Share News

పంచాయతీలకు పూర్వవైభవం!

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:49 PM

గ్రామ పంచాయతీ వ్యవస్థకు పూర్వవైభవం తెచ్చేందుకు నూతన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా సచివాలయ వ్యవస్థను తెచ్చి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీంతో పాలక వర్గాలు ఉన్నా ఉత్సవ విగ్రహాలుగా మార్చింది.

పంచాయతీలకు పూర్వవైభవం!

ముఖ్యమంత్రి నేతృత్వంలో విస్తృత చర్చలు

సచివాలయ వ్యవస్థతో నిర్వీర్యమైన గ్రామపంచాయతీలు

రెండింటిని అనుసంధానం చేసే దిశగా అడుగులు

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 3: గ్రామ పంచాయతీ వ్యవస్థకు పూర్వవైభవం తెచ్చేందుకు నూతన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా సచివాలయ వ్యవస్థను తెచ్చి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీంతో పాలక వర్గాలు ఉన్నా ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. ప్రజలకు ఏ అవసరం వచ్చినా గ్రామ పంచాయతీలకు కాకుండా సచివాలయాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సచివాలయ వ్యవస్థ నిర్వహణ బాధ్యత మాత్రం పంచాయతీలకు ఉన్నా అందులో పనిచేసే ఉద్యోగులు కానీ, ప్రభుత్వపరంగా అందించే సంక్షేమ పథకాలతోపాటు ఏ అవసరం వచ్చినా పంచాయతీలకు సంబంధం లేకుండా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్వహించింది. దీంతో గత మూడేళ్ల నుంచి గ్రామపంచాయతీల పాలకులు తమ హక్కులు తమకు కల్పించాలని అనేక సార్లు వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో పంచాయతీల్లో పాలన లేకపోవడంతో సర్పంచ్‌లు కానీ, ఇటు పంచాయతీ కార్యదర్శులు కానీ ఏమి చేయలేకపోయారు. అప్పటి ప్రభుత్వం ఏది చెప్పితే అదే చేయాల్సిన పరిస్థితి. జిల్లాలో 730 గ్రామపంచాయతీల పరిధిలో సుమారు 720 సచివాలయాలు ఉన్నాయి. ఆ సచివాలయాల పరిధిలోనే ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన నూతన ప్రభుత్వం అందులో పంచాయతీ వ్యవస్థకు పూర్వవైభవం తెచ్చేందుకు చర్యలు తీసుకుంది.

పంచాయతీ పరిధిలోకి సచివాలయ ఉద్యోగులు

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంలో జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ పంచాయతీరాజ్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, పంచాయతీల నిర్వీర్యం తదితర అంశాలన్నింటినీ సమీక్షించారు. గ్రామ పంచాయతీల స్థానంలో సచివాలయ వ్యవస్థను తేవడం ద్వారా అవి నిర్వీర్యమైనట్లు గుర్తించారు. సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులను పంచాయతీలో భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేసి తద్వారా పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రక్రియ పక్షంరోజుల్లో పూర్తవుతుందనే ప్రచారం ఉంది. ఇంకొకవైపు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గ్రామాల్లో మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆ సేవలను కూడా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు దూరం చేసి ఏ పనికావాలన్నా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా చేయిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే గ్రామాల అభివృద్ధితోపాటు ప్రజలకు సత్వర సేవలు అందుబాటులోకి తెచ్చేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jul 05 , 2024 | 11:49 PM