Share News

ఇప్పుడెలా?

ABN , Publish Date - Jun 09 , 2024 | 10:41 PM

వైసీపీ నేతలతో అంటకాగారు. ప్రతిపక్షాలే టార్గెట్‌గా పేట్రేగిపోయారు. టీడీపీ నేతలను అనేక రకాలుగా వేధించారు. అక్రమ కేసులు బనాయించారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా ఏకపక్షంగా వ్యవహరించారు. పలు ఘటనల్లో బాధితులపైనే కేసులు నమోదు చేశారు. ఒంగోలులో టీడీపీ నేతలపై రౌడీషీట్లు కూడా తెరిచారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో తెంపరితనం ప్రదర్శించారు. అలాంటి పోలీసు అధికారుల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. పోలీసు శాఖలో పైస్థాయి నుంచి కానిస్టేబుల్‌ వరకూ వైసీపీ సేవలో తరించిన వారంతా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు క్యూకడుతున్నారు. అదేసమయంలో వైసీపీ ఐదేళ్లపాలనలో టీడీపీ అనుకూలురుగా ముద్రపడి సుదూరప్రాంతాలకు బదిలీ అయిన, ఇతరత్రా ఇబ్బందులుపడిన పోలీసు అధికారులు, సిబ్బంది కూడా టీడీపీ శాసనసభ్యులను ఆశ్రయిస్తున్నారు.

ఇప్పుడెలా?

వైసీపీతో అంటకాగిన పోలీసు అధికారుల్లో వణుకు

ప్రభుత్వం మారడంతో గుండెల్లో గుబులు

ఐదేళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పలువురు

ప్రతిపక్ష నేతలకు వేధింపులు, అక్రమ కేసులు

ఒంగోలు సమతానగర్‌, రిమ్స్‌ ఘటనల్లో లేనివారిపైనా రౌడీషీట్లు

ఇప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నాలు

వైసీపీ నేతలతో అంటకాగారు. ప్రతిపక్షాలే టార్గెట్‌గా పేట్రేగిపోయారు. టీడీపీ నేతలను అనేక రకాలుగా వేధించారు. అక్రమ కేసులు బనాయించారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా ఏకపక్షంగా వ్యవహరించారు. పలు ఘటనల్లో బాధితులపైనే కేసులు నమోదు చేశారు. ఒంగోలులో టీడీపీ నేతలపై రౌడీషీట్లు కూడా తెరిచారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో తెంపరితనం ప్రదర్శించారు. అలాంటి పోలీసు అధికారుల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. పోలీసు శాఖలో పైస్థాయి నుంచి కానిస్టేబుల్‌ వరకూ వైసీపీ సేవలో తరించిన వారంతా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు క్యూకడుతున్నారు. అదేసమయంలో వైసీపీ ఐదేళ్లపాలనలో టీడీపీ అనుకూలురుగా ముద్రపడి సుదూరప్రాంతాలకు బదిలీ అయిన, ఇతరత్రా ఇబ్బందులుపడిన పోలీసు అధికారులు, సిబ్బంది కూడా టీడీపీ శాసనసభ్యులను ఆశ్రయిస్తున్నారు.

ఒంగోలు (క్రైం), జూన్‌ 9 : వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో జిల్లాలోని కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరించారు. టీడీపీ నేతలకు కనీస గౌరవం ఇవ్వకపోగా అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారు. వైసీపీ నేతల ఆదేశాలకు అనుగుణంగా రకరకాలుగా వేధించారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమాతో ఉన్న వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. టీడీపీ అధికారంలోకి వచ్చింది. తప్పులు చేసిన వారిపై చర్యలు తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో వైసీపీతో అంటకాగిన వారందరిలోనూ ఇప్పుడు బదిలీల భయం పట్టుకుంది. ఇప్పుడేం చేయాలి అన్న ఆలోచనలో పడ్డారు. మరలా గెలిచేది మేమే.. మాకే పనిచేయాలంటూ చెప్పిన వైసీపీ నేతలంతా ఇప్పుడు పత్తాలేకుండాపోయారు. దీంతో ఆయా పోలీసు అధికారులు, సిబ్బందిలో గుబులు మొదలైంది.

