డబ్బు కొట్టు.. లైసెన్స్ పట్టు!
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:47 PM
దీపావళి పండుగకు తాత్కాలికంగా బాణసంచా విక్రయించేందుకు ఇచ్చే లైసెన్సుల విషయంలో రెవెన్యూ అధికారులు చేతివాటం చూపుతున్నారు. దరఖాస్తుదారులతో బేరాలు మాట్లాడుకొంటున్నారు.
దీపావళికి బాణసంచా విక్రయ
దుకాణాలకు అనుమతుల్లో చేతివాటం
దరఖాస్తుదారులతో రెవెన్యూ సిబ్బంది బేరాలు
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : దీపావళి పండుగకు తాత్కాలికంగా బాణసంచా విక్రయించేందుకు ఇచ్చే లైసెన్సుల విషయంలో రెవెన్యూ అధికారులు చేతివాటం చూపుతున్నారు. దరఖాస్తుదారులతో బేరాలు మాట్లాడుకొంటున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో పెద్దఎత్తున బాణసంచా విక్రయాలు
దీపావళి పండుగకు జిల్లాలో పెద్దఎత్తున బాణ సంచా విక్రయాలు జరుగుతాయి. మూడురోజులపాటు లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది. బాణ సంచా విక్రయాల ద్వారా మంచి లాభాలు కూడా ఉండటంతో వ్యాపారులు లైసెన్స్‌ల కోసం పోటీపడతారు. అయితే వారంతా ముందుగా దుకాణాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మీసేవ, సచివాలయాల నుంచి పలు రకాల ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు చేసుకుంటారు. వీటిని పరిశీలించిన అనంతరం రెవెన్యూ అధికారులు లైసెన్సులు మంజూరు చేస్తారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 22వతేదీతో గడువు ముగుస్తుంది.
మొదలైన వసూళ్లు
రెవెన్యూ అధికారుల నుంచి లైసెన్స్ పొందిన వారు ఈనెల 29నుంచి 31వతేదీ వరకు మూడురోజులపాటు ప్రభుత్వ యంత్రాంగం గుర్తించిన ప్రదేశాల్లో బాణ సంచా విక్రయించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో ఆర్డీవో కార్యాలయాలు కీలకంగా ఉంటాయి. దీపావళికి బాణసంచా వ్యాపారం జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే అధికంగా ఉంటుంది. ఆతర్వాత మార్కాపురం, కనిగిరి డివిజన్ కేంద్రాల్లో కూడా ఎక్కువగా జరుగుతుంది. మండల కేంద్రాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నా రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. ఈనేపథ్యంలో ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు ఇప్పటికే దరఖాస్తుదారులతో బేరసారాలు సాగిస్తున్నారు. కొన్నిచోట్ల వసూళ్లు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. జిల్లాకేంద్రమైన ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులు లైసెన్స్‌ల మాటున జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డీవోలు ఇటీవలనే బాధ్యతలు స్వీకరించడంతో ఆ ఉద్యోగులే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు.