏడాది సెప్టెంబరు 27వ తేదీ కూడా టీవీ చూస్తూ గుండెపోటుకు గురై మరణించాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కాగా భువనేశ్వరి పరామర్శ కార్యక్రమం నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యన్నారాయణ మంగళవారం ఉదయం అంజయ్య భార్య అజంత, కొడుకు అన్వే్‌షకుమార్‌లతో మాట్లాడారు. భువనేశ్వరి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక నాయకులను కలిసి మాట్లాడారు.

టంగుటూరులో ఏర్పాట్లను పరిశీలించిన సత్య

టంగుటూరు : నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి బుధవారం టంగుటూరు రానున్నారు. ఆమె మధ్యాహ్నం 2.35గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. చంద్రబాబు అరెస్ట్‌ సందర్భంగా తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందిన పంచాయతీ పరిధిలోని రజకకాలనీకి చెందిన దుగ్గినేని అరుణ్‌కుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వారికి రూ3లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య మండలంలోని పార్టీ నేతలతో కలసి భువనేశ్వరి కార్యక్రమం ఉన్న ప్రాంతంలో మంగళవారం పర్యటించారు. మృతుడు అరుణ్‌కుమార్‌ గృహాన్ని పార్టీ మండల నాయకులతో కలసి సందర్శించారు. వారికి పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు కామని విజయ్‌కుమార్‌, పట్టణ అధ్యక్షుడు కామని నాగశ్రీను, మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్‌, తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, తెలుగు యువత మండల అధ్యక్షుడు అభిషేక్‌ తదితరులున్నారు.

శివాలయం సెంటర్‌కు పార్టీ శ్రేణులంతా తరలిరావాలి

మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా బుధవారం మధ్యాహ్నం 2.30గంటలకు టంగుటూరులోని శివాలయం వద్దకు చేరుకోవాలని పార్టీ మండల అధ్యక్షుడు కామని విజయకుమార్‌ కోరారు. ఎవ్వరూ నేరుగా బాధితుడి గృహం వద్దకు వెళ్లవద్దని సూచించారు.

Updated Date - Jan 30 , 2024 | 11:42 PM