Share News

రూ.5 వేలు కొట్టు.. బంకు పెట్టుకో..

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:08 AM

పట్టణంలో మున్సిపాలిటీ కాలువ పక్కన ఆర్‌అండ్‌బీ స్థలాలు అవి. వాటి వెనుక స్థలానికి సంబందించి ఆర్‌టీసీ సంస్థకు ఓ వైసీపీ నాయకుడి కుటుంబానికి కోర్టులో వివాదం నడుస్తోంది.

రూ.5 వేలు కొట్టు.. బంకు పెట్టుకో..

మార్కాపురం, జూన్‌ 11: పట్టణంలో మున్సిపాలిటీ కాలువ పక్కన ఆర్‌అండ్‌బీ స్థలాలు అవి. వాటి వెనుక స్థలానికి సంబందించి ఆర్‌టీసీ సంస్థకు ఓ వైసీపీ నాయకుడి కుటుంబానికి కోర్టులో వివాదం నడుస్తోంది. 2019 వరకు అక్కడ చిన్నపాటి బంకులు పెట్టుకొని పేదలు పొట్టపోసుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్కడ బంకులు తీసేశారు. కోర్టు వివాదం పరిష్కారం కాలేదు.కానీ అధికారం చేతిలో ఉండటంతో ఓ వైసీపీ నాయకుడికి దుర్బుద్ది పుట్టింది. చిరు వ్యాపారాలు చేసుకునే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని బంకులు ఏర్పాటు చేసుకున్న వారి నుంచి నెలకు అక్రమంగా రూ.5 వేలు వసూలు చేస్తున్నాడు. ఆ స్థలం పొడవునా ఇప్పటివరకు సుమారు 30 బంకులు వెలిశాయి. నెలకు రూ.లక్షన్నర వరకు బంకుల వాళ్ల వద్ద వసూలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నాడు. ఈ తతంగమంతా మున్సిపాలిటీ అధికారులకు తెలిసినా వైసీపీ నాయకుడు కావడంతో కిమ్మనకుండా చోద్యం చూస్తున్నారు.

కోర్టులో వివాదం నడుస్తున్నా ఆగని వసూళ్లు

స్థానిక కళాశాల రోడ్డులో 252/1బీ సర్వే నంబరులో 5.47 ఎకరాలను ఏపీఎస్‌ఆర్‌టీసీ డిపో ఏర్పాటు చేసేందుకు 1986లో ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసింది. అప్పట్లోనే సుమారు 3.00 ఎకరాల్లో డిపో నిర్మాణం చేశారు. మిగిలిన 2.47 ఎకరాలను ఖాళీగా వదిలారు. అప్పట్లోనే భూములు ఇచ్చిన వారికి ఆర్టీసీ సంస్థ పరిహారం అందజేసింది. కాలక్రమంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఖాళీ స్థలంపై కన్నేసిన అప్పటి భూ యజమానులు తక్కువ మొత్తంలో పరిహారం అందింది. దీంతో ఖాళీగా ఉన్న స్థలాన్ని అయినా తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దశాబ్దాలుగా ఈ సమస్య ఆర్టీసీకి, భూయజమానులకు మధ్య కోర్టులో పెండింగ్‌లోనే ఉంది. కానీ ప్రస్తుతం ఆ భూమిని అమ్మిన వారుసుల్లో ఒకరైన వైసీపీ నాయకుడు చివరికి రోడ్డుపక్కన బంకుల వారి వద్ద అక్రమంగా అద్దెలు వసూలు చేస్తున్నాడు.

ఆక్రమిత పన్ను సంవత్సరానికి రూ.2 వేలు

పట్టణంలో ప్రధాన రహదారుల వెంబడి కాలువలపై ఎవరైనా బంకులు ఏర్పాటు చేసుకుంటే పట్టణ ప్రణాళిక విభాగం ఆక్రమిత పన్ను వసూలు చేస్తుంది. ఆ విధంగా చూసినా పట్టణంలోని ఏ ప్రాంతంలో కూడా సంవత్సరా నికి రూ.2 వేలకు మించి బంకులు ఏర్పాటు చేసుకున్న వాళ్లు మున్సిపాలిటీకి చెల్లించడంలేదు. కానీ ఎలాంటి సంబందం లేకపోయినా ఆర్టీసీ డిపో సమీపంలో మాత్రం కేవలం స్థలం ముందు మున్సిపాలిటీ కాలువ, ఆర్‌అండ్‌బీకి చెందిన స్థలంలో బంకులు పెట్టుకున్నా, వైసీపీ జలగలు వదలడం లేదు. ముక్కుపిండి మరీ నెల కు వేలల్లో చిరు వ్యాపారులను దోచేయడం గమనార్హం. ఇందంతా మున్సిపాలిటీ ముఖ్య నాయకులు, అధికారులకు తెలిసినా అస్మదీయుడు కావడంతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:08 AM