అంతా వివక్ష

ఎన్నికల కోడ్‌ వస్తే పోలీసు శాఖ పారదర్శకంగా పనిచేస్తుందనేది ఒకప్పటి మాట. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలీసులు వ్యవహరించిన తీరును చూస్తే ఈవిషయం అర్థమవుతుంది. కేసుల నమోదు నుంచి రౌడీషీట్లు తెరిచే వరకూ ఏకపక్షంగా వ్యవహరించారు. కొండపి నియోజకవర్గంలో పార్టీ మారకపోతే రౌడీషీట్లు తెరుస్తానని టీడీపీ నేతలను ఓ ఎస్సై బెదిరించాడు. పోలింగ్‌ సందర్భంగా దర్శి నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలలో వైసీపీ నేతలపై కేసుల నమోదుకు అక్కడి పోలీసు అధికారులు మీనమేషాలు లెక్కించారు. ఒంగోలులోని సమతానగర్‌లో వైసీపీ మూకల దాడులు, అనంతరం రిమ్స్‌లో బీభత్సం తదితర ఘటనల్లో బాధితులపైనే కేసులు నమోదు చేశారు. ఇదే విషయమై టీడీపీ నేతలపై రౌడీషీట్లు కూడా తెరిచారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రిటర్నింగ్‌ అధికారికి భద్రత కల్పించకుండా గుడ్లప్పగించి చూసిన పోలీసు అధికారులూ ఉన్నారు. ఇవి మచ్చుక ఉదాహరణలు మాత్రమే. ఎన్నికల సమయంలో పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు అనేక మంది వైసీపీ నేతల కనుసన్నల్లో పనిచేశారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు గత ఐదేళ్లుగా టీడీపీ నేతలు, కార్యకర్తలను అనేక రకాలుగా వేధించిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు వణికిపోతున్నారు.

పోలీసు శాఖలో కలవరం

జిల్లాలో నిన్నమొన్నటి వరకూ చట్టాన్ని పక్కన పెట్టి ఒకరకంగా అధికార పార్టీ రాజ్యాంగాన్ని అమలు చేసిన పోలీసు అధికారుల్లో కలవరం మొదలైంది. వారంతా బదిలీకి సిద్ధంగా ఉన్నప్పటికీ తాము చేసిన తప్పులపై చర్యలు లేకుండా చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అదేసమయంలో పోలీసుశాఖలో కొందరు ముఠాగా ఏర్పడి అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించారు. అనేక మందిని కానిస్టేబుళ్లు అని కూడా చూడకుండా టీడీపీ వారు అని ముద్ర వేసి పేరుపేరునా వెతికి మరీ సుదూర ప్రాంతాలకు బదిలీ చేయించారు. ఇప్పుడు ఈ ముఠా పరిస్థితి ఏమిటన్నది పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. అదేసమయంలో ఇంతకాలం లూప్‌లైన్‌లో ఉన్న వారు తమను బయటకు తీసుకురావాలని ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను కోరుతున్నారు.

ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు

వైసీపీ అనుకూలంగా బరితెగించి పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బంది టీడీపీలో తమకు తెలిసిన నాయకుల ద్వారా ఎమ్మెల్యేలను కలిసి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశామని కొందరు చెప్పుకుంటున్నారు. ఇంకొందరు తమను క్షమించాలని ప్రాథేయపడుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఇలాంటి వారి బదిలీ ఖాయంగా కనిపిస్తోంది. ఒంగోలులో ఏకపక్షంగా రౌడీషీట్లు తెరవడం, అసలు ఘటనలో లేని వారిపై కేసులు నమోదు చేయడం లాంటి విషయమై టీడీపీ నేతలు సీరియ్‌సగా ఉన్నారు. మొత్తంమీద రాష్ట్రంలో అధికార మార్పిడి పోలీసు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Updated Date - Jun 09 , 2024 | 10:41 PM