Share News

భారీ పోలింగ్‌

ABN , Publish Date - May 15 , 2024 | 01:21 AM

ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో జిల్లా ఓటర్లు భారీగా పాల్గొని ఓటుహక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలలో నిల్చొని మరీ ఓటు వేశారు.

భారీ పోలింగ్‌

87.17శాతం ఓటింగ్‌

గత ఎన్నికలకంటే ఎనిమిది శాతం అధికం

దర్శి సెగ్మెంట్‌లో అత్యధికంగా 91శాతం

ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో 14,01,614 మంది ఓటుహక్కు వినియోగం

ఒంగోలు (కలెక్టరేట్‌), మే 14 : ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో జిల్లా ఓటర్లు భారీగా పాల్గొని ఓటుహక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలలో నిల్చొని మరీ ఓటు వేశారు. ఒకవైపు అనుకున్నంత స్పీడ్‌గా ఈవీఎంలు పనిచేయకపోవడం, ఇంకోవైపు కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలిరావడంతో పోలింగ్‌ ఆలస్యమైంది. ఓటర్లు గంటల తరబడి క్యూలలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని నియోజకవర్గాల్లో సోమవారం అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్‌ జరిగింది. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంలో మొత్తం 16,07,832 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 8,02,483 మంది, మహిళలు 8,05,242 మంది, థర్డ్‌ జెండర్‌ 107మంది. వీరిలో 14,01,614 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలా 87.17శాతం మంది ఓటేయడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 91శాతం మంది ఓటుహక్కును వినియోగించుకోగా, అత్యల్పంగా ఒంగోలు నియోజకవర్గంలో 84.56శాతం మంది ఓటేశారు.

మహిళల కంటే పురుష ఓటర్లే ఎక్కువ వినియోగం

ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంలో మహిళల కంటే పురుష ఓటర్లే అధికంగా ఓటుహక్కును వినియోగించు కున్నారు. మొత్తం 14,01,614 మంది ఓటు వేయగా అందులో పురుషులు 7,00,983 మంది, మహిళలు 7,00,565 మంది ఉన్నారు. మహిళల కంటే పురుషులు 418 మంది తమ ఓటుహక్కును అధికంగా వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల మహిళలే ఎక్కువగా ఓటుహక్కు వినియోగించుకోగా, జిల్లావ్యాప్తంగా సరాసరిన చూస్తే పురుష ఓటర్లే స్వల్పంగా ముందున్నారు.

ఒంగోలు నియోజకవర్గంలో మహిళా ఓటర్లే కీలకం

ఒంగోలు నియోజకవర్గంలో మహిళా ఓటర్లే గెలుపోటములు నిర్ణయించనున్నారు. సోమవారం జరిగిన పోలింగ్‌లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒంగోలులో 2,40,242మంది ఓటర్లు ఉండగా పురుషులు కేవలం 98,055 మంది ఓటు వేశారు. మహిళలు 1,05,050 మంది వినియోగించుకున్నారు. పురుషుల కంటే 6,995 మంది మహిళలు అధికంగా ఓటు వేశారు.

Updated Date - May 15 , 2024 | 08:09 AM