Share News

అపార నష్టం తెరిపిఇచ్చిన వర్షం

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:20 PM

జిల్లాలో పది రోజులుగా కురుస్తున్న వర్షాలు తెరపి ఇచ్చాయి. అక్కడక్కడా ఒకట్రెండు ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల ఆదివారం ఎండ కాచింది. దీంతో పంట నష్టాలు వెలుగు చూస్తున్నాయి. అధికారులు అంచనా వేసిన దాని కన్నా నష్టాలు అధికంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనతో రైతులు వణికిపోతున్నారు. మరోవైపు వర్షాలకు అత్యధిక ప్రాంతాల్లో రోడ్లు ఛిద్రమయ్యాయి. గోతుల్లో నీరు నిలిచి రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ పారిశుధ్యం అధ్వానంగా మారింది.

అపార నష్టం  తెరిపిఇచ్చిన వర్షం
తర్లుబాడు మండలం సీతానాగులవరం వద్ద ఉరకెత్తిన పొగ తోట

ఉరకెత్తుతున్న పంటలు

వాయుగుండం అనంతర పరిస్థితితో రైతుల్లో ఆందోళన

మళ్లీ వర్ష సూచనతో వణుకు

చాలాప్రాంతాల్లో అధ్వానంగా రోడ్లు

అవస్థలు పడుతున్న ప్రజలు

సాధారణ స్థితికి జనజీవనం

పారిశుధ్యంపై దృష్టి పెట్టకపోతే వ్యాధులు ప్రబలే అవకాశం

జిల్లాలో పది రోజులుగా కురుస్తున్న వర్షాలు తెరపి ఇచ్చాయి. అక్కడక్కడా ఒకట్రెండు ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల ఆదివారం ఎండ కాచింది. దీంతో పంట నష్టాలు వెలుగు చూస్తున్నాయి. అధికారులు అంచనా వేసిన దాని కన్నా నష్టాలు అధికంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనతో రైతులు వణికిపోతున్నారు. మరోవైపు వర్షాలకు అత్యధిక ప్రాంతాల్లో రోడ్లు ఛిద్రమయ్యాయి. గోతుల్లో నీరు నిలిచి రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ పారిశుధ్యం అధ్వానంగా మారింది.

ఒంగోలు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : వర్షం తెరిపి ఇచ్చి ఎండ రావడంతో పంట నష్టాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా సజ్జ, మినుము, కంది, పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న తదితర పంటలు ఈ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. 26 మండలాల్లోని 119 గ్రామాల్లో 7,241 మంది రైతులకు చెందిన సుమారు 7,194.47 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఎండ కాస్తుండటంతో నష్టాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పది రోజులుగా నీళ్లలో ఉన్న పంటలు ప్రస్తుతం ఉరకెత్తిపోతున్నాయి. పశ్చిమప్రాంతంలో పొగాకు, మిర్చి, పత్తి, కంది పంటలు దెబ్బతింటున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు పది వేల హెక్టార్లకుపైగా పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

వాగులు, వంకల్లో జలకళ

జిల్లాలో చాలాకాలం తర్వాత వాగులు, వంకలు చిన్న, పెద్ద చెరువులు, కాలువలు ఇతరత్రా అన్ని నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. ఈ సీజన్‌ అవసరాలకు నీటి ఇక్కట్లు ఉండవని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పది రోజులపాటు ముసురు వర్షంతో అవస్థలు పడిన రోజువారీ కూలీ పనులు, చిరు వ్యాపారులు చేసుకొనే వారు ప్రస్తుతం వర్షం తెరపి ఇవ్వడంతో ఆ పరిస్థితి నుంచి తేరుకుంటున్నారు. రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యారు.


7,194 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు

వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంట నష్టాలు భారీగా వెలుగుచూస్తున్నాయి. 26 మండలాల్లోని 119 గ్రామాల్లో 7,241 మంది రైతులకు చెందిన సుమారు 7,194.47 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అందులో సజ్జ 1,883,47 హెక్టార్లు, మినుము 1,339, జొన్న 3, అలసంద 1,683, పత్తి 1,958, వరి 120, కొర్ర 8, పొగాకు 200 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు.

ఈనెలలో 200 మి.మీ వర్షపాతం

జిల్లాలో వార్షిక వర్షపాతం 755.5 మి.మీ కాగా ఒక్క అక్టోబరులోనే 205.50 మి.మీ కురుస్తుంది. అందులో అక్టోబరు 20వరకు సుమారు 150 మి.మీ కురవాల్సి ఉండగా ఇంచుమించు 200 మి.మీ మేర పడింది. ఈనెల 14నుంచి 17 వరకూ వాయుగుండం ప్రభావం జిల్లాపై ఉండగా ఆ సమయంలోనే కాక అంతకు ముందు రెండు మూడు రోజులు, తర్వాత మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిశాయి. శుక్ర, శనివారాల్లో సుమారు 27.0 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో దాదాపు 17.9 మి.మీ కురిసింది. అప్పటికే సాధారణం కన్నా ఎక్కువగా, కొన్ని మండలాల్లో రెండు, మూడు రెట్లు అధికంగా కురిసిన వర్షాలు పంటలను నష్టపర్చాయి. ఆదివారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో జిల్లాలోనే అత్యధికంగా సింగరాయకొండ మండలంలో 65.20 మి.మీ వర్షపాతం నమోదైంది. చీమకుర్తిలో 59.0, ఒంగోలు 50.40, కొకనమిట్లలో 48.0, కొత్తపట్నంలో 44.0, పొదిలిలో 42.4 మి.మీ కురిసింది. మరో పది మండలాల్లో 15నుంచి 30 మి.మీ నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ జల్లులు పడ్డాయి.

రోడ్లు, పారిశుధ్యం అధ్వానం

అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు వర్షాలతో మరింత దారుణంగా మారాయి. గ్రామా లు, పట్టణాల్లోని అంతర్గత రోడ్లు చాలాచోట్ల జలమయమై కనిపిస్తున్నాయి. ప్రధాన రోడ్లపై సైతం ఇప్పటికే పెద్దఎత్తున గుంతలు పడి వాటిలో వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల అర్ధగంట ప్రయాణానికి గంటన్నర పడుతోంది. అదేసమయంలో పట్టణం పల్లె అన్న తేడా లేకుండా పారిశుధ్యం పరిస్థితి దారుణంగా మారింది. పట్టణాలలో ఆక్రమణలు అధికమై మురుగు అంతా రోడ్లపైకి చేరింది. పల్లెల్లో రోడ్లు, కాలువలు ఏకమై నీరుపారి దుర్గంధం వెదజల్లుతోంది. తక్షణం అధికార యంత్రాంగం పారిశుధ్యం, వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Updated Date - Oct 20 , 2024 | 11:20 PM