పంట నష్టంపై ప్రభుత్వం దృష్టి
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:10 AM
జిల్లాలో ఇటీవలి వర్షాలకు జరిగిన పంట నష్టాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లా అధికారులు పంపిన ప్రాథమిక అంచనా నివేదికలను పరిశీలించి రైతువారీ నష్టాలు లెక్కించాలని ఆదేశించింది.
రైతువారీ గణనకు ఆదేశం
27 వరకు గడువు
జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
పెరుగుతున్న నష్టాలు
ఒంగోలు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవలి వర్షాలకు జరిగిన పంట నష్టాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లా అధికారులు పంపిన ప్రాథమిక అంచనా నివేదికలను పరిశీలించి రైతువారీ నష్టాలు లెక్కించాలని ఆదేశించింది. ఈనెల 27లోగా క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తిచేయాలన్న ఉత్తర్వులు వ్యవసాయశాఖ అధికారులకు అందాయి. మరోవైపు వాయుగుండం వీడినా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో పంట నష్టాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 10 నుంచి 20 వరకు సగటున జిల్లాలో 20 సెం.మీపైగా వర్షపాతం నమోదైంది. అలా దాదాపు పది రోజులు తెరపి లేకుండా కురిసిన వర్షాలతో పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. తొలుత వాయుగుండం ప్రభావంతో వర్షాలు అధికంగా కురిసిన తూర్పుప్రాంతంలో ఖరీఫ్ సీజన్‌లో పెద్దగా పంటలు సాగుకాక పోవడంతో నష్టం అంతగా ఉండకపోవచ్చని భావించారు. అయితే తర్వాత కూడా మూడు, నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురిశాయి. అలా ఈనెల 18వ తేదీ రాత్రి నుంచి తిరిగి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడ్డాయి. అలా ఈ మూడు రోజుల్లో సగటున జిల్లాలో 31.0 మి.మీ వర్షం కురిసింది. అందులో పంటలు అధికంగా సాగులో ఉన్న పశ్చిమప్రాంతంలో ప్రత్యేకించి దర్శి, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలలో అధికంగా కురిసింది. అలాగే సోమవారం పగటిపూట కూడా పలుచోట్ల ఒక మోస్తరు వర్షం కురిసింది.
కొనసాగుతున్న వానలు
జిల్లాలో సోమవారం కూడా వర్షం కురిసింది. సాయంత్రం ఐదు గంటల సమయానికి అత్యధికంగా కొత్తపట్నం మండలంలో 70.0 మి.మీ వర్షపాతం నమోదైంది. దొనకొండలో 53.50, పొదిలిలో 33.50, కనిగిరిలో 28.50, దర్శిలో 25.50 మి.మీ. కురిసింది. మార్కాపురం, కొమరోలు, హెచ్‌ఎంపాడు, గిద్దలూరు,. జరుగుమల్లి, సీఎస్‌పురం, కురిచేడు, కొనకనమిట్ల, పామూరు మండలాల్లో ఒక మోస్తరు వానలు పడ్డాయి. దీంతో పంట నష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం పగటి పూట మళ్లీ వర్షం పడటంతో నష్టాలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడటంతో తిరిగి తాజా అంచనాలను అధికారులను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 27లోగా క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అసిస్టెంట్, వీఆర్వోలు పరిశీలన చేసి జాబితాలను సిద్ధంచేసి 28న రైతువారీ ఖాతాలను ఆర్‌బీకేల వద్ద ప్రచురించాలి. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి లోటుపాట్లను సవరించి నవంబరు 2కు తుది జాబితాను సిద్ధం చేస్తే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నవంబరు 4 నాటికి కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించాలి. ఆ షెడ్యూల్‌కు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.