Share News

అయినా.. తగ్గేదేలే!

ABN , Publish Date - Jan 11 , 2024 | 01:54 AM

డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 30వరోజుకు చేరింది. ఎస్మాను ప్రయోగిస్తామని ప్రభుత్వం బెదిరించినా ఆయాలు, కార్యకర్తలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

అయినా.. తగ్గేదేలే!
ఒంగోలులో ఉరితాళ్లు బిగించుకొని నిరసన తెలుపుతున్నఅంగన్‌వాడీలు

కొనసాగుతున్న అంగన్‌వాడీల ఆందోళన

ఎస్మా అమలు దిశగా ప్రభుత్వం అడుగులు

కేంద్రాలకు నోటీసులు అంటిస్తున్న

ఐసీడీఎస్‌ అధికారులు

ఒంగోలు నగరం, జనవరి 10 : డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 30వరోజుకు చేరింది. ఎస్మాను ప్రయోగిస్తామని ప్రభుత్వం బెదిరించినా ఆయాలు, కార్యకర్తలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన 24గంటల రిలే దీక్షలు బుధవారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఒకవైపు దీక్షను కొనసాగిస్తూనే ఉరితాళ్లతో వినూత్న నిరసన తెలిపారు. జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల కేంద్రాల్లో కార్యకర్తలు చెవిలో పువ్వులు, ఒంటికాలిపై నిలబడటం, ఎస్మా ప్రతులను తగలబెట్టడం వంటి కార్యక్రమాలను చేపట్టారు.

కఠిన చర్యలు తప్పవంటూ ప్రభుత్వం నోటీసులు

ఐసీడీఎస్‌ సేవలను అత్యవసర సేవల కిందచేర్చి రాష్ట్రప్రభుత్వం వారం క్రితం అంగన్‌వాడీలపై ఎస్మాను ప్రయోగించింది. ఈనెల 9వతేదీలోపు సమ్మెను విరమించి విధుల్లో చేరకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పని హెచ్చరించింది. అయినప్పటికీ కార్యకర్తలు వెరవకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు బుధవారం నుంచి నోటీసుల ప్రక్రియను ప్రారంభించారు. ఒంగోలు నగరంలో కేంద్రాలకు వాటిని అంటిస్తున్నారు. వెంటనే విధుల్లో చేరాలని లేనిపక్షంలో కఠినచర్యలు తప్పవని వాటిలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీలకు నోటీసులు ఇచ్చి వారు విధుల్లో చేరేలా చూడాలని ప్రభుత్వం నుంచి జిల్లా ఐసీడీఎస్‌ అఽధికారులకు ఆదేశాలు అందాయి. కొన్ని ప్రాజెక్టుల సీడీపీవోలు నోటీసులను అంగన్‌వాడీలకు పోస్టు ద్వారా పంపించే ఏర్పాట్లు చేస్తునట్లు సమాచారం.

పెరుగుతున్న మద్దతు

అంగన్‌వాడీల ఆందోళనకు రోజురోజుకీ మద్దతు పెరుగుతూనే ఉంది. బుధవారం కలెక్టరేట్‌ వద్ద దీక్షలను ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రీజనల్‌ కార్యదర్శి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శేషయ్య, ఎంఎస్‌ఆర్‌యూ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వినోద్‌, సీపీఐ ఎంఎల్‌ రెడ్‌స్టార్‌ జిల్లా కార్యదర్శి సుబ్బారావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.వి.కొండారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌, నగర అభివృద్ధి కమిటీ నాయకుడు మారెళ్ల సుబ్బారావు, జి.వి.కల్పన, మహేష్‌ సంఘీభావం తెలిపారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రాజశేఖర్‌, విద్యార్థి జేఏసీ నాయకుడు ఆర్‌.జగదీష్‌ తమ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ, కేవీ.సుబ్బమ్మ, ప్రశాంతి, హెమీమా, నిర్మల పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 01:54 AM