Share News

ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:10 PM

ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు శుభవార్త. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారికి నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఉచితంగా పాఠ్య, నోటు పుస్తకాలు, బ్యాగులు ఇవ్వాలని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేనెల 15లోపు పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త

నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఉచిత పుస్తకాలు

ప్రభుత్వ నిర్ణయం

వచ్చేనెల 15లోపు పంపిణీకి ఆదేశం

ఒంగోలు (విద్య), జూన్‌ 17 : ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు శుభవార్త. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారికి నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఉచితంగా పాఠ్య, నోటు పుస్తకాలు, బ్యాగులు ఇవ్వాలని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేనెల 15లోపు పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2013-14 విద్యా సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టింది. రాష్ట్ర విభజన అనంతరం 2014-15 నుంచి 2018-19 విద్యా సంవత్సరం వరకు టీడీపీ ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగించింది. 2019లో అఽధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తొలి ఏడాది మాత్రమే ఉచిత పుస్తకాలు ఇచ్చి అనంతరం నిలిపివేసింది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన నారా లోకేష్‌ వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులు ఉచితంగా పుస్తకాలు ఇవ్వని విషయం తెలుసుకొని విస్మయం వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.

జిల్లాలో ఆరువేల మందికి లబ్ధి

ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో ఇంటర్‌ చదువుతున్న ఆరువేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్‌లు బయట కొనుగోలు చేయాలంటే సుమారు రెండు వేల వరకూ వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ఏడాది నుంచి ఆభారం తగ్గనుంది. జిల్లాల వారీగా ఎవరికి ఎన్ని పుస్తకాలు కావాలో ఇండెంట్‌ పంపించాలని ఇంటర్‌ విద్య కార్యదర్శి బోర్డు ఆర్‌ఐవోలను ఆదేశించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు ఎన్ని పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అవసరమో వెంటనే ఇండెంట్‌ పంపించాలని ఆర్‌ఐవో విక్టర్‌ సైమన్‌ కళాశాలల హెచ్‌ఎంలను కోరారు. అదేవిధంగా జిల్లాలోని హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్‌లో ఎంత మంది చదువుతున్నారు, వారికి ఎన్నిపుస్తకాలు అవసరమో తెలియజేయాలని హైస్కూల్‌ హెచ్‌ఎంలను వాటిలో ఇంటర్‌ కోర్సులను మానిటర్‌ చేస్తున్న ఏవీ సుబ్బారావును ఆదేశించారు. వచ్చేనెల మొదటివారంలోపు ఈ పాఠ్య, నోటు పుస్తకాలు జిల్లాకు సరఫరా అయ్యే అవకాశం ఉంది.

Updated Date - Jun 17 , 2024 | 11:10 PM